KCR – BJP : కేసీఅర్ స్పీడ్‌కు బ్రేకులు వేస్తున్న బీజేపీ..!?

ఏకంగా కేసీఆర్ కుమార్తె కవితపై ఢిల్లీ లిక్కర్ స్కాం కేసును ప్రయోగిస్తోంది. ఇప్పుడు కవితను అరెస్టు చేస్తే కేసీఆర్ ముందరికాళ్లకు బంధం వేసినట్లే. కేసీఆర్ ఎక్కడికెళ్లినా కవిత ఇష్యూకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందుకే కేసీఆర్ ను వ్యూహాత్మకంగా బంధిస్తోంది బీజేపీ.

  • Written By:
  • Publish Date - March 9, 2023 / 01:46 PM IST

కేసీఆర్ స్పీడ్‌కు బ్రేకులు వేసేందుకే కవిత అంశాన్ని కేంద్రం తెరపైకి తెచ్చిందా.. అంటే అవుననే సమాధానమే వస్తోంది. దేశవ్యాప్తంగా బీజేపీ అంతు చూడాలనేది కేసీఆర్ ప్లాన్. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా మోదీ సర్కార్ ను గద్దె దించాలనుకుంటున్నారు. ఇందుకోసం ఆయన టీఆర్ఎస్ పార్టీని ఏకంగా జాతీయ పార్టీగా మార్చేశారు. దేశంలో పలు ప్రాంతీయ పార్టీలున్నాయి. కానీ అవేవీ కేసీఆర్ స్థాయిలో బీజేపీపై యుద్ధాన్ని ప్రకటించలేదు. కానీ కేసీఆర్ మాత్రం ఓపెన్ గానే బీజేపీపై సమరభేరి మోగించారు. దీన్ని ఏమాత్రం సహించలేదని బీజేపీ.. కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగించేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తోంది.

దేశంలో బీజేపీ, కాంగ్రెసేతర విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చి కేంద్రంలో అధికారంలోకి రావాలనేది కేసీఆర్ ప్లాన్. కాంగ్రెసేతర పక్షాలన్నింటినీ ఏకం చేయడం వరకూ బీజేపీకి ఓకే. కానీ తమపైన కూడా కక్షగట్టడం, అందుకు తమకు వ్యతిరేకంగా ఉన్న వాళ్లందరినీ పోగేసి తమపైనే యుద్ధం ప్రకటించడం బీజేపీకి ఏమాత్రం సహించడం లేదు. అందుకే కేసీఆర్ ను ఊరికే వదలకూడదని బీజేపీ హైకమాండ్ భావిస్తున్నట్టు కనిపిస్తోంది. పైగా తెలంగాణలో తాము అధికారంలోకి రావాలని తపిస్తున్న బీజేపీకి కేసీఆర్ ను తొక్కేయడం అనివార్యం. అందుకే టార్గెట్ కేసీఆర్ గా పెట్టుకుంది బీజేపీ అధిష్టానం.

శరద్ యాదవ్, మమత బెనర్జీ, కుమారస్వామి లాంటి నేతలు బీజేపీతో అవసరార్థం స్నేహం చేస్తుంటారు. వాళ్లతో బీజేపీ పెద్దగా టెన్షన్ తీసుకోవట్లేదు. అయితే కేసీఆర్ విషయం అలా కాదు. ఇక్కడ కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేసింది బీజేపీ. ఎలాగైనా ఈసారి కేసీఆర్ ను ఓడించి తెలంగాణలో పాగా వేయాలనుకుంటోంది. ఇది కేసీఆర్ కు అస్సలు గిట్టని విషయం. అందుకే కేసీఆర్ బీజేపీపై యుద్ధం ప్రకటించారు. ఈ యుద్ధం రాష్ట్రంలో చేస్తే సరిపోదు. దేశవ్యాప్తంగా చేయాలి. అందుకోసం బీజేపీయేతర పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెస్తున్నారు. ఇది బీజేపీకి అస్సలు నచ్చట్లేదు.

అందుకే కేసీఆర్ ను తెలంగాణ గడప దాటి రానీయకుండా ఉండేందుకు తమ వద్ద ఉన్న అస్త్రాలన్నింటినీ బయటకు తీస్తోంది. ఏకంగా కేసీఆర్ కుమార్తె కవితపై ఢిల్లీ లిక్కర్ స్కాం కేసును ప్రయోగిస్తోంది. ఇప్పుడు కవితను అరెస్టు చేస్తే కేసీఆర్ ముందరికాళ్లకు బంధం వేసినట్లే. కేసీఆర్ ఎక్కడికెళ్లినా కవిత ఇష్యూకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందుకే కేసీఆర్ ను వ్యూహాత్మకంగా బంధిస్తోంది బీజేపీ. మరి దీన్ని కేసీఆర్ ఎలా ఎదుర్కోబోతారనేది చూడాలి.