BJP: రాజకీయాల్లో నిన్నామొన్నటి వరకు ఆడిందే ఆటగా ఉన్న బీజేపీకి ఇప్పుడు అసలు విషయం అర్థమైనట్లుంది. అధికార బలం కారణంగా పాత మిత్రులను దూరం చేసుకున్న బీజేపీ.. ఇప్పుడు కొత్త మిత్రుల కోసం వెతుకులాట ప్రారంభించింది. రాబోయే ఎన్నికల్లో ఒంటరిగా గెలుపు సాధ్యం కాదని భావించిన బీజేపీ ఎన్డీయే కూటమిని విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. తమతో కలిసొచ్చే పార్టీలను ఎన్డీయే కూటమిలో చేర్చుకునేందుకు సిద్ధమైంది.
బీజేపీకి ఇప్పుడు కాలం కలిసిరావట్లేదు. గతంలోలాగా మోదీ హవా, హిందూత్వ వంటి సిద్ధాంతాలతో గెలిచేద్దామంటే జరిగే పని కాదు. ఎంతో పట్టున్న కర్ణాటకలో ఓడిపోయింది. ఇతర రాష్ట్రాల్లోనూ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ప్రజల్లో బీజేపీపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో తమతో కలిసొచ్చే పార్టీలతో పొత్తు కోసం బీజేపీ ఆరాటపడుతోంది. పొత్తుల ద్వారా అయినా సరే.. వివిధ రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి మళ్లీ అధికారం చేపట్టాలని భావిస్తోంది. మిత్రపక్షాల్ని దగ్గర చేసుకోవడం ద్వారా బలం పెంచుకోవాలని బీజేపీ ఆశిస్తోంది. గత ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే మెజారిటీకి మించిన సీట్లు సాధించింది. ఈసారి ఆ పరిస్థితి లేదు. చాలా సీట్లు తగ్గిపోతాయి. అందుకే ఈ సీట్లను మిత్రపక్షాల ద్వారా భర్తీ చేయాలని బీజేపీ భావిస్తోంది.
ఇప్పటికే తమకు అనుకూలంగా ఉన్న ఏపీలోని వైసీపీ, ఒడిశాలోని బిజూ జనతా దళ్, తెలంగాణలోని బీఆర్ఎస్.. బీజేపీకి దగ్గరగా ఉంటున్నాయి. కానీ, ఇవేవీ ఎన్డీయే కూటమిలో చేరేందుకు సిద్ధంగా లేవు. ముఖ్యంగా ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ కనుక బీజేపీతో కలిస్తే కొన్ని వర్గాల ఓట్లు దూరమయ్యే అవకాశం ఉంది. దీనికి ఈ రెండు పార్టీలూ సిద్ధంగా లేవు. బయటినుంచి అవసరమైనప్పుడు మద్దతిస్తాయి అంతే. బిజూ జనతా దళ్ మాత్రం కేంద్రంలో ఉన్నపార్టీకి మద్దతిస్తుంటుంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ సిద్ధాంతాన్ని అనుసరిస్తుంది. అలాగని కూటమిలో చేరదు. ఈ పార్టీలు అవసరమైన సందర్భంలో మద్దతుగా ఉన్నప్పటికీ.. ఎన్డీయేలో చేరే అవకాశం లేదు.
చిన్న పార్టీలతోనే ఎన్డీయే కూటమి
ఇంతకాలం కేంద్రంలో బీజేపీ బలంగా ఉంది. ఒంటరిగానే కావాల్సిన మెజారిటీ ఉంది. పార్లమెంట్ బిల్లుల విషయంలో కొన్ని పార్టీలు బయటి నుంచి పూర్తి మద్దతు ఇస్తున్నాయి. అందువల్ల మిత్రపక్షాలతో పెద్దగా అవసరం రాలేదు. అందువల్ల చిన్న పార్టీలతోనే ఎన్డీయే నిండిపోయింది. మహారాష్ట్రలోని శివసేన (ప్రస్తుతం షిండే వర్గం), రాష్ట్రీయ జన్ లోక్ శక్తి, తమిళనాడుకు చెందిన అన్నా డీఎంకే, అప్నాదళ్‌కు చెందిన సోనేలాల్ వర్గం మాత్రమే ఎన్డీయే కూటమిలో ఉన్నాయి. ఇవన్నీ పెద్దగా సీట్లు లేని చిన్న పార్టీలే. రాబోయే ఎన్నికల్లో వీటి ప్రభావం అంతంతమాత్రమే. వీటిని నమ్ముకుంటే తిరిగి అధికారంలోకి రావడం కష్టమేనన్న నిర్ణయానికొచ్చింది బీజేపీ. అందుకే కొత్త పొత్తుల కోసం ప్రయత్నిస్తోంది.
టీడీపీ, జేడీఎస్ చేరుతాయా..?
గతంలో ఎన్డీయే కూటమిలో అనేక పార్టీలు ఉండేవి. వాజ్‌పేయి హయాంలో దాదాపు ముప్పై వరకు పార్టీలు కూటమిలో ఉండేవి. కాలక్రమేణా అవి దూరమయ్యాయి. ముఖ్యంగా 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి అనేక పార్టీలను ఎన్డీయే పక్కనపెట్టింది. ఇప్పుడు ఆ పార్టీల కోసమే ఎదురు చూస్తోంది. గతంలో టీడీపీకి డోర్స్ మూసేశామని చెప్పిన అమిత్ షా ఇటీవల చంద్రబాబుతో భేటీ అయ్యారు. కలిసి పనిచేసే అంశంపై చర్చించారు. అలాగే పంజాబ్‌కు చెందిన అకాళీదల్, కర్ణాటకకు చెందిన జేడీఎస్ వంటి పార్టీలను కూడా ఎన్డీయే కూటమిలో చేరాల్సిందిగా ఆహ్వానిస్తోంది. ఆయా పార్టీలు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్డీయే వైపు చూస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ పార్టీలు బీజేపీతో కలిసి పని చేసే అవకాశం ఉంది. బీజేపీ తిరిగి అధికారం దక్కించుకోవాలంటే ఇలాంటి ప్రాంతీయ పార్టీల మద్దతు తప్పనిసరిగా అవసరం.