AP Politics: ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన అంశం జగన్, వైసీపీపై బీజేపీ విమర్శలు. నాలుగేళ్లు లేనిది ఉన్నట్లుండి రెండు, మూడు రోజులుగా జగన్ పాలనపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదంతా నిజమే అనుకుంటే పొరపాటే. జగన్-బీజేపీ వ్యూహంలో భాగంగానే వైసీపీపై బీజేపీ విమర్శలు చేస్తోంది. టీడీపీ-జనసేన టార్గెట్‌గానే ఈ ప్లాన్ అమలవుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
వైసీపీకి బీజేపీ.. బీజేపీకి వైసీపీ మద్దతుగానే ఉంటున్నాయని అందరికీ తెలిసిందే. ఏపీ విషయంలో కేంద్రం ఎంత అన్యాయం చేస్తున్నా జగన్ అండ్ కో నోరు మెదపడం లేదు. ప్రత్యేక హోదా దగ్గరి నుంచి, విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం, రైల్వే జోన్, పోలవరం జాతీయ హోదా.. ఇలా అనేక విషయాల్లో ఏపీకి కేంద్రం మొండిచేయి చూపింది. వీటన్నింటినీ జగన్, వైసీపీ ఎంపీలు, ఆ పార్టీ నేతలెవరూ ప్రశ్నించింది లేదు. పైగా కేంద్రానికి ప్రతి విషయంలోనూ వైసీపీ మద్దతు ఇస్తూ వచ్చింది. ఇక ఏపీలో ప్రతిపక్షాల్ని జగన్ ఎంత ఇబ్బంది పెడుతున్నా.. వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు. ఏపీలో జగన్‌కు పూర్తి అండగా ఉంటుంది. ఆ పార్టీకి ఉన్న ఎంపీ సీట్లు బీజేపీకి చాలా అవసరం. అందుకే ఆ పార్టీకి బీజేపీ అండగా ఉంటోంది. దీంతో బీజేపీ, వైసీపీ ఒక్కటే అన్న భావన అందరిలోనూ కలిగింది. ఇంతకాలం ఈ అంశానికి అంతగా ప్రాధాన్యం లేదు. కానీ, రాబోయేది ఎన్నికల సమయం. వైసీపీ-బీజేపీ దోస్తీ.. కచ్చితంగా ఎన్నికలను ప్రభావితం చేయగలిగేదే. రెండూ ఒకటే అని జనం నమ్మితే బీజేపీకి ఓట్లు పడవు. రాష్ట్రానికి ఏమీ చేయని బీజేపీతో దోస్తీ కడితే వైసీపీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందుకే ఈ మచ్చను చెరిపేయాలని రెండు పార్టీలు డిసైడైనట్లుంది తాజా పరిణామాలు చూస్తుంటే.
జగన్-బీజేపీ నయా స్కెచ్
వైసీపీ-బీజేపీ మధ్య బంధం ఏపీలో రెండు పార్టీలకూ చిక్కు తెచ్చేలా ఉంది. దీంతో రెండు పార్టీలూ ఒక్కటి కాదు అన్న భావన కలిగించడానికి జగన్, మోదీ కలిసి కొత్త డ్రామాకు తెరతీశారని విశ్లేషకులు అంచనా. పైగా బీజేపీపై ఉన్న జనాగ్రహం ప్రభావం తమపై పడకూడదని జగన్ అనుకుంటున్నారు. దీనిలో భాగంగానే జేపీ నద్దా, అమిత్ షా వైసీపీపై విమర్శలు గుప్పించారు. ఇకపై కూడా ఒకరినొకరు విమర్శించుకుంటారు. కొంతకాలం ఈ నాటకం సాగుతుంది. దీంతో రెండు పార్టీలూ ఒక్కటి కాదు అని ఏపీ ప్రజలు భావిస్తారని వారి వ్యూహం. గతంలో ఢిల్లీ వెళ్లిన జగన్ ఈ విషయంపై బీజేపీ పెద్దలతో మాట్లాడారు. వాళ్ల ప్రణాళికలో భాగంగానే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునేందుకు రంగంలోకి దిగారు. జగన్‌పై బీజేపీ విమర్శలు చూస్తే ఆ రెండు పార్టీల మధ్య దూరం పెరిగిందని, టీడీపీ, జనసేన భావిస్తాయి. దీంతో తమతో కలుపుకొని పోయేందుకు ప్రయత్నిస్తాయి. ఫలితంగా రాష్ట్రానికి ఏమీ చేయని బీజేపీతో జట్టు కట్టిన పార్టీలుగా మారుతాయి టీడీపీ, జనసేన. జగన్ బీజేపీకి దూరంగా ఉంటున్నట్లవుతుంది. ఇది అంతిమంగా టీడీపీ-జనసేన కూటమికే నష్టం కలిగిస్తుందని విశ్లేషకుల అభిప్రాయం. జగన్-మోదీ వ్యూహంలో భాగంగానే ఇటీవల చంద్రబాబును బీజేపీ పెద్దలు ఢిల్లీ పిలిపించినట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీ-జనసేన కూటమితో బీజేపీ కలిసినా.. కలవకపోయినా.. పొత్తు కోసం ప్రయత్నించడం, మరోవైపు వైసీపీని బీజేపీ విమర్శించడం వల్ల వైసీపీ-బీజేపీ ఒక్కటి కాదని నమ్మించే అవకాశమైతే ఉంటుంది.
పాపం బాబు.. జగన్-మోదీ వ్యూహంలో చిక్కుకున్నారా?
జగన్-బీజేపీ ట్రాపులో చంద్రబాబు పడ్డారనిపిస్తోంది తాజా పరిణామాలు చూస్తుంటే. ఒకవైపు బీజేపీ తమతో కలిసి రావాలని టీడీపీ భావిస్తోంది. పొత్తుల విషయంలో బీజేపీ విషయంలో కూడా కాస్త సానుకూల వైఖరే కనిపిస్తోంది. అయితే, ఈ పొత్తును ఎంతవరకు నమ్మాలో చంద్రబాబుకు తెలియడం లేదు. ఈ విషయంలో చంద్రబాబుకు అవగాహన ఉంది. అందుకే బీజేపీతో పొత్తు విషయంలో ఇంకా స్పష్టత ఇవ్వలేదు. పార్టీ శ్రేణులను కూడా ఈ విషయంలో మాట్లాడొద్దని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో మాత్రమే పొత్తుల గురించి చర్చిద్దామన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఎంతవరకు లాభం ఉంటుందో తెలియదు. జనసేన-టీడీపీ-బీజేపీ ఓట్ల షేరింగ్ విషయంలో ఇంకా స్పష్టతలేదు. పైగా ఈ పొత్తును వైసీపీ తప్పుబట్టి లబ్ధి పొందుతుంది. వైసీపీ-బీజేపీ వ్యూహాలను ఒక పక్క గమనిస్తూనే.. మరోపక్క పార్టీ బలోపేతంపై బాబు దృష్టిపెట్టారు. బీజేపీతో పొత్తును టీడీపీ నేతలు కూడా తప్పుబడుతున్నారు.
కర్ణాటక ఫలితాలతో మారిన వ్యూహం
ఎప్పటికప్పుడు వ్యూహాల్ని మార్చడంలో బీజేపీ దిట్ట. ఏపీలో కూడా కొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. దీనికి కర్ణాటక అసెంబ్లీ ఫలితాలు కూడా కారణమే. అక్కడ కొన్ని ప్రాంతాల్లో ఏపీకి చెందిన ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. వాళ్లంతా కాంగ్రెస్‌కే ఓటు వేశారు. దీంతో బీజేపీకి షాక్ తగిలింది. జగన్‌కు బీజేపీ మద్దతుగా ఉన్నా కర్ణాటకలో ఏపీ వాసులు ఓట్లు వేయలేదు. వాళ్లలో ఎక్కువ మంది టీడీపీ మద్దతుదారులే ఉన్నారు. వాళ్లంతా బీజేపీపై ఆగ్రహంగా ఉన్నారు. ఏపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వైసీపీ, బీజేపీ ఓటమి పాలయ్యాయి. బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేస్తుండటం, రెండు పార్టీలు ఒక్కటే అని ప్రజలు భావిస్తుండటమే దీనికి కారణమని బీజేపీ పెద్దలు గ్రహించారు. అందుకే ఇది సరికాదని చెప్పేందుకు రెండు పార్టీలు ఇలా ప్రయత్నిస్తున్నాయన్న వాదన మొదలైంది.