Boycott Bharat : బంగ్లాదేశ్ లో బాయ్ కాట్ భారత్… ! తప్పుబట్టిన ప్రధాని హసీనా !!

మన పొరుగున భారత్ తో స్నేహంగా ఉండే బంగ్లాదేశ్ లో ఇప్పుడు ఇండియా వ్యతిరేక ఉద్యమం ఊపందుకుంటోంది. బాయ్ కాట్ భారత్ (#Boycott Bharat) అంటూ సోషల్ మీడియాలో హోరెత్తుతోంది.

మన పొరుగున భారత్ తో స్నేహంగా ఉండే బంగ్లాదేశ్ లో ఇప్పుడు ఇండియా వ్యతిరేక ఉద్యమం ఊపందుకుంటోంది. బాయ్ కాట్ భారత్ (#Boycott Bharat) అంటూ సోషల్ మీడియాలో హోరెత్తుతోంది. భారతీయుల ఉత్పత్తులను నిషేధించాలని అక్కడి జనం కోరుతున్నారు. ఈ ఉద్యమానికి ప్రతిపక్ష పార్టీ BNP నేతలు మద్దతు ఇస్తున్నారు.

బంగ్లాదేశ్ లో షేక్ హసనా ఐదోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆమె మొదటి నుంచీ భారత్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. దాంతో ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ BNP అండతో బాయ్ కాట్ భారత్ ఉద్యమం మొదలైంది. భారత్ నుంచి వచ్చే వస్తువులను కొనవద్దు, వాడ వద్దంటూ బంగ్లాదేశ్ ప్రజలను కోరుతున్నారు. ప్రస్తుతం పారిస్ లో ప్రవాప జీవితం గడుపుతున్న బంగ్లాదేశ్ డాక్టర్ పినాకీ భట్టాచార్య ఈ ఆన్ లైన్ ఉద్యమం ప్రారంభించారు. బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకుంటోందని కొందరు ప్రవాస బంగ్లాదేశీలు ఆరోపిస్తున్నారు. షేక్ హసీనాయే మళ్ళీ ప్రధాని అయ్యేలా ఇండియా అప్రజాస్వామిక చర్యలకు పాల్పడిందని వాళ్ళు ఆరోపిస్తున్నారు. యూరప్ దేశాలతో పాటు అమెరికాలో ఉంటున్న ప్రవాస బంగ్లాదేశీయులు ఈ బాయ్ కాట్ భారత్ ఉద్యమాన్ని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు.

బాయ్ కాట్ భారత్ నినాదంపై బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మండిపడ్డారు. ఇండియా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులను బాయ్ కాట్ చేయాలని అనుకుంటే… BNP నేతలు ముందుగా తమ భార్యలు కట్టుకున్న చీరలను కాల్చేయాలని అన్నారు. BNP అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆ పార్టీ నేతల భార్యలు భారత్ కు వెళ్ళి పెద్ద సంఖ్యలో చీరలు కొనుక్కొని వచ్చారని ప్రధాని అన్నారు. భారత్ నుంచి దిగుమతి అయ్యే మసాలాలు, ఉల్లి, వెల్లుల్లి, అల్లం ఇవేమీ లేకుండా ఆహార వండుకొని తింటారా అని ఆమె ప్రశ్నించారు. రంజాన్ మాసం కావడంతో బంగ్లాదేశ్ కు 50 వేల టన్నుల ఉల్లిగడ్డలను పంపాలని కేంద్ర ప్రభుత్వం ఈమధ్యే నిర్ణయిం తీసుకుంది. బాయ్ కాట్ భారత్ ఉద్యమం జనం నుంచి పుట్టింది కాదనీ… కేవలం రాజకీయ ఎజెండాంతోనే తయారైందని కొందరు విశ్లేషకులు మండిపడుతున్నారు.