తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. రేవంత్ రెడ్డి ఈ మధ్య కాలంలో ప్రదర్శిస్తున్న దూకుడుతో పాటుగా చేస్తున్న వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎవరు ఎన్ని విమర్శలు చేస్తున్నా తన దూకుడు మాత్రం తగ్గించడం లేదు రేవంత్ రెడ్డి. హైడ్రా, మూసీ ఈ రెండు రేవంత్ ఇప్పుడు సవాల్ గా తీసుకుని చేయడం పట్ల బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మాజీ మంత్రులు కేటిఆర్, హరీష్ రావు ఇద్దరూ దూకుడుగా రేవంత్ ను టార్గెట్ చేస్తున్నారు. అయినా సరే ఆయన మాత్రం తగ్గడం లేదు.
ఈ నేపధ్యంలో మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కేసీఆర్ ఇంటికి రేవంత్ రెడ్డి వెళ్ళాలి అనుకుంటున్నారు అనే వార్తలు సంచలనం రేపుతున్నాయి. అసలు రేవంత్ వ్యూహం ఏంటో అర్ధం కాక ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. కేసీఆర్ ఆరోగ్యంపై గత కొన్నాళ్ళుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల కవిత కేసీఆర్ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఆయన యాక్టివ్ గా కనపడలేదు. కేసీఆర్ కు వైద్యం అత్యున్నత స్థాయిలో జరుగుతోంది అని అమెరికా కూడా తీసుకుని వెళ్ళే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.
ఇటీవల కేటిఆర్ అమెరికా వెళ్ళడానికి కారణం కూడా అదే అనే వార్తలు వచ్చాయి. కవిత… వెళ్ళిన సమయంలో కేసీఆర్ కనీసం వంగలేకపోవడం, ఆయన ముఖంలో హావ భావాల్లో నవ్వు కూడా లేకపోవడంతో అనేక అనుమానాలు వచ్చాయి. ఇక కేసీఆర్ నుంచి మీడియా సమావేశాలు కూడా పెద్దగా లేవు ఈ మధ్య కాలంలో. ఆయన అసెంబ్లీ సమావేశాలకు కూడా పెద్దగా రావడం లేదు. హైడ్రా దూకుడుపై కేసీఆర్ ఏ విధమైన వ్యాఖ్యలు చేయలేదు. ఇక మూసి బాధితుల విషయంలో పార్టీ అగ్ర నేతలు ధర్నాలు చేస్తున్నా కేసీఆర్ నుంచి స్పందన లేదు.
ఈ నేపధ్యంలో రేవంత్ రెడ్డి ఏమనుకున్నారో ఏమో గాని… కేసీఆర్ ఇంటికి వెళ్లి ఆయన్ను ముఖ్యమంత్రి హోదాలో పరామర్శించాలి అని భావిస్తున్నారట. రేవంత్ ముఖ్యమంత్రి అయిన తొలి నాళ్లలో కూడా ఇలాగే పరామర్శించారు. ఇప్పుడు మరోసారి కేసీఆర్ ఇంటికి వెళ్లి పరామర్శించాలి అనుకోవడం వెనుక కారణం ఎమై ఉంటుంది అనే దానిపై పెద్ద చర్చే జరుగుతోంది. అయితే తన కుటుంబంలో జరిగే ఓ కార్యక్రమానికి కేసీఆర్ ను రేవంత్ ఆహ్వానించాలి అని భావిస్తున్నారని అందుకే వెళ్తున్నారని కొందరు అంటున్నారు.
ఏది ఎలా ఉన్నా ఇప్పుడు రేవంత్ గనుక కేసీఆర్ ఇంటికి వెళ్తే మాత్రం బాహ్య ప్రపంచానికి ఏదో కొత్త విషయం తెలియడం ఖాయం అంటున్నాయి రాజకీయ వర్గాలు. గతంలో కేసీఆర్ విషయంలో రేవంత్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఆయన ఆరోగ్యంగా లేరని పలు సభల్లో కూడా మాట్లాడారు. అయితే ఈ వ్యాఖ్యలకు కేసీఆర్ స్వయంగా బయటకు వచ్చి సమాధానం చెప్పేవారు. అయితే ఇప్పుడు మాత్రం అసలు ఆయన ఎలా ఉన్నారు అనే సమాచారం కూడా బయటకు రావడం లేదు. మరి రేవంత్ వెళ్తే ఏం బయటకు వస్తుందో చూడాలి.