T CONGRESS: కాంగ్రెస్‌లోకి జంప్ కానున్న నేతలు వీళ్లేనా..? ఈ ప్రచారంలో నిజమెంత..!

సీట్లు దక్కని అసంతృప్తులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. బీజేపీలోని కొందరు నేతలు కూడా కాంగ్రెస్‌లోకి వస్తారనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌లో సీట్లు దొరక్కుంటే మాత్రమే బీజేపీ వైపు చూసే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న సమాచారం ప్రకారం ఈ నేతలే కాంగ్రెస్‌వైపు చూస్తున్నారు.

  • Written By:
  • Publish Date - September 7, 2023 / 08:24 PM IST

T CONGRESS: తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్ చుట్టూనే తిరుగుతున్నాయి. బీఆర్ఎస్ ఏడుగురికి తప్ప దాదాపు సిట్టింగులకే సీట్లు కేటాయించింది. దీంతో సీట్లు దక్కని అసంతృప్తులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. బీజేపీలోని కొందరు నేతలు కూడా కాంగ్రెస్‌లోకి వస్తారనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌లో సీట్లు దొరక్కుంటే మాత్రమే బీజేపీ వైపు చూసే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న సమాచారం ప్రకారం ఈ నేతలే కాంగ్రెస్‌వైపు చూస్తున్నారు.
ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నేత తుమ్మల కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయం. ఇటీవలే హరీష్ రావుపై, బీఆర్ఎస్ పార్టీపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ఆ పార్టీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు కూడా కాంగ్రెస్‌లో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. అయితే, ఆయనతోపాటు, తనయుడికి కూడా టిక్కెట్ అడుగుతుండటంతో ఈ అంశంపైనే ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయంలో కొద్ది రోజుల్లో స్పష్టత రావొచ్చు. కాంగ్రెస్ నుంచి సరైన హామీ వస్తే మైనంపల్లి కాంగ్రెస్‌లో చేరడం ఖాయం. తనకు టిక్కెట్ కేటాయించకపోవడంతో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కూడా బీఆర్ఎస్‌పై అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిదే. ఆమె కూడా దాదాపు పార్టీ మారడం ఖాయం. కాంగ్రెస్‌లో చేరితేనే మంచిదనే అభిప్రాయంతో ఆమె ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది.

నల్గొండ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్‌లో చేరాలని ప్రయత్నిస్తున్నారు. ఆయన నకిరేకల్ టిక్కెట్ ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరితోపాటు మాజీ ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాసరెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా సీనియర్ నేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు వంటి నేతలు కూడా కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు సమాచారం. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కూడా తనకు టిక్కెట్ కేటాయించకపోవడంతో పార్టీ మారే యోచనలో ఉన్నారు. ఆయన కూడా కాంగ్రెస్‌వైపే చూస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఇంకొందరు నేతలు, బీఆర్ఎస్ అసంతృప్త నేతలు కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది. అందువల్ల కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఆలస్యమవుతోందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.