వార్ వన్ సైడ్ అన్నట్లు ఒకప్పుడు కనిపించిన తెలంగాణ రాజకీయం.. ఇప్పుడు సెగలు కక్కుతోంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఫైట్ కాస్త.. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ యుద్ధంలా మారింది. రాష్ట్రంలో ! ఎక్కడైనా ప్రత్యర్ధులపై పోరాటం చేస్తారు. కాంగ్రెస్ లో మాత్రం నాయకులు సొంత పార్టీ వాళ్ళ పైనే ఫైట్ చేస్తారు. ఈ రచ్చ వల్లే కాంగ్రెస్ పార్టీ బలం రోజురోజుకూ తగ్గుతూ వస్తుంది. ఆ రచ్చ మరింత ముదిరితే డిగ్గీ రాజా ఎంటర్ అయి పరిస్థితి కూల్ చేసే ప్రయత్నం చేశారు. సీనియర్ల డిమాండ్‌కు అధిష్టానం కూడా ఓకే చెప్పింది. ఇంచార్జిగా మాణిక్కం ఠాకూర్‌ను మార్చి.. మాణిక్ రావును రంగంలోకి దింపింది.
ఐతే సీనియర్ల ప్రధాన డిమాండ్ మరొకటి మాత్రం అలానే మిగిలిపోయింది. రేవంత్ రెడ్డిని కూడా మార్చాలని సీనియర్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రచ్చ ఇలా జరుగుతుండగానే.. కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్ పొత్తు ప్రచారం మొదలైంది. హస్తం పార్టీలోని కొందరు సీనియర్లు బీఆర్ఎస్‌తో పొత్తు ప్రతిపాదనను ఏఐసీసీ ముందు పెట్టారని ప్రచారం జరిగింది. ఐతే భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణకు వచ్చిన రాహుల్.. పొత్తుల ప్రస్తావన ఎత్తితే మాములుగా ఉండదు అని వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఈ ప్రతిపాదన పెట్టిన నేతలు.. ఇప్పుడు కొత్త స్ట్రాటజీలు ఫాలో అవుతున్నారా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. కాంగ్రెస్‌లో గులాబీ బ్యాచ్ ఒకటి ఉందనే చర్చ ఎప్పటి నుంచో నడుస్తోంది. పేర్లు బయటకు వినిపించకపోయినా.. వాళ్లలో వాళ్లు ఈ కారణం చెప్పుకొని చేసుకునే మాటల దాడి అంతా ఇంతా కాదు. ఐతే హస్తం పార్టీలో కారు పార్టీకి అనుకూలంగా ఉన్న నేతలు ఇప్పుడు కొత్త లెక్కలు వేస్తున్నారని టాక్.
గత రెండు దఫాలతో కంపేర్ చేస్తే.. బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు క్షేత్రస్థాయిలో అంత అనుకూలంగా లేదు. పార్టీ బలంగా కనిపిస్తున్నా.. జనాల మైండ్ సెట్ మారింది. వందకు పైగా సీట్లు ఖాయం అనుకుంటున్నా.. అంత సీన్ లేదు అని కాంగ్రెస్ లో బీఆర్ఎస్ బ్యాచ్ లెక్కలేసుకుంటోందట. ఈ ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కారు పార్టీకి 45 నుంచి 50 మధ్య సీట్లు వస్తాయని.. అదే జరిగితే కాంగ్రెస్‌తో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని.. హస్తం పార్టీలో కొందరు నాయకులు లెక్కలేసుకుంటున్నారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో 25 సీట్లు తెచ్చుకున్నా చాలు.. చక్రం తిప్పొచ్చని అంచనాలు వేస్తున్నారు. మరికొందరయితే.. ఓ అడుగు ముందుకేసి.. పొత్తు కుదిరితే తమకేంటి.. ఏ పదవి కోరాలని.. ఓ లిస్ట్ కూడా రెడీ చేసుకుంటున్నారట.
కొందరు అయితే.. ఈ మంత్రి పదవే అడగాలని ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారని టాక్. కాంగ్రెస్ బలంగా ఉన్న చాలా చోట్ల బీఆర్ఎస్ వీక్‌గా ఉంది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండతో మరికొన్ని జిల్లాలు ఈ లిస్టులో ఉన్నాయ్. వీటిలో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటే చాలు.. అవసరం అయితే ఆ తర్వాత జంప్ చేయొచ్చు.. లేదంటే ప్రభుత్వంలో చేరొచ్చని లెక్కలు వేసుకుంటున్నారు. జంపింగ్‌లు, చేరడాలు.. ఎలాగూ కొత్తేం కాదు.. 2018 ఎన్నికల తర్వాత జరిగింది కూడా అదే. పొత్తు ప్రచారాన్ని రెండు పార్టీల నేతలు కొట్టిపారేస్తున్నా… ప్లాన్ బీ కింద కొందరు కాంగ్రెస్ నేతలు ఇలాంటి ప్లాన్ చేస్తున్నారే చర్చ జరుగుతోంది. ఒక్కటి మాత్రం క్లియర్.. కలిసి పోటీ చేసి గెలిస్తే పొత్తు.. గెలిచాక చేరితే రాజకీయ ఎత్తు.. హస్తం పార్టీలోని ఆ పార్టీ నేతల వ్యూహం ఇలానే ఉందని క్లియర్‌గా అర్థం అవుతోంది.