తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తరువాత… బీఆర్ఎస్ ఒంటరి అయింది. పదేళ్ళుగా తిరుగులేకుండా పాలించిన ఆ పార్టీ… మరో పదేళ్ళూ మేమే అని బీరాలు పోయింది. బీజేపీని, కాంగ్రెస్ ని ఇష్టమొచ్చినట్టు తిట్టిపోశారు బీఆర్ఎస్ లోని ఆ నలుగురు పెద్దలు. కానీ ఓటమి తర్వాత కారు పార్టీ ఇప్పుడు కమలం వైపు చూస్తోందని అర్థమవుతోంది. తెలంగాణలో ఈ రెండు పార్టీలు కలిస్తే.. 14 లోక్ సభ సీట్లు గెలవొచ్చని ABP న్యూస్ C వోటర్ ఒపీనియన్ పోల్ చెప్పింది. ఇదే టైమ్ లో MLC కవిత.. హిందూ భావజాలానికి అనుకూలంగా మాట్లాడటం…. రాహుల్ గాంధీని తిట్టిపోయడం ఈ టాక్స్ కి మరింత బలం చేకూర్చింది.
కేంద్రంలో వరుసగా మూడోసారి విజయం సాధించి అధికారం చేపట్టాలని బీజేపీ టార్గెట్ గా పెట్టుకుంది. అందుకోసం ప్రతి ఒక్క రాష్ట్రాన్ని విడి విడిగా విశ్లేషణ చేసుకుంటోంది. దక్షిణాదిలో కర్ణాటక, తెలంగాణలోనే బీజేపీకి ఎక్కువ లోక్ సభ సీట్లు వచ్చే పరిస్థితి ఉందని ఆ పార్టీ పెద్దలు నమ్ముతున్నారు. అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగి తెలంగాణలో ఎంపీ అభ్యర్థులను డిసైడ్ చేయబోతున్నారు. ఈ టైమ్ లో వచ్చిన ABP న్యూస్ C ఓటర్ ఒపీనియన్ పోల్ … తెలంగాణలో కొత్త చర్చను లేవనెత్తింది. తెలంగాణలో ఇప్పటికప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే… బీజేపీకి 3లోపు, బీఆర్ఎస్ నాలుగైదు, కాంగ్రెస్ కి 10 కంటే ఎక్కువ వస్తాయని చెప్పింది. కాంగ్రెస్ ప్రస్తుతం అధికారంలో ఉంది కాబట్టి ఎక్కువ సీట్లే వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే బీఆర్ఎస్, బీజేపీ కలసి పోటీ చేస్తే… 14 స్థానాల్లో విజయం సాధిస్తారని సీఓటర్ చీఫ్ చెప్పడం సంచలనంగా మారింది. అంటే ఈ రెండు పార్టీలు విడిగా పోటీ చేస్తే కాంగ్రెస్ కు లాభం… కలసి బరిలో నిలబడితే బీజేపీతో పాటు బీఆర్ఎస్ కీ ఉపయోగం అవుతుంది.
మరి బీజేపీ, బీఆర్ఎస్ కలుస్తాయా అంటే… ప్రస్తుతానికి మాత్రం బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి… తాము ఏ పార్టీతోనూ పొత్తుపెట్టుకోవట్లేదని… స్వతంత్ర్యగానే పోటీ చేస్తామన్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ రెండు పార్టీలు పరస్పరం విమర్శించుకోవడం మానేశాయి. పైగా ఎమ్మెల్సీ కవిత… హిందూ వ్యతిరేక శక్తి అంటూ కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. ఆ పార్టీ DNAలోనే హిందూ వ్యతిరేక ధోరణి ఉందన్నారు. ఇండియా కూటమిలో ఉన్న DMK నేతలు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడుతూ అవమానిస్తున్నారనీ, హిందీ మాట్లాడే రాష్ట్రాలను గోమూత్ర రాష్ట్రాలని అవహేళన చేస్తుంటే… కాంగ్రెస్ ఏం చేస్తోందని కవిత ప్రశ్నించారు. ఈ కామెంట్స్ కి రాహుల్ సమాధానం చెప్పాలనీ, కర్ణాటకలో హిజాబ్ వివాదంపైనా తన వైఖరిని వెల్లడించాలని ఆమె డిమాండ్ చేశారు. మొన్నటిదాకా బీజేపీ హిందూత్వ వాదంపై విమర్శలు చేసిన బీఆర్ఎస్… సడన్ గా ఇలా సాఫ్ట్ కార్నర్ ఎందుకు మొదలుపెట్టింది అన్న చర్చ మొదలైంది.
YS SHARMILA: జగనన్న పైకి బాణం.. ఏపీ కాంగ్రెస్‌లోకి షర్మిల..?
కవిత ఈ స్టేట్ మెంట్ ద్వారా తాము కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమికి వెళ్ళడం లేదన్న సంకేతాలను బీఆర్ఎస్ పంపుతోంది. గతంలోనే NDA లో చేరతానని కేసీఆర్ అడిగారని మోడీ ఎన్నికల సభల్లో చెప్పారు. అనవసరంగా టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చుకొని … పార్టీకి ఉనికి ఉన్న తెలంగాణలోనే దెబ్బతిన్నది. రాబోయే రోజుల్లో ఏదో ఒక జాతీయ పార్టీ కూటమి సపోర్ట్ లేకపోతే కష్టమనుకుంటున్న బీఆర్ఎస్… అదేదో బీజేపీ వైపు మళ్ళితే బాగుంటుందని భావిస్తోంది. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ మెదక్ నుంచి పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. గెలిస్తే ఢిల్లీలో కాస్త చక్రం తిప్పే ఛాన్స్ కూడా దక్కుతుంది.
మరి బీజేపీ పరిస్థితి ఏంటి … కిషన్ రెడ్డి అయితే లోక్ సభ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు లేదని చెప్పేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ తో బీజేపీ కలిస్తే.. పదేళ్ళుగా ఆ ప్రభుత్వం చేసిన తప్పులను కమలనాధులు కూడా మోయాల్సి ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం … కేసీఆర్ హయాంలో జరిగిన అక్రమాలను తవ్వుతోంది. వరుసగా ఎంక్వైరీలకు ఆదేశిస్తోంది. పదేళ్ళలో రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిందని ఆరోపిస్తోంది. దాంతో జనం కూడా బీఆర్ఎస్ తప్పు చేసిందనే భావనలో ఉన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ చేసే విచారణలతో బీజేపీ ఇరుకునపడే అవకాశం ఉంటుంది. అందువల్ల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన పార్టీని ఇప్పుడు మనం భుజాన ఎత్తుకోవడం ఎందుకు…. గులాబీ పార్టీతో దూరంగా ఉంటేనే బెటర్ అన్న అభిప్రాయంలో ఉన్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. కానీ అమిత్ షా రాష్ట్ర పర్యటనకు వస్తుండటంతో ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారన్నది చూడాలి.