Mynampally Hanumanth Rao: మైనంపల్లిని తప్పించడం ఖాయమా..? మల్కాజ్‌గిరి బీఆర్ఎస్ టికెట్ ఆ ముగ్గురిలో ఎవరికి..?

మైనంపల్లి వ్యాఖ్యలపై కేసీఆర్‌తో పాటు కేటీఆర్, కవిత కూడా స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యారు. తాము హరీష్‌కు అండగా ఉంటామని ప్రత్యక్షంగా కొందరు, పరోక్షంగా మరికొందరు ప్రకటనలు చేశారు. ఇక అటు మైనంపల్లి వ్యాఖ్యలపై బీఆర్ఎస్‌ నేతల్లోనే రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

  • Written By:
  • Publish Date - August 23, 2023 / 03:26 PM IST

Mynampally Hanumanth Rao: హరీష్ రావుపై మైనంపల్లి వ్యాఖ్యల వ్యవహారంలో బీఆర్ఎస్ అధిష్టానం చాలా సీరియస్‌గా కనిపిస్తోంది. మైనంపల్లికి ఇప్పటికే టికెట్ కేటాయించినప్పటికీ, అభ్యర్థి మార్పు ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. అతడి స్థానంలో మరో అభ్యర్థిని ప్రకటించేందుకు బీఆర్ఎస్ రెడీ అయినట్లు తెలుస్తోంది. ఫస్ట్‌ లిస్ట్ ప్రకటించినపుడు ఎలాంటి మార్పులైనా జరగొచ్చు అని కేసీఆర్ ఓ లీడ్ ఇచ్చారు. దీంతో మైనంపల్లి వ్యవహారం మంటలు రేపుతున్న వేళ మొదటి మార్పు మల్కాజ్‌గిరి అసెంబ్లీ నుంచే మొదలయ్యే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది.

మైనంపల్లి వ్యాఖ్యలపై కేసీఆర్‌తో పాటు కేటీఆర్, కవిత కూడా స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యారు. తాము హరీష్‌కు అండగా ఉంటామని ప్రత్యక్షంగా కొందరు, పరోక్షంగా మరికొందరు ప్రకటనలు చేశారు. ఇక అటు మైనంపల్లి వ్యాఖ్యలపై బీఆర్ఎస్‌ నేతల్లోనే రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మైనంపల్లిపై వేటు వేయాల్సిందే అనే డిమాండ్‌ వినిపిస్తోంది. ఐతే ఇంత జరుగుతున్నా మైనంపల్లి వెనక్కి తగ్గడం లేదు. తన కుమారుడి రాజకీయ భవిష్యత్తే తనకు ముఖ్యమని అంటున్నారు. రేపోమాపో నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు. అవసరం అయితే పార్టీ మారేందుకు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో మాల్కాజిగిరి అభ్యర్థి మార్పు వైపు బీఆర్ఎస్ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. అక్కడ పోటీకి నిలిపేందుకు ముగ్గురు, నలుగురు పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డితో పాటు.. మంత్రి తలసాని కుమారుడు సాయి, బీఆర్ఎస్ నేత క్రిశాంక్‌ పేరు కూడా ఈ లిస్ట్‌లో వినిపిస్తోంది. ఈ ముగ్గురితో పాటు అల్వాల్ కార్పొరేటర్ చింతల విజయశాంతి పేరు పరిశీలనలో ఉందని తెలుస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో మర్రి రాజశేఖర్ రెడ్డి, తలసాని సాయి పోటీ చేసి ఓడిపోయారు. ఇక చింతల విజయశాంతి కూడా రాజకీయ కుటుంబం నుంచే వచ్చింది. ఆమె మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి కోడలు. ఈమె జీహెచ్‌ఎంసీ మేయర్ బరిలో కూడా నిలిచారు. మేయర్ పీఠం జనరల్ మహిళకు కేటాయించడంతో విజయశాంతి కూడా పోటీలో నిలిచారు. ఐతే ఆ పదవి కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మికి కేటాయించటంతో నిరాశకు గురయ్యారు. ఇప్పుడు అనూహ్యంగా ఎమ్మెల్యే బరిలో ఆమె పేరు వినిపిస్తోంది. ఇక అటు క్రిశాంక్‌ కూడా బీఆర్ఎస్‌ సోషల్‌ మీడియాలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్‌గా, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడే వ్యక్తిగా అతనికి పేరు ఉంది. దీంతో మల్కాజ్‌గిరి టికెట్ విషయంలో ఏం జరుగుతుందనే ఆసక్తి కనిపిస్తోంది.