BRS ON BC’s: గత ఎన్నికల్లో గెలిచినంత సులభంగా ఈసారి గెలవడం సాధ్యం కాదని భావించిన బీఆర్ఎస్ ఈసారి అన్ని అస్త్రాలను వాడేందుకు సిద్ధమవుతోంది. మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వ్యతిరేక ఓటు బ్యాంకుపై దృష్టిపెట్టింది. దీనిలో భాగంగా ఇంతకాలం బీఆర్ఎస్‌కు కాస్త దూరంగా ఉన్న బీసీలను తిరిగి ఆకట్టుకోవాలని నిర్ణయించింది. ప్రజల్లో పార్టీ పరిస్థితిపై కేసీఆర్ సర్వే నిర్వహించారు. బీసీలు, మైనారిటీలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు బీఆర్ఎస్‌పై వ్యతిరేకతతో ఉన్నట్లు ఆ సర్వేల్లో తేలింది. దీంతో వారిని ఆకట్టుకునేందుకు కేసీఆర్ సరికొత్త వ్యూహాల్ని అమలు చేస్తున్నారు. అందుకోసమే ఇటీవల బీసీ కులవృత్తులు, మైనారిటీలకు లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. అలాగే ఉద్యోగుల్ని ఆకట్టుకునేందుకు పీఆర్సీ వేయబోతున్నట్లు లీకులు ఇప్పిస్తున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో తమకు సరైన న్యాయం జరగడం లేదని బీసీలు భావిస్తున్నట్లు సర్వేలో తేలింది. ఉమ్మడి ఏపీలోనే కాదు.. తెలంగాణలో కూడా వివక్షకు గురవుతున్నట్లు బీసీలు భావిస్తున్నారు. కేసీఆర్ అధికారం చేపట్టిన తర్వాత బీసీల విషయంలో పెద్దగా న్యాయం చేయలేదనే చెప్పాలి. దీంతో అసంతృప్తితో ఉన్న బీసీలు కాంగ్రెస్ వైపు ఆకర్షితులవుతున్నారు. దీన్ని అడ్డుకుని, బీసీల్ని తమవైపు తిప్పుకొనేందుకే ఆర్థిక సాయం ప్రకటించారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రకటించిన అర్హతల విషయంలోనే బీసీల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ సాయం కోసం ఐదు లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి.
వీరిలో మూడు వేల మందికి మాత్రమే సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారికి కూడా ఇంకా సాయం అందలేదు. నిధుల కొరతతో ఈ సాయం కూడా ప్రస్తుతానికి నిలిచిపోయింది. ఇప్పటివరకు ఎంతమందికి ఆర్థికసాయం అందించారు అనే విషయంలో స్పష్టతలేదు. తెలంగాణలోని ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంపై అసంతృప్తితోనే ఉన్నారు. వీరిలో చాలా మంది చిరు వ్యాపారులున్నారు. చేతివృత్తులు చేసుకుంటూ బతుకుతున్నారు. వీరిని ఆకట్టుకునేందుకు కూడా ఆర్థిక సాయం చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. ఇంకా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంతవరకు రాలేదు. బీసీలను, మైనారిటీలను ఆకట్టుకునేందుకు త్వరలోనే ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించేందుకు కూడా ప్రభుత్వం రెడీ అవుతోంది. నియోజవర్గ స్థాయిలో ఆత్మీయ సమ్మేళనాలకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది.
అంతేకాదు.. వచ్చే నెలలో హైదరాబాద్‌లో బీసీ కులాలతో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కూడా పార్టీ రెడీ అవుతోంది. దీనికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీని ద్వారా బీసీలంతా బీఆర్ఎస్‌కే మద్దతు ఇస్తున్నారనే సంకేతాలు పంపేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఇక పీఆర్సీ, వేతనాల విషయంలో ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయుల్ని ఆకర్షించేందుకు పీఆర్సీ వేయబోతున్నట్లు ప్రభుత్వం లీకులిచ్చింది. దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఒకవేళ ఇప్పుడు పీఆర్సీ వేసినా.. అది అమలులోకి వచ్చేది కొత్త ప్రభుత్వంలోనే. ఆలోపు అది సాధ్యం కాదు. ప్రభుత్వం మూడు డీఏలను పెండింగ్‌లో ఉంచింది. మూడేళ్లుగా హెల్త్ కార్డులు జారీ చేయలేదు. దీంతో ఉద్యోగుల్లో బీఆర్ఎస్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.