హ్యాట్రిక్ అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీఆర్ఎస్‌కు.. బీజేపీ, కాంగ్రెస్ ముచ్చెమటలు పట్టిస్తున్నాయ్. మళ్లీ తమదే అధికారం అని కేసీఆర్, కేటీఆర్, హరీష్ పైకి ధీమాగా చెప్తున్నా.. కారు పార్టీ నేతలను తెలియని టెన్షన్ మాత్రం అలానే వెంటాడుతోంది. దీనికితోడు కారుకు అనుకూల పవనాలు లేవనే సర్వే నివేదికలు మరింత టెన్షన్ పుట్టిస్తున్నాయ్. దీనికితోడు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అందించిన సర్వే రిపోర్టుతో మరింత కంగారు మొదలైనట్లు తెలుస్తోంది. కేసీఆర్ మీద సానుకూలంగానే ఉన్నా.. క్షేత్రస్థాయిలో నేతల తీరుపై జనాలు విసిగిపోయారని.. ఆ ఎఫెక్ట్ ఎన్నికల్లో కనిపించడం ఖాయం అంటూ.. పీకే టీమ్ ఓ రిపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కారు పార్టీ పెద్దలు అలర్ట్ అయ్యారు. జనాలను ఆకట్టుకునేందుకు గులాబీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఎప్పుడూ జనాల్లో కనిపించని కేసీఆర్, అప్పుడప్పుడు మాత్రమే కనిపించే కేటీఆర్.. ఇప్పుడు జనంలోనే ఉంటున్నారు. మెట్రో ఎక్కుతున్నారు.. రోడ్డు పక్కన చాయ్ తాగుతున్నారు.. హోటల్‌కు వెళ్లి జనాలతో కలిసి బిర్యానీలు తింటున్నారు, టీవీలకు వెళ్లి మరీ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. దీంతోపాటు కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవితతో పాటు.. ఇతర కీలక నేతలంతా వివిధ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ జనాలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో కారు పార్టీకి భారీ ఊరట లభించింది. రైతుబంధు నిధులను రైతుల ఖాతాలో జమ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంతో.. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు నిధుల విడుదలను మొదలుపెట్టింది. దీంతో రైతుల ఖాతాల్లో నిధులు విడుదలకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయయ్. రైతుల అకౌంట్‌లలో డబ్బులు పడబోతున్నాయ్. కీలకమైన పోలింగ్ సమయంలో రైతుల ఖాతాల్లో సొమ్ములు పడితే అది బీఆర్ఎస్ కు ఎంతగానో కలిసి రావడం ఖాయం. ఎన్నికల సమయంలో తమకు ఎంతగానో మేలు చేస్తుందని కారు పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.