KCR: ఫస్ట్ లిస్ట్ తర్వాత.. బీఆర్ఎస్‌లో ప్రకంపనలు మొదలయ్యాయ్. దీంతో చిన్నపాటి తిరుగుబాటే జరుగుతోంది పార్టీ లోపల. టికెట్ ఆశపడి.. ఆ తర్వాత భంగపడి.. తీవ్ర అసంతృప్తితో కనిపిస్తున్న నేతలంతా.. ఒక్కొక్కరురగా కారుకు దూరంగా జరిగి తమ రాజకీయ భవిష్యత్ కోసం కొత్త అడుగులు వేస్తున్నారు. సరిగ్గా ఎన్నికలకు రెండు నెలల ముందు ఇలాంటి పరిణామాలు.. గులాబీ పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. ఫస్ట్‌లిస్ట్‌లో చాలామంది సిట్టింగ్‌లకే అవకాశం కల్పించారు కేసీఆర్.
ఐతే కొన్నిచోట్ల మాత్రం సిట్టింగ్‌లను తప్పించి.. కొత్తవారికి చాన్స్ ఇచ్చారు. ఇదే ఇప్పుడు ఇబ్బందికర పరిణామంగా కనిపిస్తోంది. మిగతా స్థానాల సంగతి ఎలా ఉన్నా.. జనగామ, స్టేషన్ ఘన్‌పూర్ మాత్రం కేసీఆర్‌ను తెగ ఇబ్బంది పెడుతున్నాయ్. జనగామలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి టికెట్ మీద కోటి ఆశలు పెట్టుకున్నారు. ఐతే అదే సమయంలో ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా జనగామ నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధం అవుతున్నారు. ఇలాంటి కన్ఫ్యూజన్ మధ్య జనగామ టికెట్‌ను హోల్డ్‌లో పెట్టారు. పల్లా రాజశేశ్వర్ రెడ్డి.. కేసీఆర్‌కు క్లోజ్. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి.. కేటీఆర్ దోస్త్. ఇక అటు హరీష్, కవితను కలిసి ముత్తిరెడ్డి టికెట్ ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఎవరిని కాదనాలో.. ఎవరికి టికెట్ ఇవ్వాలో అర్థం కాని పరిస్థితి ఎదురైంది.
ఇక అటు స్టేషన్ ఘన్‌పూర్‌లోనూ సేమ్ సీన్. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యను తప్పించి ఎమ్మెల్సీ కడియం శ్రీహరిని అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో రాజయ్య తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. కార్యకర్తలను కలిసి టికెట్ దక్కకపోవడంతో కన్నీళ్లు పెట్టుకోవడం, అది మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో బీఆర్ఎస్ పార్టీకి కొత్త ఇబ్బంది ఎదురవుతోంది. ఐతే.. ఈ రెండు నియోజకవర్గాలు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినవే కావడంతో.. ఎన్నికల వేళ ఎలాంటి ప్రభావం చూపుతుందనే చర్చ జరుగుతోంది. ఒకరకంగా ఈ రెండు స్థానాలు కేసీఆర్‌కు ఇబ్బందికరంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది.