BRS: రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను కేసీఆర్ ప్రకటించగానే బీఆర్ఎస్‌లో అసంతృప్తుల జోరు పెరుగుతోంది. వరుసగా నేతలు పార్టీపై తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. కొందరు బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.
ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నేత తుమ్మల నాగేశ్వర రావు పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. తనకు అధిష్టానం పాలేరు సీటు కేటాయిస్తుందని భావించారు. అయితే, జాబితాలో తన పేరు లేకపోవడంతో త్వరలోనే రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోబోతున్నారు. కార్యకర్తలతో సమావేశమై, పార్టీ మారే అంశంపై నిర్ణయం తీసుకుంటారు. తుమ్మల ఇంటికి నామా నాగేశ్వర రావును బీఆర్ఎస్ అధిష్టానం పంపి, పార్టీ మారకుండా చర్చలు జరిపినప్పటికీ.. ఆయన ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా తుమ్మలకు అనుచరులు సూచిస్తున్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కూడా తనకు టిక్కెట్ కేటాయించకపోవడంపై అసంతృప్తితో ఉన్నారు. ఆమె భర్త ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరారు. నేడో, రేపో.. రేఖా నాయక్ కూడా కాంగ్రెస్‌లో చేరడం ఖాయం. అటు తుమ్మలకు, రేఖా నాయక్‌కు సీట్లు ఇచ్చేందుకు బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. ఈ రెండింట్లో ఏ పార్టీలో చేరాలో త్వరలోనే నిర్ణయించుకుంటారు. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య కూడా కేసీఆర్‌పై అసంతృప్తితో ఉన్నారు. ఆయనను బుజ్జగించడానికి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని అధిష్టానం పంపించినప్పటికీ.. రాజయ్య ఆయనను కలవలేదు.
నకిరేకల్ టిక్కెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంకు బీఆర్ఎస్ టిక్కెట్ దక్కలేదు. దీంతో ఆయన బీఆర్‌ఎస్‌ను వీడారు. పెద్దపల్లి నుంచి టిక్కెట్ ఆశించి, భంగపడ్డ నల్ల మనోహర్‌రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. కొత్తగూడెం టికెట్ ఆశించిన జలగం వెంకట్రావు కూడా త్వరలో పార్టీ మారబోతున్నట్లు తెలుస్తోంది. జలగం వెంకట్రావు గతంలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. వీళ్లంతా ప్రధానంగా కాంగ్రెస్‌వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఆలేరు టిక్కెట్ ఆశించిన సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు కూడా బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు. ఆయన తన కార్యకర్తలతో సమావేశమై తదుపరి నిర్ణయం తీసుకుంటారు. మరోవైపు మైనంపల్లి హన్మంతరావు కూడా బీఆర్ఎస్ పార్టీని వీడబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇటీవల హరీష్ రావుపై చేసిన వ్యాఖ్యల కారణంగా పార్టీ నుంచి మైనంపల్లిని సస్పెండ్ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ముందుగానే మైనంపల్లి పార్టీ మారే ఛాన్స్ ఉంది. ఇంతకాలం బీఆర్ఎస్ టిక్కెట్ తమకే వస్తుందని ఆశించిన మరికొందరు నేతలు కూడా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు.
వరుసగా బీఆర్ఎస్ నేతలు పార్టీ మారుతుండటం ఆ పార్టీకి ఎదురుదెబ్బగానే భావించాలి. ఇంతకాలం బీఆర్ఎస్‌వైపు ఉన్న నేతలు వేరే పార్టీలోకి వెళ్తే పార్టీ ఓట్లు చీలే అవకాశం ఉంది. మరి వీళ్లందరినీ బుజ్జగించడానికి కేసీఆర్ ఏం చేస్తారో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే కొందరు నేతల్ని బుజ్జగిస్తున్నారు. మరికొందరికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు.