BRS FIRST LIST: బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటనకు సీఎం కేసీఆర్ ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. సెంటిమెంట్లకు ఎక్కువ విలువ ఇచ్చే కేసీఆర్ అభ్యర్థుల ప్రకటనకు కూడా మంచి ముహూర్తాన్ని నిర్ణయించారు. ఈ నెల 21, శ్రావణ సోమవారం రోజు బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సోమవారం మంచి రోజు కావడంతో కేసీఆర్ దీన్ని ఎన్నుకున్నారు. మొదటి జాబితాలో దాదాపు 80-90 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది.
2018 ఎన్నికల సమయంలో కూడా కేసీఆర్ ముహూర్తాన్నే ఫాలో అయ్యారు. అప్పుడు కూడా శ్రావణ సోమవారం రోజునే అభ్యర్థుల్ని ప్రకటించారు. అప్పుడు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ భారీ మెజారిటీతో విజయం సాధించింది. అందుకే ఇప్పుడు అదే సెంటిమెంట్ ఫాలో అవుతూ మళ్లీ శ్రావణ సోమవారం రోజే అభ్యర్థుల జాబితాను వెల్లడిస్తారు. నిజానికి జాబితా ఎప్పుడో సిద్ధమైంది. అయితే, ఇంతకాలం అధికమాసం ఉండటంతో జాబితా వెల్లడించడం మంచిది కాదని ఆగిపోయారు. ఇప్పుడు శుభకార్యాలకు నెలవుగా భావించే శ్రావణ మాసం కావడంతో జాబితా వెల్లడించేందుకు రెడీ అయ్యారు. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం రెండు లేదా మూడు నెలల్లోనే తెలంగాణలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. షెడ్యూల్ కంటే ముందుగానే ఎన్నికలు జరుగుతాయని రాజకీయ పార్టీలు అంచనావేస్తున్నాయి.
మరోవైపు తొలి జాబితా ప్రకటనకు సమయం దగ్గరపడటంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. కొందరు సిట్టింగులకు కూడా టిక్కెట్ దక్కే ఛాన్స్ లేదని తేలడంతో వారు ఆందోళనకు గురవుతున్నారు. జాబితాలో తమ పేరు ఉంటే చాలని ఆశిస్తున్నారు. అయితే, కొందరికి కేసీఆర్ షాకివ్వబోతున్నట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని.. కొత్తవారికి అవకాశం ఇవ్వబోతున్నారు. దీంతో టిక్కెట్లు ఆశిస్తున్న వాళ్లంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.