BRS MINISTERS: తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు నిరాశ ఎదురైంది. కాంగ్రెస్ 65 స్థానాల్లో విజయం సాధించింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. తొలిసారిగా ఓడింది. తెలంగాణ వచ్చాక కాంగ్రెస్ తొలిసారి అధికారంలోకి రాబోతోంది. గత ఎన్నికల్లో 88 స్థానాల్లో గెలుపొందిన బీఆర్ఎస్ ఈసారి 39 స్థానాలకే పరిమితమైంది. సీఎం కేసీఆర్ సహా, పలువురు మంత్రులకు ఈ క్రమంలో షాక్ తగిలింది. ఏకంగా ఆరుగులు మంత్రులు ఓడిపోయారు. మిగతా మంత్రులు గట్టెక్కినా మునుపటి మెజారిటీ మాత్రం అందుకోలేకపోయారు. ఈసారి ఎన్నికల్లో ఆరుగురు మంత్రులకు ఝలక్ ఇచ్చారు ఓటర్లు.
CONGRESS: రిజర్వుడ్ స్థానాల్లో కాంగ్రెస్ పాగా.. అధిక సీట్లు గెలుచుకున్న హస్తం..
నిర్మల్‌లో ఇంద్రకరణ్ రెడ్డి, ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్, పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావు, వనపర్తిలో నిరంజన్ రెడ్డి, ఖమ్మంలో పువ్వాడ అజయ్ కుమార్, మహబూబ్‌నగర్‌లో శ్రీనివాస్ గౌడ్ ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో కేవలం 441 ఓట్లతో గట్టెక్కిన కొప్పుల ఈశ్వర్.. ఈసారి మాత్రం ఓటమి నుంచి తప్పించుకోలేకపోయారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 53 వేల ఓట్లతో గెలుపొందిన ఎర్రబెల్లి దయాకర్ రావు.. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి మామిడాల యశస్వినిరెడ్డి చేతిలో ఓడారు. గత ఎన్నికల్లో 51 వేల ఓట్లతో గెలుపొందిన మంత్రి నిరంజన్ రెడ్డి.. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి మేఘారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. గతసారి 57 వేలతో గెలుపొందిన శ్రీనివాస్ గౌడ్.. కాంగ్రెస్ అభ్యర్థి యెన్నం శ్రీనివాసరెడ్డి చేతిలో ఓడిపోయారు. మంత్రులుగా పనిచేసిన వారిలో కేటీఆర్, హరీశ్‌రావు, తలసాని, జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, సబిత, గంగుల మరోసారి గెలుపొందారు. తలసాని, సబితా ఇంద్రారెడ్డి మెజారిటీ గతం కంటే మెరుగయ్యాయి. సబిత గత ఎన్నికల్లో దాదాపు 9 వేల ఓట్లతో గెలుపొందగా.. ఈసారి మెజారిటీ 26 వేలకు పెరిగింది. తలసాని గతంలో 30వేల మెజారిటీ సాధించగా.. ఈసారి 41వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. సిద్దిపేట నుంచి పోటీ చేసిన మంత్రి హరీశ్ రావు మరోసారి విజయం సాధించారు.
గత ఎన్నికల్లో లక్షా 18 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందిన ఆయన.. ఈసారి 82వేల మెజారిటీకి పరిమితమయ్యారు. సిరిసిల్ల నుంచి పోటీ చేసిన కేటీఆర్ గతంలో 89 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందగా.. ఈసారి 30వేల ఓట్లకు పరిమితయ్యారు. మేడ్చల్ నుంచి పోటీ చేసిన మల్లారెడ్డి.. గత ఎన్నికల్లో 87వేల ఓట్లతో గెలుపొందగా.. ఈసారి 33వేల ఓట్ల మెజారిటీతో సరిపెట్టుకున్నారు. గంగుల కమలాకర్ 14 వేల ఓట్లతో గెలుపొందగా.. ఈసారి కేవలం 3వేల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌పై విజయం సాధించారు. తెలంగాణలో కారు స్పీడ్‌కు బ్రేక్ వేసిన ఓటర్లు.. మంత్రులుగా పనిచేసిన వారికి గట్టి షాకే ఇచ్చారు. మిగతా వారిని గెలిపించినా మెజారిటీ మాత్రం తగ్గించారు.