KCR: చివరి నిమిషంలో 20 చోట్ల సిట్టింగ్‌లను మార్చే ఛాన్స్..?

ఎన్నికలకు ఇంకా మూడు నెలల టైం ఉన్నందున ఆలోపు దాదాపు 20 మంది అభ్యర్థుల్ని బీఆర్ఎస్ మార్చే ఛాన్స్ ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. అభ్యర్థులపై ప్రజా వ్యతిరేకత ఉన్న రెండు డజన్ల స్థానాలపై కేసీఆర్ నిఘా ఉంచారని తెలుస్తోంది.

  • Written By:
  • Updated On - August 28, 2023 / 07:44 PM IST

KCR: తెలంగాణలోని దాదాపు 30 అసెంబ్లీ స్థానాల్లో కేసీఆర్ కొత్తవారిని బరిలోకి దింపుతారనే అంచనాలు వెలువడినప్పటికీ అలా జరగలేదు. నలుగురైదుగురు మినహా సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరికీ మళ్లీ టికెట్స్ దక్కాయి. అయితే ఇంతటితోనే ఏమీ అయిపోలేదని.. ఎన్నికలకు ఇంకా మూడు నెలల టైం ఉన్నందున ఆలోపు దాదాపు 20 మంది అభ్యర్థుల్ని బీఆర్ఎస్ మార్చే ఛాన్స్ ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. అభ్యర్థులపై ప్రజా వ్యతిరేకత ఉన్న రెండు డజన్ల స్థానాలపై కేసీఆర్ నిఘా ఉంచారని.. అభ్యర్థులకు ప్రజల్లో వచ్చే స్పందన ఆధారంగా వారికి బీఫామ్ ఇవ్వాలా..? వద్దా..? అనే దానిపై అప్పటికప్పుడు గులాబీ బాస్ తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

ఒకవేళ వీక్‌గా ఉన్న సిట్టింగ్‌లకు ఇప్పుడే టికెట్స్ నిరాకరిస్తే.. వాళ్లు పెద్దఎత్తున కార్యకర్తలతో కాంగ్రెస్, బీజేపీలోకి చేరిపోయే ముప్పు ఉంటుందని బీఆర్ఎస్ పెద్దలకు గ్రౌండ్ రిపోర్ట్స్ చేరాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. దీంతో బలహీనంగా ఉన్న కొందరు అభ్యర్థులను బీఫామ్ కేటాయించే వరకు అబ్జర్వేషన్‌లో ఉంచడం మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. బీఫామ్ దక్కని సిట్టింగ్ అభ్యర్థులు ఒకవేళ అప్పటికప్పుడు తిరుగుబాటు చేసినా.. కొత్త గుర్తుపై పెద్దగా మైలేజీని సాధించలేరనే ఒపీనియన్‌తో కారు పార్టీ అధిష్టానం ఉందట. ఇప్పుడే టికెట్స్ నిరాకరించి పెద్ద సునామీని క్రియేట్ చేసుకునే కంటే.. ఎన్నికలు బాగా సమీపించాక విచక్షణతో నిర్ణయాన్ని ప్రకటిస్తే సరిపోతుందని అనుకుంటోందట.
కేటీఆర్ కోసం వెయిటింగ్..
బీఆర్ఎస్ అసెంబ్లీ టికెట్స్ ప్రకటించిన టైంలో మంత్రి కేటీఆర్ ఫారిన్ టూర్‌లో ఉన్నారని.. ఆయన వచ్చాక కొన్నిచోట్ల క్యాండిడేట్స్‌ను మారే ఛాన్స్ ఉందనే అంశం తెరపైకి వచ్చింది. స్థానిక పరిస్థితులు, సర్వేల ఆధారంగా కొన్ని నియోజకవర్గాల్లో మార్పులు ఉండే అవకాశాలున్నాయని అంటున్నారు. జనగామ వంటి పలు సెగ్మెంట్ల నుంచి టికెట్లు ఆశించిన మంత్రి కేటీఆర్ టీంలోని ఆశావాహులు.. కేటీఆర్ రాక కోసం వెయిట్ చేస్తున్నారట. నియోజకవర్గాల్లో పార్టీ ప్రకటించిన అభ్యర్థులపై వస్తున్న వ్యతిరేకతను వాళ్లు ఎప్పటికప్పుడు కేటీఆర్‌కు పంపిస్తున్నారట.
ఈ స్థానాల్లోనే మార్పు..
బెల్లంపల్లి నుంచి దుర్గం చిన్నయ్య, కోదాడ నుంచి మల్లయ్య యాదవ్, మంథని సెగ్మెంట్లో పుట్టా మధు, కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వర్ రావు, ఇల్లెందులో హరిప్రియా నాయక్, వరంగల్ ఈస్ట్ నన్నపనేని నరేందర్, మల్కాజిగిరిలో మైనంపల్లి హన్మంతరావు, కల్వకుర్తిలో జైపాల్ యాదవ్, పెద్దపల్లిలో దాసరి మనోహర్రెడ్డి, రామగుండంలో కోరుకంటి చందర్, కంటోన్మెంట్లో లాస్య నందితకు అధిష్టానం టికెట్ ఖరారు చేయగా.. ఈ సెగ్మెంట్లలో కేటీఆర్ టీం ప్రత్యామ్నాయ మార్గాల్లో నిమగ్నమైంది. అయితే టికెట్ల ప్రకటన సందర్భంగా మంత్రి కేటీఆర్ అందుబాటులో లేకపోవడంతో కొంతమంది ఎమ్మెల్సీ కవిత, మంత్రి హరీశ్ రావు దగ్గరకు వెళ్లి ప్రయత్నాలు చేసుకున్నారు. కానీ, అవేవీ సఫలం కాలేదు. దీంతో కేటీఆర్ ఎప్పుడెప్పుడు వస్తారా.. అని ఆశావహులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారట.