Shakil Aamir: మరో బీఆర్ఎస్‌ మాజీ ఎమ్మెల్యేకు షాక్‌.. ఆయన రైస్‌ మిల్లుల్లో అధికారుల సోదాలు..

జీవన్‌ రెడ్డి కమర్షియల్‌ కాంప్లెక్స్ మీద దాడులు నిర్వహించిన అధికారులు నోటీసులు ఇచ్చారు. దానిపై చర్చ జరుగుతున్న సమయంలోనే మాజీ మంత్రి మల్లారెడ్డి మీద కేసు నమోదయింది. ఇప్పుడు మరో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేను అధికారులు టార్గెట్ చేశారు.

  • Written By:
  • Publish Date - December 16, 2023 / 02:18 PM IST

Shakil Aamir: మొన్న జీవన్‌ రెడ్డి.. నిన్న మల్లారెడ్డి.. ఇవాళ షకీల్.. ఇదే చర్చ జరుగుతోంది జనాల్లో. జీవన్‌ రెడ్డి కమర్షియల్‌ కాంప్లెక్స్ మీద దాడులు నిర్వహించిన అధికారులు.. ఆ తర్వాత కొద్దిరోజులకే అప్పు చెల్లించాలని నోటీసులు ఇచ్చారు. దానిపై చర్చ జరుగుతున్న సమయంలోనే మాజీ మంత్రి మల్లారెడ్డి మీద కేసు నమోదయింది. ఎస్సీ, ఎస్టీల భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారనే ఆరోపణలు వినిపించాయ్. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్‌ నేతలు టార్గెట్ అయ్యారా అనే అనుమానాలు వినిపిస్తున్న సమయంలోనే.. ఇప్పుడు మరో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేను అధికారులు టార్గెట్ చేశారు.

KTR Vs REVANTH REDDY: అసెంబ్లీలో రేవంత్ వర్సెస్ కేటీఆర్.. విరుచుకుపడ్డ సీఎం

కస్టమ్ మిల్లింగ్ రైస్ కోసం ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని నిజామాబాద్ జిల్లాలోని పలువురు మిల్లర్లు పక్కదారి పట్టించినట్లు ఈ మధ్య వెలుగులోకి వచ్చింది. దీని విలువ సుమారు రూ.70 కోట్లు ఉంటుందని అంచనా. ఇందులో బీఆర్ఎస్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుటుంబసభ్యుల పేరిట ఉన్న మిల్లులు కూడా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. దీంతో వారి ఇళ్లలో అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. సీఎంఆర్ కోటాలో తిరిగివ్వని ఈ మిల్లుల్లో అధికారులు రెండు రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. షకీల్‌కు చెందిన రహీల్‌, రాస్‌, అమీర్‌, దాన్విక్‌ అనే నాలుగు రైస్‌మిల్లులకు 2021–22 యాసంగి, 2022–23 వానాకాలం సీజన్‌లకు సంబంధించి పౌరసరఫరాల శాఖ ద్వారా 50వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఇచ్చారు. ఇందుకు గాను 35వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం సీఎంఆర్‌ కింద తిరిగి పౌరసరఫరాల శాఖకు తిరిగి ఇవ్వాల్సి ఉంది. అయితే కేవలం 5వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం మాత్రమే తిరిగిచ్చారు. మిగిలిన ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసి ఇవ్వడం తనకు సాధ్యం కాదని షకీల్‌ చెప్పారు. మిగిలిన ధాన్యాన్ని మరో నాలుగు మిల్లులకు కేటాయించినట్లు చూపించారు.

ఇందుకు సంబంధించి ధాన్యం తమ మిల్లులకు బదిలీ అయినట్లు ఆ నాలుగు మిల్లులకు చెందిన యజమానులు లిఖితపూర్వకంగా రాసిచ్చారు. ఐతే షకీల్‌ ఒత్తిడితోనే ధాన్యం బదిలీ అయినట్లు తాము రాసిచ్చామని మిల్లర్లు చెప్తున్నారు. దీంతో పౌరసరఫరాల శాఖ అధికారులు షకీల్‌కు చెందిన మిల్లుల్లో తనిఖీలు చేస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ నేతలు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. జనాల సొమ్ము లూటీ చేసిన ఎవరినీ వదిలే ప్రసక్తి లేదని తేల్చి చెప్తున్నారు. బీఆర్ఎస్ నేతల మీద వరుసగా దాడులు జరగడం.. రాజకీయంగా రచ్చ రేపే అవకాశాలు కనిపిస్తున్నాయ్.