BRS: రిజర్వుడ్ సీట్లలో సిట్టింగులకు బీఆర్ఎస్ షాక్.. అభ్యర్థుల్ని మార్చే ఆలోచనలో సీఎం కేసీఆర్..!

బెల్లంపల్లి, ఖానాపూర్, స్టేషన్ ఘన్‌పూర్, మానకొండూర్, జహీరాబాద్, కంటోన్మెంట్, ఆలంపూర్ ఎమ్మెల్యేలకు సీట్లు దక్కే అవకాశాలు లేవు. ఇవన్నీ ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాలు. ఈ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు మారడం ఖాయం.

  • Written By:
  • Publish Date - July 23, 2023 / 10:52 AM IST

BRS: రిజర్వ్‌డ్ స్థానాల్లోని పలువురు సిట్టింగ్ ఎమ్మ్యేల్యేలకు షాక్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ హైకమాండ్ సిద్ధమవుతోంది. అనేక విమర్శలు ఎదుర్కొంటున్న, ఆరోపణలున్న, వివాదాస్పద ఎమ్మెల్యేలకు రాబోయే ఎన్నికల్లో సీట్లు ఇవ్వకూడదని, అభ్యర్థుల్ని మార్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాలపై ఇప్పటికే కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఒక నిర్ణయానికొచ్చారు. బెల్లంపల్లి, ఖానాపూర్, స్టేషన్ ఘన్‌పూర్, మానకొండూర్, జహీరాబాద్, కంటోన్మెంట్, ఆలంపూర్ ఎమ్మెల్యేలకు సీట్లు దక్కే అవకాశాలు లేవు. ఇవన్నీ ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాలు. ఈ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు మారడం ఖాయం. వీటితోపాటు దోర్నకల్, మహబూబాబాద్, ములుగు, యెల్లందు నియోజకవర్గాల అభ్యర్థుల్ని కూడా మార్చే అంశాల్ని నాయకత్వం పరిశీలిస్తోంది. వీటిపై త్వరలోనే ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే టి.రాజయ్య మహిళల్ని లైంగికంగా వేధించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై కూడా అనేక అవినీతి ఆరోపణలున్నాయి. స్థానిక క్యాడర్‌లోనూ రసమయిపై అసంతృప్తి ఉంది. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావుపై కూడా అసంతృప్తి ఉంది. అందుకే ఆయన స్థానంలో ఎర్రోళ్ల శ్రీనివాస్ లేదా ఎరుపుల్ల నరోత్తమ్‌లలో ఒకరికి టిక్కెట్ వచ్చే అవకాశం ఉంది. వీరిలో హరీష్ రావు మద్దతు ఉండటంతో ఎర్రోళ్లకే టిక్కెట్ రావొచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే, టిక్కెట్ గ్యారెంటీ హామీపైనే ఎరుపుల్ల పార్టీలో చేరినట్లు తెలుస్తోంది. అలంపూర్ నియోజకవర్గం నుంచి విఎం అబ్రహంకు కూడా ఈసారి టిక్కెట్ దక్కకపోవచ్చు. ఈ స్థానంలో సింగర్ సాయిచంద్‌కు టిక్కెట్ ఇవ్వాలనుకున్నా.. ఆయన మరణించడంతో మరో అభ్యర్థి కోసం బీఆర్ఎస్ వెతుకుతోంది.

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మరణించిన నేపథ్యంలో ఆయన స్థానంలో ఈసారి ఎవరికి టిక్కెట్ ఇస్తారో చూడాలి. సాయన్న కూతురు లాస్య నందిత, క్రిషాంక్ మన్నే, గజ్జెల నగేష్ ఈ స్థానం కోసం పోటీ పడుతున్నారు. ఇక చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్, ఆందోళ్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు మాత్రం బీఆర్ఎస్ టిక్కెట్లు ఖాయమే. ఎస్టీ నియోజకవర్గాలకు సంబంధించి ములుగు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి సీతక్క కొనసాగుతుండగా, ఆమెను ఓడించేందుకు సరైన అభ్యర్థి కోసం బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. అలాగే మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, దోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్‌కు టిక్కెట్ ఇచ్చే విషయంపై మాత్రం పునరాలోచనలో ఉంది. శంకర్ నాయక్ స్థానంలో మాలోత్ కవిత పోటీ చేయొచ్చు.