Dubbaka: దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఇలాఖాలో ఏదో జరుగుతోంది. 2020 సంవత్సరం చివర్లో జరిగిన బై పోల్‌లో 1,079 ఓట్ల స్వల్ప తేడాతో కోల్పోయిన దుబ్బాక అసెంబ్లీ సెగ్మెంట్‌ను వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెల్చుకునేందుకు కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ ప్లాన్ రెడీ చేస్తోంది. ఆనాడు దుబ్బాక నియోజకవర్గంలో జరిగిన బై పోల్‌లో సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాతకు టికెట్ దక్కినప్పటికీ గులాబీ పార్టీ నాయకుల నుంచి పూర్తి సహకారం అందకపోవడంతో ఫలితం మారిపోయింది. రఘునందన్ రావును గెలుపు వరించడంతో దుబ్బాక కాషాయ కోటగా మారింది. ఇప్పుడు ఇదే నియోజకవర్గం నుంచి సోలిపేట రామలింగారెడ్డి కుమారుడు సోలిపేట సతీష్ టికెట్ ఆశిస్తున్నారు.
మరోవైపు సిద్దిపేట ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా దుబ్బాకలో యాక్టివ్‌గా ముందుకు సాగుతున్నారు. సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడి హోదాలో ఆయన దుబ్బాకలో యాక్టివిటీస్ పెంచారు. మరోవైపు దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత, కొడుకు సతీశ్ రెడ్డి తమ అనుచరులతో నియోజకవర్గంలో తిరుగుతున్నారు. దీంతో సోలిపేట ఫ్యామిలీకి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి మధ్య విబేధాలు ఏర్పడ్డాయి. ఒకవేళ పార్టీ ఆదేశిస్తే దుబ్బాక నుంచి పోటీ చేయాలనే ఇంట్రెస్ట్‌తో కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. సోలిపేట సతీష్, కొత్త ప్రభాకర్ రెడ్డి.. ఈ ఇద్దరూ మంత్రి హరీశ్‌రావుకు సన్నిహితులే కావడంతో బీఆర్ఎస్ టికెట్ ఎవరికి లభిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఆయనకే టికెట్ కన్ఫామ్..?
దుబ్బాకలో రఘునందన్‌రావును ఓడించేందుకు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని బీఆర్ఎస్ ప్రిపేర్ చేస్తోందని సమాచారం. దుబ్బాకలో పోటీకి కేసీఆర్ నుంచి కొత్త ప్రభాకర్‌కు గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈసారి ఎలాగైనా దుబ్బాక నుంచి గెలవాలనే పట్టుదలతో కొత్త ప్రభాకర్‌రెడ్డి ఉన్నారని చెబుతున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్న కొత్త ప్రభాకర్‌రెడ్డికి 2 అంశాలు అనుకూలంగా ఉన్నాయి. ఒకటి మంత్రి హరీష్‌రావుకు అత్యంత సన్నిహితుడు కావడం, రెండోది బీఆర్ఎస్‌కు అవసరమైన మేరకు నిధులు ఖర్చు పెట్టగలిగే సామర్ధ్యం ఉన్న నేత కావడం. దీంతో పార్టీ అధిష్టానం ఆయనకే టికెట్ కన్ఫామ్ చేస్తుందనే టాక్ వినిపిస్తోంది. కొత్త ప్రభాకర్‌రెడ్డి దుబ్బాక అసెంబ్లీ నుంచి పోటీ చేస్తే.. మెదక్ ఎంపీ స్థానంలో నిలిచి గెలవగల బలమైన నేత దొరకడం కష్టమేననే ఆలోచనను కూడా బీఆర్ఎస్ పెద్దలు చేస్తున్నారట.
రఘునందన్‌కు అసమ్మతి సెగ.. కాంగ్రెస్‌లో మూడు కుంపట్లు
2020లో జరిగిన ఉపఎన్నికలో దుబ్బాక నుంచి మొదటిసారి గెలిచిన రఘునందన్.. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కానీ ఇది పెద్ద నియోజకవర్గం కావడంతో కొన్ని మండలాల్లో రఘునందన్‌రావుకు అసంతృప్తుల సెగ తగులుతోంది. మాజీ ఎమ్మెల్యే అర్ఎస్ వాసు రెడ్డి, నియోజకవర్గ బీజేపీ నేత గిరీష్ రెడ్డితో రఘునందన్‌రావుకు విబేధాలు ఉన్నాయి. గెలుపు కోసం పని చేసిన అనేక మంది ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలకు రఘునందన్‌రావు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే అసమ్మతి నేతలతో కూర్చొని సమస్యను పరిష్కారం చేసుకోవాలని రఘునందన్ రావుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం సూచించినట్లు తెలుస్తోంది.
ఇక దుబ్బాక కాంగ్రెస్ టికెట్ రేసులో చెరుకు శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ శ్రవణ్ కుమార్ రెడ్డి హోరాహోరీగా తలపడుతున్నారు. వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విబేధాలు ఉన్నాయి. కత్తి కార్తీక కూడా దుబ్బాక కాంగ్రెస్ టిక్కెట్ తనదేనని అంటున్నారు. దుబ్బాక బై పోల్‌లో ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా పోటీ చేసిన కత్తి కార్తీక కనీస ఓట్లు కూడా తెచ్చుకోలేకపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరిన ఆమె మధు యాష్కీ గౌడ్ సాయంతో దుబ్బాక టిక్కెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈవిధంగా కాంగ్రెస్‌లో మూడు వర్గాలు ఏర్పడటంతో ఆ పార్టీ కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. 3 నెలల్లో జరగబోయే రాజకీయ కురుక్షేత్రంలో ఎవరికి ప్రధాన రాజకీయ పార్టీలు టికెట్లు కేటాయిస్తాయో వేచిచూడాలి.