Revanth Reddy: ఉచిత విద్యుత్ విషయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. రేవంత్ అసలు ఏం అన్నాడన్న విషయం కన్నా.. ఈ విషయంలో బీఆర్ఎస్ చేసిన ప్రచారమే జనంలోకి వెళ్లింది. రైతులకు మూడు గంటలు మాత్రమే ఉచిత విద్యుత్ చాలు అంటూ రేవంత్ చెప్పాడని, ఇదే కాంగ్రెస్ విధానమని బీఆర్ఎస్ ప్రచారం చేసింది. దీనివల్ల రేవంత్‌కు, కాంగ్రెస్‌కు నష్టం జరిగిందనేది వాస్తవం. అయితే, ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకన్నా.. రేవంత్‌నే బీఆర్ఎస్ ఎక్కువ టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది.
కేసీఆర్, కేటీఆర్ లక్ష్యం అదే
రేవంత్‌కు ముందు కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్‌తో సన్నిహితంగా ఉన్నాడు అంటూ ప్రచారం జరిగింది. ఉత్తమ్ హయాంలో కాంగ్రెస్ బలహీనంగా ఉండేది. ఎప్పుడూ బీఆర్ఎస్‌ను ధీటుగా ఎదుర్కొన్నది లేదు. దీంతో కాంగ్రెస్‌ను కేసీఆర్ లైట్ తీసుకున్నారు. అయితే, రేవంత్ అధ్యక్షుడయ్యాక పరిస్థితులు మారిపోయాయి. కాంగ్రెస్‌లో ఊపొచ్చింది. బీఆర్ఎస్‌కు ధీటుగా కాంగ్రెస్‌ను నడిపిస్తున్నాడు. ఇదే కేసీఆర్, కేటీఆర్‌కు నచ్చడం లేదు. రేవంత్ హయాంలో కాంగ్రెస్ బలపడుతోంది. అదే టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ను తప్పిస్తే కాంగ్రెస్ బలహీనడపడటం ఖాయం. అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ పెద్దలు రేవంత్‌ను టార్గెట్ చేస్తున్నారు. మంచి ఛాన్స్ దొరికింది అన్నట్లుగా ఉచిత్ విద్యుత్‌పై వ్యాఖ్యల విషయంలో రేవంత్ లక్ష‌్యంగా పావులు కదుపుతున్నారు.
రేవంత్ టార్గెట్‌గా
ప్రస్తుతం రేవంత్ వ్యాఖ్యల విషయంలో కాంగ్రెస్‌కంటే రేవంత్ ఇమేజ‌్‌ను దెబ్బతీసేందుకే బీఆర్ఎస్ వ్యూహాలు అమలు చేస్తోంది. పార్టీని ఎక్కువగా విమర్శించకుండా రేవంత్‌పైనే విమర్శలు గుప్పిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ముఖ్యంగా రేవంత్‌ను అధ్యక్ష పదవి నుంచి తప్పించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. రేవంత్‌కు రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ హై కమాండ్ నుంచి పూర్తి మద్దతు ఉన్న సంగతి తెలిసిందే. ఆ మద్దతు తగ్గేలా చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఉచిత విద్యుత్‌పై రేవంత్ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు, టీడీపీతో ముడిపెట్టి ప్రచారం చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ లక్షణం కాదని, టీడీపీ లక్షణం అంటూ విమర్శిస్తున్నారు. రేవంత్‌పై కాంగ్రెస్ శ్రేణులకు నమ్మకం తగ్గేలా, ఆయనవల్లే ఆ పార్టీ బలహీనపడుతోందనేలా ప్రచారం చేయిస్తోంది బీఆర్ఎస్. ఇటీవల మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ‘‘కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని బలిదేవత అన్న వ్యక్తికే పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చారు. గాంధీ భవన్‌ను గాడ్సేకు అప్పగించిన కాంగ్రెస్ పార్టీ.. తన అంతానికి వీలునామా రాసుకుంది. ఇది కాంగ్రెస్ అమాయకత్వమో, ఆత్మహత్యా సదృశమో తేల్చుకోవాలి. పోకిరి చేతిలో కాంగ్రెస్‌ను పెట్టారు’’ అన్నారు. దీనిద్వారా కేటీఆర్ వ్యూహాత్మకంగా కాంగ్రెస్‌ను విమర్శించకుండా రేవంత్‌నే విమర్శించారు. రేవంత్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలనేలా ఆయన వ్యాఖ్యలున్నాయి.
రేవంత్ బదులు వేరొకరు రావాలనుకుంటోందా..?
ప్రస్తుతం బీఆర్ఎస్ వైఖరి చూస్తుంటే రేవంత్‌ను టీపీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగించి, వేరొకరిని నియమించాలని ఆశపడుతున్నట్లు కనిపిస్తోంది. రేవంత్ కాకుండా ఎవరు అధ్యక్షులైనా రేవంత్ అంత దూకుడుగా వ్యవహరించలేరు. పైగా వారిని తమవైపు తిప్పుకోవడం కూడా సులభమవుతుదని కేసీఆర్, కేటీఆర్ ఆలోచన. అందుకే వీలైనంతగా రేవంత్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీస్తున్నాడు అనేలా బీఆర్ఎస్ ప్రచారం సాగుతోంది. అయితే, ఈ విషయాన్ని కాంగ్రెస్ హైకమాండ్ ఎంతవరకు పట్టించుకుంటుందో చూడాలి.
బండి విషయంలోనూ ఇదే వైఖరి
ఇటీవలే బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించిన బండి విషయంలోనూ బీఆర్ఎస్ ఇదే తరహా ప్రచారం చేసిందనే వాదన ఉంది. ఎందుకంటే బండిని బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని బీఆర్ఎస్ భావించింది. తెలంగాణలో బీజేపీ కూడా బండి హయాంలోనే బలపడింది. ఇప్పుడు బండిని తొలగించడంతో ఆ పార్టీ బలహీనపడినట్లు కనిపిస్తోంది. ఈ విషయంలో బీఆర్ఎస్ ముందునుంచి బండికి వ్యతిరేకంగా ప్రచారం చేయించింది. సక్సెస్ అయింది. బండి స్థానంలో కిషన్ రెడ్డిని హైకమాండ్ నియమించింది. కిషన్ రెడ్డి.. కేసీఆర్‌కు అనుకూలంగా ఉంటారనే వాదన ఎప్పటినుంచో ఉంది. ఇప్పుడు రేవంత్ విషయంలోనూ అదే వ్యూహాన్ని బీఆర్ఎస్ అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. రేవంత్‌ను తొలగించి, ఇంకొకరిని ఆ స్థానంలో నియమిస్తే తమ విజయం సులభమవుతుందని బీఆర్ఎస్ భావిస్తుంది. నిజంగా బీఆర్ఎస్ వ్యూహం ఫలిస్తుందో.. లేదో కొంతకాలం ఆగితే తెలుస్తుంది.