BRS-KCR: టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీ చేశారు. ఏపీ, మహారాష్ట్రసహా వివిధ రాష్ట్రాల్లో పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలో అయితే.. ఏకంగా సభలు, సమావేశాలు నిర్వహించారు. ఇతర రాష్ట్రాల్లో పోటీ చేస్తామన్నారు. జాతీయ పార్టీగా ఎదిగి, దేశాన్నే మార్చేస్తాం అంటూ గొప్పలు చెప్పారు. తీరా చూస్తే.. తెలంగాణలోనే అధికారం కోల్పోయింది బీఆర్ఎస్. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కూడా పెద్దగా ప్రభావం చూపే అవకాశం కనిపించడం లేదు.
AP Politics : ఓవైపు పవన్, బాబు.. మరోవైపు షర్మిల.. అష్టదిగ్బంధనంలో పవన్!
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ భవిష్యత్ ఏంటి..? తెలంగాణకే పరిమితమవుతుందా..? ఇతర రాష్ట్రాల్లో పోటీ చేసి.. జాతీయ రాజకీయాల్లో సత్తా చాటుుతందా..? ప్రస్తుత పరిణామాలు చూస్తే.. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకే పరిమితమయ్యే అవకాశం ఉంది. రెండుసార్లు అధికారం దక్కించుకున్న పార్టీ.. దశాబ్దకాలంపైగా తెలంగాణలో హవా చాటిన పార్టీ.. ఇప్పుడు మనుగడ కోసమే ప్రయత్నించాల్సిన పరిస్థితి వచ్చింది. పార్టీ అధినేత అనారోగ్యం కారణంగా ఇంటికే పరిమితమవ్వడం, కీలక నేతలుగా చెప్పుకొంటున్న కేటీఆర్, హరీష రావు ప్రభావం పెద్దగా కనిపించకపోవడం బీఆర్ఎస్‌కు మైనస్‌గా మారాయి. రాబోయే ఎన్నికల్లో ఏ నినాదంతో, ఏ లక్ష్యంతో ముందుకెళ్లాలో కూడా బీఆర్ఎస్ నేతలకు తెలియడం లేదు. అధికారం చేపట్టిన కాంగ్రెస్ మీద.. ఇప్పటికిప్పుడు అంత వ్యతిరేకత కనిపించడం లేదు. బీఆర్ఎస్ విమర్వలకు ఘాటుగానే బదులిస్తోంది. మరోవైపు అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం తర్వాత మోదీ, బీజేపీ హవా దేశమంతా పెరిగింది. అందువల్ల లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉండొచ్చు. బీఆర్ఎస్‌కు సీట్లు దక్కినా.. పెద్దగా ప్రయోజనం ఉండబోదన్నది విశ్లేషకుల అంచనా.
Bihar CM, Nitish Kumar : నీతిలేని.. నితీష్
అందువల్ల ప్రజలు కూడా బీఆర్ఎస్‌ను ఈ ఎన్నికల్లో పెద్దగా పరిగణనలోకి తీసుకోరు. పోనీ.. ఏదోలా ప్రజల్లోకి దూసుకెళ్దాం.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మీద తిరగబడదాం అంటే.. అటు ఢిల్లీలో కవిత లిక్కర్ కేసు.. రాష్ట్రంలో మేడిగడ్డ, కాళేశ్వరం సహా వివిధ అవినీతి అంశాలు అడ్డుతగులుతున్నాయి. అందువల్ల కేసీఆర్ కూడా ఈసారి గట్టిగా పోరాడే పరిస్థితి కనిపించడం లేదు. రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక రకంగా సైలెన్స్ అయ్యే పరిస్థితి ఉంది బీఆర్ఎస్‌కు. అలాంటిది.. ఇంకా జాతీయ రాజకీయాల వైపు కన్నెత్తి చూడటమా..? ఇక్కడే ఎలాగోలా.. రెండు, మూడు సీట్లు గెలిచి.. పరువు నిలబెట్టుకుంటే బీఆర్ఎస్‌కు అదే గొప్ప. అలాంటిది ఇతర రాష్ట్రాల్లో రాజకీయాలు చేసేంత సీన్ ప్రస్తుతానికైతే బీఆర్ఎస్‌కు లేదు. భవిష్యత్తులోనూ ఆ అవకాశాలు కనిపించడం లేదు. అంటే.. ఇక బీఆర్ఎస్.. పక్కా తెలంగాణకే పరిమితమనుకోవాలేమో..!