బెజవాడను ముంచిన బుడమేరు హిస్టరీ ఇదే

“ఇంత బతుకు బతికి ఇంటి వెనుక నూతిలో పడ్డట్టు” ఈ మాట బెజవాడకు సరిగా సరిపోతుంది ఇప్పుడు. బెజవాడ చరిత్రలో... ఇంత మంది ప్రజలు వరద దెబ్బకు రోడ్డున పడిన పరిస్థితి ఎన్నడూ లేదు. బుడమేరు ఇప్పుడు కష్టాల మేరు, కన్నీటి మేరు, విషాద మేరు.

  • Written By:
  • Publish Date - September 10, 2024 / 09:12 PM IST

“ఇంత బతుకు బతికి ఇంటి వెనుక నూతిలో పడ్డట్టు” ఈ మాట బెజవాడకు సరిగా సరిపోతుంది ఇప్పుడు. బెజవాడ చరిత్రలో… ఇంత మంది ప్రజలు వరద దెబ్బకు రోడ్డున పడిన పరిస్థితి ఎన్నడూ లేదు. బుడమేరు ఇప్పుడు కష్టాల మేరు, కన్నీటి మేరు, విషాద మేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఆర్ధిక రాజధానిగా, దేశంలోనే ఆటో మొబైల్ పరిశ్రమకు కీలక ప్రాంతంగా… దేశ రైల్వే వ్యవస్థకు గుండెకాయ లాంటి ప్రాంతంగా పేరు తెచ్చుకున్న బెజవాడ… ఒక వాగు దెబ్బకు అల్లాడిపోయింది. బతుకు జీవుడా అంటూ లక్షల మంది ప్రజలు వరదలో, బురదలో పరుగులు తీసారు.

అసలు ఈ బుడమేరు వాగు… బెజవాడకు ఎందుకు అంత ప్రమాదం అని ఇప్పుడు ఎవరిని అడిగినా చెప్పే మాట… “బుడమేరు నగరం నడిబొడ్డు నుంచి ప్రవహించడమే.” విజయవాడ నగరం, రూరల్ లో మొత్తం 6 నియోజకవర్గాలను కలుపుకుంటూ వెళ్తుంది. మైలవరం నియోజకవర్గం మొదలై… విజయవాడ పశ్చిమ, సెంట్రల్, తూర్పు, గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాల నుంచి ఈ బుడమేరు ప్రయాణం ఉంటుంది. వీటిల్లో మైలవరం, విజయవాడ పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాలు బాగా ప్రభావితం అయ్యాయి మొన్నటి వరదలకు.

కృష్ణా నదితో పోల్చడానికి కూడా బుడమేరుకి స్థాయి లేదు. ప్రకాశం బ్యారేజ్ కాలవలతో సమానం. తల్లి చేసిన నష్టం కంటే పిల్ల చేసిన నష్టం ఎక్కువ అన్నట్టు… “ఇటీవల కృష్ణా నదికి ఎగువ నుంచి వచ్చిన వరద 11 లక్షల 50 వేల క్యూసెక్కులు… రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన తర్వాత మునిగినవి మూడు నాలుగు ప్రాంతాలే. అది కూడా కృష్ణా నదికి ఆనుకుని ప్రాంతాలు. కాని 75 వేల క్యూసెక్కులతో విరుచుకుపడిన బుడమేరు వాగు దెబ్బకు మునిగిన ప్రాంతం బెజవాడలో 35 నుంచి 40 శాతం.” ఇది బుడమేరు ఎంత ప్రమాదమో చెప్పడానికి చిన్న లెక్క.

అసలు ఈ బుడమేరు ఎక్కడ పుట్టింది…?

బుడమేరు వాగు… మైలవరం కొండల్లో పుట్టిన ఒక చిన్న వాగు… ఆగిరిపల్లి, కొండపల్లి అనే రెండు కొండల మధ్యన పుట్టింది. అలా కొండల్లో నుంచి వచ్చే నీటితో ఏడాది పొడవునా నీళ్ళు ఉంటాయి. ప్రతీ ఏటా… 10 వేల నుంచి 11 వేల క్యూసెక్కుల నీరు ఈ వాగులో ప్రవహిస్తుంది. 2005 లో వచ్చిన వర్షాలకు ఈ వాగులో 75 వేల క్యూసెక్కుల నీరు ప్రవహించింది. అప్పుడు కూడా విజయవాడ ఇబ్బంది పడింది కానీ… ఈ స్థాయిలో కాదు. ఈ వాగు ప్రయాణంలో చాలా మెలికలు ఉంటాయి… బుడమేరు వాగులో పడవలో ప్రయాణిస్తే ఆ మలుపులకు మనకు ఘాట్ రోడ్ లో ప్రయాణించే అనుభూతి కలుగుతుంది.

వర్షాలకు నీరు పెరిగినప్పుడు ఆ మలుపులు తిరిగే సమయంలో ఇళ్ళ మీద వరద పడుతుంది. ఆ పడటం అనేది ఆక్రమణల కారణంగా ఎక్కువైపోయింది. విజయవాడ నగరంలో ఒకప్పుడు 200 మీటర్ల వెడల్పు ఉండే బుడమేరు వాగు… ఇప్పుడు వంద మీటర్ల వెడల్పే ఉంది. అలా చాలా ప్రాంతాన్ని ఆక్రమించారు. అందుకే నీరు తన దారి వెతుక్కుంటూ ఇళ్ళల్లోకి వెళ్ళిపోయింది. 2005 లో వచ్చిన వరదల సమయంలో బుడమేరుకి కృష్ణా నది తరహాలో రిటైనింగ్ వాల్ నిర్మాణం కొంత మేర జరిగినా ఆ పనులు ముందుకు వెళ్ళలేదు.

ఇప్పుడు ముంపుకు గురైన సింగ్ నగర్ ప్రాంతంలో వాగు వెడల్పు చాలా పెద్దది… కానీ అక్కడ చాలా మంది ఆక్రమించేసారు. బుడమేరు సామర్ధ్యం పెంచాలని ప్రభుత్వం భావించింది… 11 వేల క్యూసెక్కుల సామర్ధ్యం ఉన్న వాగు ప్రవాహంను 17 వేల క్యూసెక్కులు చేయాలని చూసారు. కాని అంతకు 140 శాతం ఎక్కువ వరద వచ్చింది. అంటే 45 వేల క్యూసెక్కుల వరద వచ్చింది. ఎన్టీఆర్ జిల్లాలోని వెలగలేరు వద్ద బుడమేరు వాగుకు డైవర్షన్ కాలవ ఉంది. అక్కడ రెగ్యులేటర్ కు 11 గేట్లు ఉన్నాయి. అవి ఎత్తితే పవిత్ర సంగమం వద్ద కృష్ణా నదిలో వరద చేరుతుంది.

కాని వరద తీవ్రత పెరగడానికి తెలంగాణా నుంచి వచ్చిన వాగులు, వంకలు బుడమేరులో కలవడమే. దీనితో వెలగలేరు రేగ్యులేటరిపై ఎక్కువ ప్రభావం పడి… డైవర్షన్ కాలవకు గండ్లు భారీగా పడ్డాయి. అక్కడి నుంచే విజయవాడ మునగడం మొదలయింది. కవులూరు దగ్గరి నుంచి… రాయనపాడు మొదలుకుని జక్కంపూడి, వైఎస్సార్ కాలనీ, వాంబే కాలనీ సహా పలు ప్రాంతాల్లోకి భారీగా వరద వచ్చేసింది. ఇప్పుడు మూడు గండ్లను ఆర్మీ సహకారంతో పూడ్చారు. అయితే బుడమేరుకి వరద మళ్ళీ పెరిగితే విజయవాడకు ముప్పు ఉంటుంది.

2010 తర్వాత బుడమేరు పరివాహక ప్రాంతంలో కొత్త కాలనీలు వచ్చేసాయి. అతి తక్కువ ధరకు అపార్ట్మెంట్ లు కొనుక్కున్నారు చాలా మంది. అవన్నీ బుడమేరులో ఆక్రమించి కట్టిన నివాసాలే. చాలా మందికి అది ముంపు ప్రాంతం అని కూడా తెలియదు. తక్కువ ధరకు ఫ్లాట్ వచ్చిందని మధ్యతరగతి వారు కొనుక్కున్నారు. 2010 తర్వాత బుడమేరుకు వరద వచ్చి ఉంటే వాళ్లకు ఒక అవగాహన ఉండేది. ఇక యూటర్నింగ్ ప్రాంతాలు బుడమేరుకి ఎక్కువ… విజయవాడ నగరం, రూరల్ లోని నిడమానూరు ప్రాంతాల్లో అవి ఎక్కువగా ఉంటాయి. అక్కడ ఎక్కువగా ఆక్రమణలు జరిగాయి. వాటిని సవరించాలని 20 ఏళ్ళ క్రితమే ప్లాన్ చేసినా ముందుకు పనులు సాగలేదు.

మంచి నీటి సరస్సు అయిన కొల్లేరులో కలిసే బుడమేరు వాగు ఆక్రమణలు తొలగించి, వాగు విస్తీర్ణం పెంచకపోతే మాత్రం ఇంతకంటే ఎక్కువ ప్రమాదాలు రావచ్చు. 2005 లో వచ్చిన 75 వేల క్యూసెక్కులను తట్టుకున్న బెజవాడ, 45 వేల క్యూసేక్కులకే మునిగింది అంటే… అది కేవలం ఆక్రమణల పాపమే అని చెప్పాలి. అలాగే బుడమేరు వాగు కరకట్టపై అక్రమంగా మట్టి తోలుకున్నారు. దీనితో కట్ట బలహీనపడిపోయింది. పడిన మూడు గండ్లుకి అదే కారణం. కాబట్టి ప్రభుత్వం శరవేగంగా కట్టను బలోపేతం చేయకపోతే మాత్రం ఇంతకంటే పెద్ద విపత్తులు చూడవచ్చు.