Etela Rajender: ఈటలకు బీజేపీలో కీలక పదవి.. బండి సంజయ్‌ ఇక ఔటేనా ?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్‌డౌన్‌ స్టార్ట్ అయింది దాదాపుగా ! ఎన్నికల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు పార్టీలన్నీ సిద్ధం అవుతున్నాయ్. బీఆర్ఎస్‌ను ఓడించాలని.. బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా.. ప్రతీ అంశాన్ని ఆయుధంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది.

  • Written By:
  • Publish Date - June 9, 2023 / 04:20 PM IST

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను స్ట్రాంగ్‌గా ఢీకొట్టేందుకు.. అవసరమైన అస్త్రాలను బయటకు తీస్తోంది. పార్టీలో లుకలుకలకు బ్రేక్ చెప్పడం, అధికార పార్టీ వైఫల్యాలను హైలైట్ చేయడం, కీలక నేతలను పార్టీలోకి ఆహ్వానించడం.. ఇలా రకరకాల వ్యూహాలతో అసెంబ్లీ ఎన్నికల యుద్ధానికి సిద్ధం అవుతోంది బీజేపీ. బీజేపీకి చాలాకాలంగా బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన పార్టీ పగ్గాలు అందుకున్న తర్వాత.. పార్టీ బాగా పుంజుకుందని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. బండి పనితీరుపై మోదీ, అమిత్, నడ్డా హ్యాపీగా ఉన్నారు. సికింద్రాబాద్ సభలో అయితే.. జనాలను చూసి బండి సంజయ్ భుజం తట్టి శభాష్ అన్నారు మోదీ.

ఇంతవరకు అంతా బాగానే ఉన్నా.. మిగిలిన నేతలను సంజయ్ కలుపుకుపోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయ్. ముఖ్యంగా కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతలను సంజయ్ కనీసం పట్టించుకోరు అనే విమర్శ ఉంది. దీనికి సంబంధించి అధిష్టానానికి కంప్లైంట్‌లు కూడా వెళ్లాయ్. అందరినీ కలుపుకోలేక పోవడంతోనే.. పార్టీలో చేరిన నేతలంతా.. తిరిగి వెళ్లిపోతున్నారని బండి సంజయ్ మీద చాలామంది ఫిర్యాదు చేశారు. దీంతో బండి సంజయ్‌ను పార్టీ అధ్యక్షుడిగా తప్పించాలని పార్టీ హై కమాండ్ భావిస్తుందని.. కేంద్రమంత్రివర్గంలో స్థానం కల్పించడం ద్వారా దీన్ని బ్యాలెన్స్ చేయాలని భావిస్తుందనే గుసగుసలు వినిపిస్తున్నాయ్.

ఇక అటు ఈటల, బండి.. ఇలా తెలంగాణ బీజేపీ రెండు వర్గాలుగా విడిపోయిందని.. పార్టీ హైకమాండ్ అంచనాకు వచ్చింది. ఇలాంటి పరిణామాల మధ్య.. ఢిల్లీ నుంచి ఈటలకు పిలుపు వచ్చింది. ఆయనకు ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈటలతో పాటు సీనియర్ నేత డీకే అరుణకు కీలక పదవి అధిష్టానం అప్పగించే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి ప్రచార కమిటీ చైర్మన్ అనే పదవి బీజేపీలో లేదు. ఈటల కోసమే క్రియేట్ చేస్తున్నారు. నిజంగా ఇదే పదవి ఇస్తారా.. లేదంటే అందరూ అనుకుంటున్నట్లు తెలంగాణ పార్టీ పగ్గాలు అప్పగిస్తారా అనే చర్చ నడుస్తోంది. హస్తిన నుంచి ఈటల రిటర్న్ అయితే తప్ప అసలు విషయంపై క్లారిటీ వచ్చే చాన్స్‌ లేదు.