విశాఖలో కాక రేపుతున్న క్యాంప్‌ రాజకీయం

  • Written By:
  • Publish Date - August 12, 2024 / 07:40 PM IST

ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థిని ఎన్డీఏ కూటమి ఖరారు చేసింది. కాపు సామాజికవర్గానికి చెందిన బైరా దిలీప్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. ప్రతిపక్ష వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కూడా బొత్స సత్యానారాయణను తమ అభ్యర్థిగా ప్రకటించింది. త్వరలోనే రెండు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు. మరోవైపు, ఎమ్మెల్సీ ఎన్నికల కోసం క్యాంపు రాజకీయాల కాక మొదలైంది.ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయం రసకందాయంలో పడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బొత్స సత్యనారాయణ పేరును ప్రకటించిన తర్వాత కూటమిలో అనేక చర్చలు జరిగాయి.

సంఖ్యాబలం ఆధారంగా ఈ ఎన్నికల్లో పోటీకి సీనియర్లు సంశయించారు. అధిష్టానం సైతం నియోజకవర్గాల వారీగా ఫీడ్ బ్యాక్ తీసుకున్న తర్వాతే పోటీ సంసిద్ధతపై ప్రకటన చేయాలని భావించింది. ఇందుకోసం ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. కూటమి ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలతో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీ నాయకత్వం మొగ్గు చూపింది. కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా బొత్స సత్యనారాయణను బలంగా ఎదుర్కోవడం సాధ్యమవుతుందని ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో ఇటీవల కూటమి తరపున అనకాపల్లి ఎంపీ సీటు ఆశించి విస్తృత ప్రచారంలోకి వచ్చిన దిలీప్‌ పేరు తెరపైకి వచ్చింది.

మొత్తం 838 మంది ఓటర్లు ఉండగా వీరిలో వైసీపీకి 598, కూటమికి 240 వరకు సంఖ్యాబలం ఉంది. ప్రతిపక్షానికి ఉన్న ఎంపీటీసీలు, జడ్పిటిసీలలో పలువురు ఇప్పటికే అధికార పక్షానికి టచ్‌లో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. పోటీపై టీడీపీ పునరాలోచనలో పడిందన్న ప్రచారం జరగడంతో వైసీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. అయితే, నామినేషన్లకు రెండు రోజులు గడువు ఉండగా ఎన్నికల్లో పోటీ, అభ్యర్థి ఎంపిక విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది టీడీపీ. వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ, కూటమి అభ్యర్థిగా దిలీప్‌ బైరా ఫైనల్ అయ్యారు. మ్యాజిక్ ఫిగర్ 460 కాగా కనీసం 500 ఓట్ల మద్దతు లభిస్తేనే ఈ ఎన్నికల్లో కంఫర్టబుల్ విన్నింగ్ సాధ్యమవుతుంది.

ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పోటీకి సిద్ధం అవ్వడంపై వైసీపీ ఆరోపణలు మొదలుపెట్టింది. సంఖ్యా బలం లేకపోయినా ఎన్నికల బరిలోకి దిగడం అంటే కచ్చితంగా ప్రలోభాలకు గురి చేయడం, అధికారాన్ని అడ్డుపెట్టుకొని భయపెట్టే ప్రయత్నంలో భాగమేనని ఆరోపిస్తోంది. గతంలో 50 ఓట్లు తక్కువ ఉన్నప్పుడు న్యాయంగా తాము పోటీకి దూరంగా ఉన్నామని గుర్తు చేస్తున్నారు. మరోవైపు రాజకీయంగా ఎదుర్కోవడానికి ప్రతిపక్షం పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది. మండలాల వారిగా ఎన్నికల బాధ్యతలను పార్టీ ముఖ్య నాయకత్వానికి అప్పగించింది. మాజీ మంత్రులు, పార్టీ సీనియర్లు ఇప్పటికే ఎన్నికల ప్రచారం, ఓటర్లను కాపాడుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికలు పోటీ అని వార్యంగా మారడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది.

ఇప్పటికే అరకు, పాడేరు నియోజకవర్గాలకు చెందిన నాయకులను బెంగళూరు పర్యటనకు తరలించింది. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత మిగిలి వారిందరినీ విహారయాత్రల పేరుతో రాష్ట్రం దాటించేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం నాలుగు ప్యాకేజీలను రూపొందించగా.. ఒక బృందం క్రూయిజ్ ట్రిప్పుకు రెడీ అయింది. వీరంతా శ్రీలంకతో పాటు ఇతర దేశాలు తిరిగి వస్తారని అంతర్గత సమాచారం. మిగిలిన ప్యాకేజీలో భాగంగా మైసూర్, ఊటీ, కొడైకెనాల్‌వంటి పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. మరి కొంతమంది అరుణాచలం, తిరుత్తని, మధురై వెళుతున్నట్టు చర్చ జరుగుతోంది.

వైసీపీ చేస్తున్న క్యాంపులపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తోంది అధికార కూటమి. ఓటర్లను ఎన్ని దేశాలు తిప్పిన తిరిగి వచ్చి ఓటేసేది కూటమికేనని కాన్ఫిడెంట్‌గా చెప్తోంది. 150 ఓట్ల మెజార్టీ తగ్గకుండా ఎమ్మెల్సీ స్థానం గెలుచుకుంటామని కూటమి ఎమ్మెల్యేలు ధీమాగా ఉన్నారు. ఇప్పుడు టీడీపీ కూడా బల ప్రదర్శనకు రంగం సిద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడం పెద్ద కష్టం కాదని భావిస్తున్న ఎమ్మెల్యేలు ఆ దిశగా అవసరం మేరకు క్యాంపులు నిర్వహించేందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎన్నికలకు 18 రోజుల సమయం ఉన్నందున కూటమి వైపు ఆకర్షితులయ్యే ఓటర్లను సంరక్షించడం ఇప్పుడు కీలకంగా భావిస్తున్నారు. ఇటు కూటమి, అటు వైసీపీ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో బిజీబిజీగా మారడం రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తోంది.