Yevgeny Prigozhin: ప్రిగోజిన్‌కు ప్రాణహాని.. పుతిన్ క్షమిస్తాడా.. శిక్షిస్తాడా..? గత చరిత్ర ఏం చెబుతోంది..?

తనను వ్యతిరేకించే వాళ్లను దేశం విడిచిపోయేలా చేయడమో, శిక్షలు వేయడమో.. చివరకు చంపడమో కూడా చేయగల సమర్ధుడు పుతిన్. తనకు ఎదురుతిరిగిన ఎందరినో అడ్డులేకుండా చేసుకున్న పుతిన్.. ఇప్పుడు వాగ్నర్ గ్రూప్ నాయకుడు ప్రిగోజిన్ విషయంలో ఏం చేస్తాడో అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

  • Written By:
  • Publish Date - June 27, 2023 / 09:49 AM IST

Yevgeny Prigozhin: తనకు ఎదురుతిరగడాని అస్సలు సహించని నేత రష్యా అధ్యక్షుడు పుతిన్. అలాంటిది తనకు అనుచరుడు, నమ్మకస్తుడు అయిన ప్రిగోజిన్ తిరుగుబాటును సహిస్తారా..? గతంలో తనకు ఎదురుతిరిగిన ఎంతోమందిని హత్య చేయించిన చరిత్ర ఉన్న పుతిన్.. ప్రిగోజిన్‌పైనా పగతీర్చుకుంటారా..? క్షమిస్తారా..?
ప్రపంచంలోనే బలమైన, ప్రమాదకర నియంతల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒకరు. రష్యా అధ్యక్ష పీఠం చేజిక్కించుకున్న తర్వాత ఆ దేశంలో తనకు ఎదురే లేకుండా చేసుకున్నాడు. రష్యాకు శాశ్వత అధ్యక్షుడు అయ్యేందుకు రాజ్యాంగాన్నే మార్చుకున్నాడు. తనను వ్యతిరేకించే వాళ్లను దేశం విడిచిపోయేలా చేయడమో, శిక్షలు వేయడమో.. చివరకు చంపడమో కూడా చేయగల సమర్ధుడు పుతిన్. ఇటీవలి యుక్రెయిన్‌పై యుద్ధాన్ని వ్యతిరేకించిన ఎందరో రష్యన్లు అనుమానాస్పదంగా మరణించారు. వారిలో రష్యాకు చెందిన అత్యంత ధనవంతులు, బడా వ్యాపారవేత్తలు, పుతిన్ సన్నిహితులు కూడా ఉన్నారు. ఆ మరణాల వెనుక పుతిన్ ఉన్నాడని చాలా మంది ఆరోపిస్తుంటారు. తనకు ఎదురుతిరిగిన ఎందరినో అడ్డులేకుండా చేసుకున్న పుతిన్.. ఇప్పుడు వాగ్నర్ గ్రూప్ నాయకుడు ప్రిగోజిన్ విషయంలో ఏం చేస్తాడో అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అమెరికా హెచ్చరిక
రష్యా ప్రైవేటు సైన్యమైన వాగ్నర్ గ్రూప్ ఇటీవల సైన్యంపై, పుతిన్‌పై తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే. దీన్ని నమ్మక ద్రోహంగా పుతిన్ వర్ణించాడు. ప్రిగోజిన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. చివరకు బెలారస్ అధ్యక్షుడి జోక్యంతో వివాదం సద్దుమణిగింది. ప్రిగోజిన్ తన తిరుగుబాటును ఉపసంహరించుకుని, ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు నిర్ణయించుకున్నాడు. వివాదం ముగిసి ఉండొచ్చు. కానీ, ఇలాంటి పరిస్థితుల్ని పుతిన్ సహించే రకం కాదని ప్రపంచానికి తెలిసిన సత్యం. తనకు అడ్డొచ్చని వాళ్లు ఎంతటివారైనా హతమార్చడానికి వెనుకాడని పుతిన్.. ప్రిగోజిన్‌కు కూడా ప్రాణహాని తలపెట్టవచ్చని అమెరికా సహా పలు దేశాలు హెచ్చరిస్తున్నాయి. అమెరికాకు చెందిన నిఘా సంస్థ సీఐఏ మాజీ డైరెక్టర్ డేవిడ్ పెట్రాస్ ఈ విషయంలో ప్రిగోజిన్‌కు హెచ్చరికలు జారీ చేశాడు. ప్రిగిజోన్‌కు పుతిన్ నుంచి ప్రాణహాని పొంచి ఉందని, నిరంతరం జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. ముఖ్యంగా కిటీకీలపై ఒక కన్నేసి ఉంచాలి అని చెప్పాడు.

పుతిన్‌కు ఎదురు తిరిగిన చాలా మంది కిటికీలోంచి కిందపడి చనిపోయారు. చాలా మంది అనుమానాస్పదంగా మరణించారు. అందుకే ఈ విషయంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ప్రిగోజిన్‌కు సూచిస్తున్నారు. అయితే, పుతిన్ గురించి ఇతరులకంటే ప్రిగోజిన్‌కే ఎక్కువ తెలుసు. అందువల్ల ఈ విషయంలో అతడు తగిన జాగ్రత్తలు తీసుకుంటాడనే నమ్ముతున్నారు. ప్రిగోజిన్ ప్రస్తుతం బెలారస్ చేరుకున్నారు. ఇది రష్యా, పుతిన్ అనుకూల దేశం. అందువల్ల అక్కడ మరింత అప్రమత్తంగా ఉండాలని అంతర్జాతీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. మరోవైపు తమ దేశంలో ప్రిగోజిన్ తిరుగుబాటు వెనుక శత్రు దేశాల కుట్ర ఉందని రష్యా అనుమానిస్తోంది. ఈ దిశగా పరిశోధన ప్రారంభించింది.