Chikoti Praveen: క్యాసినో వ్యవహారం తెరపైకి రావడానికి ముందు చికోటి ప్రవీణ్ ఎవరో కూడా తెలియదు జనాలకు! ఆ వ్యవహారం వెలుగులోకి వచ్చాక.. ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు. ప్రవీణ్ వ్యాపారాలు, ఆయన లైఫ్‌స్టైల్ చూసి నెజిటన్లు కూడా ఫిదా అయ్యారు. అప్పటి నుంచి ఏదో ఒకలా వైరల్ అవుతూనే ఉన్నారు చికోటి. అనుకోకుండా వచ్చిన ఈ గుర్తింపును తనకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్న ప్రవీణ్.. కమలం పార్టీలో చేరే ప్రయత్నం చేశారు. దీనికి తగినట్లే కొంతకాలంగా హిందుత్వపై చికోటి అనేక కామెంట్స్ చేస్తున్నారు.
బీజేపీలో చేరబోతున్నానని ప్రకటించడమే కాకుండా, భారీగా తన అనుచరులు, అభిమానులతో ర్యాలీగా తెలంగాణ బీజేపీ ఆఫీస్‌కు చేరుకున్నారు. నగరం అంతా భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఐతే ప్రవీణ్‌ను చేర్చుకునేందుకు తెలంగాణ బీజేపీ కీలక నాయకులు ఎవరు ఆసక్తి చూపించకపోవడం, ఆయన భారీ ర్యాలీతో పార్టీ కార్యాలయానికి చేరుకున్నా.. ఎవరు స్వాగతం పలకకపోవడం, ఎవరూ అందుబాటులో లేకుండా ఉండడం.. కొద్దిసేపు వేచి చూసినా ఎవరూ అందుబాటులో లేకపోవడంతో.. అసంతృప్తితో వెనుతిరిగి వెళ్లారు. తాను బీజేపీలో చేరుతున్నాను అనగానే తనకు రెడ్ కార్పెట్ వేస్తారని.. పార్టీలో కీలక స్థానం ఇస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రవీణ్‌ను కనీసం పార్టీలో చేర్చుకునేందుకు కూడా బీజేపీ నేతలు ఇష్టపడలేదు. అలాగే తనను చేర్చుకునేందుకు బీజేపీలోని కొంతమంది నేతలు ఇష్టపడడం లేదనే విషయాన్ని ప్రవీణ్ గ్రహించారు. తనంటే భయం ఎవరికో అర్థమైందని.. తనను ఎవరు ఏం చేయలేరని చికోటి అన్నారు.
మీ రాజకీయం మీరు చేయండి.. నా రాజకీయం నేను చేస్తా అంటూ సవాల్ విసిరారు. ఐతే ఇప్పుడు బీజేపీ తనను అవమానించడంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట ప్రవీణ్. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు టాక్. ఈ మేరకు ఆయనపై ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ నాయకులు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వారంతా ప్రవీణ్‌ని కలిసి తమ అసంతృప్తిని వెళ్ళగక్కారట. బిజెపి చివరి నిమిషంలో చేరికకు నో చెప్పడం, తమ కులానికి జరిగిన అవమానంగా భావించి కొత్త పార్టీ పెట్టాలని ప్రవీణ్‌పై ఒత్తిడి చేస్తున్నారట. తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో.. త్వరలోనే ఢిల్లీకి వెళ్లి కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ మొదలుపెట్టే ఆలోచనలో ప్రవీణ్ ఉన్నట్లుగా తెలుస్తోంది.