MP Avinash Reddy: అవినాష్‌ రెడ్డి మరోసారి సీబీఐ నోటీసులు.. ఈ మే19న విచారణకు రావాలని ఆదేశం..

వైఎస్‌ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు కావాలని ఆదేశించింది. వాట్సాప్‌ ద్వారా అవినాష్‌కు నోటీసులు పంపించారు అధికారులు. కానీ అప్పటికే ప్లాన్‌ చేసిన ప్రోగ్రామ్స్‌ ఉన్న కారణంగా తాను విచారణకు రాలేనంటూ సీబీఐకి లేఖ రాశారు అవినాష్‌. తాను పులివెందుల వెళ్తున్నానని.. మరో నాలుగు రోజులు సమయం కావాలంటూ లేఖ రాశారు.

  • Written By:
  • Publish Date - May 16, 2023 / 07:25 PM IST

సీబీఐ నుంచి ఎలాంటి రెస్పాన్స్‌ రాకుండానే హైదరాబాద్‌ నుంచి పులివెందులకు బయల్దేరారు. దీంతో పరిస్థితి ఉత్కంఠగా మారింది. కానీ సీబీఐ మాత్రం అవినాష్‌ లేఖకు చాలా సానుకూలంగా స్పందించింది. ఈ నెల 19న మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలంటూ మరోసారి నోటీసులు జారీ చేసింది. అవినాష్‌ రెడ్డి పులివెందులకు వెళ్తుండగా వాట్సాప్‌లోనే నోటీసులు పంపించారు అధికారులు. ఇప్పుడు 19న అవినాష్‌ రెడ్డి విచారణకు వస్తారా లేదా అనేది సస్పెన్స్‌గా మారింది.

ఈ కేసులో ఇప్పటికే అవినాష్ రెడ్డిని 5 సార్లు ప్రశ్నించారు సీబీఐ అధికారులు. మొదటి నాలుగు సార్లు అవినాష్‌ రెడ్డిని సాక్షిగా పరిగణించిన సీబీఐ 5వ సారి మాత్రం దోషుల లిస్ట్‌లో చేర్చింది. వివేకా హత్య తరువాత సాక్ష్యాలను మాయం చేసేందుకు అవినాష్‌ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌ రెడ్డి సహకరిచారని సీబీఐ ఆరోపించింది. హత్య తరువాత నిందితులు ఆయుధాలతో అవినాష్‌ రెడ్డి ఇంటికి కూడా వెళ్లారనేది సీబీఐ అభియోగం. దీంతో ఐదోసారి అవినాష్‌ రెడ్డిని అరెస్ట్‌ చేస్తారంటూ ప్రచారం జరిగింది. దీంతో కోర్టులో పిల్‌ దాఖలు చేశారు అవినాష్‌ రెడ్డి.

దీనిపై విచారణ జరిపిన కోర్టు అవినాష్‌ను అరెస్ట్‌ చేయొద్దంటూ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ప్రతీ రోజూ సీబీఐ కార్యాలయానికి వెళ్లి సంతకం చేయాలని సూచించింది. అవినాష్‌ రెడ్డి విచారణను ఆడియో, వీడియో రికార్డ్‌ చేయాలంటూ అధికారులను ఆదేశించింది. కానీ అప్పటి నుంచి సీబీఐ అవినాష్ రెడ్డిని విచారణకు పిలువలేదు. సుమారు 20 రోజుల తరువాత మళ్లీ ఇప్పుడు అవినాష్‌ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. అరెస్ట్‌ చేయొద్దంటూ కోర్ట్‌ విధించిన గడువు కూడా ముగిసింది. దీంతో ఈ విచారణ అనంతరం అవినాష్‌ను అరెస్ట్‌చేస్తారనే టాక్‌ నడుస్తోంది. అయితే 19 అవినాష్‌ రెడ్డి విచారణకు హాజరౌతారా లేక మరింత సమయం కావాలంటూ సీబీఐకి లేఖ రాస్తారా అనేది సస్పెన్స్‌గా మారింది.