Jamili Elections: జమిలి ఎన్నికలు సాధ్యం కాదు.. కేంద్రం స్పష్టీకరణ.. కారణాలివే..!

కేంద్రానికి, అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడమే జమిలి ఎన్నికలు. దీనికోసం గతంలో చాలా ప్రయత్నాలు జరిగాయి. ఇటీవల కేంద్రంలోని బీజేపీ కూడా ఈ దిశగా ప్రయత్నాలు చేసింది. వివిధ పార్టీలతో, న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపింది.

  • Written By:
  • Publish Date - July 28, 2023 / 07:59 PM IST

Jamili Elections: దేశంలో జమిలి ఎన్నికలు జరపడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. జమిలి ఎన్నికల నిర్వహణపై గురువారం రాజ్యసభలో కేంద్రం ప్రకటన చేసింది. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ ఈ అంశంపై కీలక వివరాలు వెల్లడించారు. కేంద్రానికి, అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడమే జమిలి ఎన్నికలు. దీనికోసం గతంలో చాలా ప్రయత్నాలు జరిగాయి. ఇటీవల కేంద్రంలోని బీజేపీ కూడా ఈ దిశగా ప్రయత్నాలు చేసింది. వివిధ పార్టీలతో, న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపింది. దీన్ని అమలు చేయడం సాధ్యం కాదని తెలిపింది. దీనికి ప్రధానంగా ఐదు అడ్డంకులున్నట్లు సభలో తెలిపింది.
కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. కేంద్రానికి, రాష్ట్రానికి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే పార్టీల మధ్య ఏకాభిప్రాయం రావాలి. మన దేశంలో సమాఖ్య పాలన సాగుతుంది కాబట్టి.. ఇతర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి అంత సులభంగా సాధ్యమయ్యే పని కాదు. జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే భారీ సంఖ్యలో ఈవీఎంలు, వీవీప్యాట్‌లు కావాల్సి ఉంటుంది. దీనికి అధిక నిధులు ఖర్చు చేయాలి. వేల కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించడం కష్టమైన వ్యవహారం. అలాగే భద్రతా సిబ్బంది భారీ స్థాయిలో అవసరమవుతారు. అదనపు భద్రత కూడా అవసరం. అన్నింటికంటే ముఖ్యమైంది.. రాజ్యాంగంలోని 5 అధికరణలకు సవరణ చేయాల్సి ఉంటుంది.

ప్రభుత్వాల కాల పరిమితికి సంబంధించిన 83వ అధికరణం, లోక్‌సభను రద్దు చేసేందుకు రాష్ట్రపతికి అధికారం ఇచ్చే 85వ అధికరంణం, అసెంబ్లీ కాలపరిమితిని నిర్ధరించే 172వ అధికరణం, రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించేందుకు ఉద్దేశించిన 356వ అధికరణం, అసెంబ్లీని రద్దు చేసే 174వ అధికరణంలను సవరించాలి. ఇవన్నీ అంత సులభంగా సాధ్యమయ్యే పనికాదు. దీనికి దీర్ఘకాలిక సంప్రదింపులు అవసరమవుతాయి. అందువల్ల జమిలి ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో సాధ్యం కాదని కేంద్రం తెలిపింది. అయితే, ఇప్పటికే ఈ అంశంపై పార్లమెంటరీ స్థాయి సంఘం ఏర్పాటు చేయగా.. ఆ సంఘం ఇచ్చిన నివేదిక, అందులోని సిఫారసులను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం వాటిని లా కమిషన్ ముందుంచి తాజా నిర్ణయం ప్రకటించింది.