Intelligence Survey in AP: ఏపీలో కేంద్రం రహస్య సర్వే.. అధికారం ఎవరిదో తెలుసా..!?

పవన్ కల్యాణ్ బీజేపీ నుంచి ఎప్పుడైతే దూరం జరుగుతున్నారని అర్థమైందో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏపీలో పరిస్థితులను అధ్యయనం చేయడం మొదలు పెట్టింది. కేంద్ర ఇంటెలిజెన్స్ ను రంగంలోకి దింపి సర్వే చేయించింది.

  • Written By:
  • Publish Date - April 6, 2023 / 05:12 PM IST

ఆంధ్రప్రదేశ్ లో ఎవరితో కలిసి ఉండాలనేదానిపై ఏదో ఒకటి డిసైడ్ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది బీజేపీకి. ఇన్నాళ్లూ జనసేనతో కలిసి బీజేపీ ట్రావెల్ చేస్తోంది. అలాగే అధికార వైసీపీ .. బీజేపీతో సన్నిహితంగా ఉంటోంది. టీడీపీతో కూడా ప్రస్తుతానికి బీజేపీకి సమస్యలు లేవు. అయితే ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీని ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో ఉన్నారు. బీజేపీతో వైసీపీ ఇలాగే సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తే ఆ పార్టీతో కలిసి వెళ్లడం కష్టమనేది పవన్ కల్యాణ్ ఆలోచన. అందుకే బీజేపీ వైఖరేంటో చెప్పాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేస్తున్నారు.

పవన్ కల్యాణ్ రెండ్రోజుల ఢిల్లీ పర్యటన పూర్తిగా పొత్తులపైనే సాగింది. ఏపీలో ఇప్పుడున్న పరిస్థితులను బీజేపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. బీజేపీ- జనసేన కలిసి పోటీ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది.. టీడీపీ-బీజేపీ-జనసేన కలిసి ఉమ్మడిగా ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుంది.. వేటికవే సెపరేట్ గా పోటీ చేస్తే ఫలితం ఏంటి.. అనే అంశాలపై పవన్ నివేదిక ఇచ్చారు. వీటన్నింటినీ బీజేపీ అధిష్టానం అధ్యయనం చేసి ఒక నిర్ణయం చెప్పాలని పవన్ కల్యాణ్ కోరారు. అదే సమయంలో బీజేపీ చెప్పే సమాధానాన్ని బట్టి తన తదుపరి ప్రయాణం ఉంటుందని కూడా పవన్ కల్యాణ్ చెప్పారు. దీంతో బీజేపీ వీలైనంత త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

అయితే పవన్ కల్యాణ్ బీజేపీ నుంచి ఎప్పుడైతే దూరం జరుగుతున్నారని అర్థమైందో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏపీలో పరిస్థితులను అధ్యయనం చేయడం మొదలు పెట్టింది. కేంద్ర ఇంటెలిజెన్స్ ను రంగంలోకి దింపి సర్వే చేయించింది. ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది.. ఎవరు గెలిస్తే తమకు ప్రయోజనం ఉంటుంది.. లాంటి అనేక అంశాలను ఆరా తీసింది. అయితే ఈసారి అధికార వైసీపీకి సీట్లు భారీగా తగ్గుతాయని తేల్చింది. కానీ అధికారం మాత్రం జగన్ దేనని తేల్చింది. టీడీపీ బాగా పుంజుకుందని, కానీ అధికారం చేజిక్కించుకోవడం కష్టమేనని వెల్లడించింది. కేంద్ర ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదిక ప్రకారం బీజేపీ పొత్తులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

వైసీపీనే ఈసారి కూడా ఏపీలో అధికారంలోకి రావాలని బీజేపీ కోరుకుంటోంది. ఎందుకంటే బీజేపీ ఎదగాలంటే అక్కడ వైసీపీ ఉండడం ముఖ్యం. ఒకవేళ చంద్రబాబు అధికారంలోకి వస్తే టీడీపీ బలపడిపోతుంది. అదే జగన్ అధికారంలోకి వస్తే టీడీపీ మరింత వీక్ అవుతుంది. అప్పుడు బీజేపీ బలపడేందుకు స్కోప్ ఉంటుంది. అందుకే వైసీపీ రావాలనేది బీజేపీ ఉద్దేశం. పైగా ఇప్పుడు అధికారంలేదు కాబట్టి చంద్రబాబు కామ్ గా ఉంటున్నారు. చంద్రబాబు ఒక్కసారి అధికారంలోకి వచ్చారంటే మళ్లీ చక్రం తిప్పేందుకు సిద్ధమైపోతారు. బీజేపీకి కూడా ఎసరు పెట్టేందుకు ఏమాత్రం వెనుకాడరు. చంద్రబాబు గురించి బీజేపీ పెద్దలకు బాగా తెలుసు. అందుకే చంద్రబాబును సీఎంగా చూడాలని అస్సలు అనుకోవట్లేదు బీజేపీ. కాబట్టి ఇప్పటికిప్పుడు టీడీపీతో కలిసి వెళ్లేందుకు బీజేపీ ఏమాత్రం ఆసక్తిగా లేదు.