Chalamalasetty Sunil: కాకినాడ ఎంపీ కోసం నాలుగోసారి చలమలశెట్టి సునీల్.. ఇప్పుడైనా ఐరన్ లెగ్ ముద్ర పోతుందా?

కాకినాడ ఎంపీగా వివిధ పార్టీల నుంచి పోటీ చేసి ఓడిపోయారు చలమలశెట్టి సునీల్. ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తే ఆ పార్టీ కూడా ఆయనతోపాటు ఓడిపోతుందనీ.. అధికారంలోకి రాదని జనంలోనూ, పొలిటికల్ సర్కిల్స్‌లోనూ బలమైన అభిప్రాయం ఉంది.

  • Written By:
  • Publish Date - February 2, 2024 / 08:42 PM IST

Chalamalasetty Sunil: తెలుగు రాష్ట్రాల్లో చలమలశెట్టి సునీల్ అంటే ఒక ఐరన్ లెగ్గుగా ముద్ర ఉంది. ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తే ఆ పార్టీ ఓడిపోతుందని జనం నమ్ముతారు. అసలు ఏపీ ఎన్నికల చరిత్రలోనే ఇలాంటి నాయకుడిని మరొకరిని చూడలేదని చెప్తుంటారు. ఒక్కసారి కాదు, రెండుసార్లు కాదు, మూడుసార్లు కాకినాడ ఎంపీగా వివిధ పార్టీల నుంచి పోటీ చేసి ఓడిపోయారు చలమలశెట్టి సునీల్. ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తే ఆ పార్టీ కూడా ఆయనతోపాటు ఓడిపోతుందనీ.. అధికారంలోకి రాదని జనంలోనూ, పొలిటికల్ సర్కిల్స్‌లోనూ బలమైన అభిప్రాయం ఉంది. ఇప్పుడు నాలుగోసారి సునీల్ మళ్లీ కాకినాడ లోక్‌సభ స్థానానికి వైసీపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

REVANTH REDDY: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే దమ్ముందా..? కేసీఆర్ మళ్లీ సీఎం కాలేరు: రేవంత్ రెడ్డి

మరి చరిత్ర పునరావృతం అవుతుందా.. లేదా చరిత్ర తిరగబడుతుందా చూడాలి. దేశంలోనే ప్రముఖ గ్రీన్ ఎనర్జీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, నిర్మాణ సంస్థ అయినా గ్రీన్ కో కంపెనీలో చలమలశెట్టి సునీల్ భాగస్వామి. ఆయన సోదరుడు చలమల శెట్టి అనిల్ గోపి.. గ్రీన్ కో మేనేజింగ్ డైరెక్టర్. కాపు సామాజిక వర్గానికి చెందిన సునీల్ ఎక్కువకాలం యూరప్‌లో ఉన్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి కాకినాడ ఎంపీగా పోటీ చేశారు. అప్పుడు కాంగ్రెస్ నేత పల్లం రాజు చేతిలో ఓడిపోయారు. సునీల్ ఓటమితో పాటు అప్పుడు 2009లో పీఆర్పీ కూడా దారుణంగా ఓడిపోయింది. ఆ తర్వాత 2014లో వైసీపీలో చేరారు. మళ్లీ కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేశారు. రెండోసారి కూడా అక్కడ సునీల్ కి ఓటమి తప్పలేదు. ఈసారి టిడిపి నేత తోట నరసింహం.. సునీల్‌పై 3 వేల 500 ఓట్ల తేడాతో గెలుపొందారు. చలమల శెట్టి దురదృష్టానికి అందరూ బాధపడ్డారు. కాకినాడలో సునీల్ ఎలా ఓడిపోయాడో ఆయన పోటీ చేసిన పార్టీ వైసీపీ కూడా ఏపీలో ఓడిపోయింది. దీంతో సునీల్ పోటీ చేసిన పార్టీ ఎన్నికల్లో కచ్చితంగా ఓడిపోతుందనే సెంటిమెంట్ మొదలైంది. 2019లో సునీల్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నాడు.

ముచ్చటగా మూడోసారి టీడీపీ నుంచి ఎంపీగా బరిలోకి దిగాడు. మళ్లీ పాత కథే రిపీట్ అయింది. సునీల్ ఓడిపోయాడు ఆయనతోపాటు టీడీపీ కూడా దారుణంగా ఓడిపోయింది. సునీల్ ఏ పార్టీ తరపున పోటీ చేస్తే.. ఆ పార్టీ ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒక సెంటిమెంట్ వచ్చేసింది. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక జగన్… సునీల్ పై కక్ష సాధింపుకు దిగారు. ఆయన కంపెనీ గ్రీన్ కో పై ప్రభావం పడింది. వెంటనే సునీల్ ఆయన సోదరుడు అనిల్ గోపి ఇద్దరూ ముఖ్యమంత్రి జగన్ తో రాజీ పడ్డారు. సునీల్ కి రాజ్యసభ సీటు ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఒప్పందం ప్రకారం సునీల్ టీడీపీని వదిలి మళ్లీ వైసీపీలో చేరారు. కానీ రాజ్యసభ సీటు దక్కలేదు. ఇప్పుడు జగన్ ఆదేశించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సునీల్ నాలుగో సారి కాకినాడ ఎంపీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఒక పార్లమెంట్ స్థానం నుంచి వరసగా నాలుగు సార్లు పోటీ చేసిన అభ్యర్థి సునీల్ మాత్రమే. అలాగే మూడుసార్లు వేర్వేరు పార్టీల నుంచి నిలబడి ఓడిపోయిన ఘనత కూడా చలమలశెట్టి సునీల్ దే. ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తే ఆ పార్టీ కచ్చితంగా ఓడిపోతుందని జనంలో బలమైన నమ్మకం వచ్చేసింది.

Malkajgiri: మల్కాజ్‌గిరి ఎంపీ సీటుకి సూపర్ డిమాండ్.. 100 కోట్లు పెట్టే మొనగాడు ఎవరు..?

ఆయన్ని ఐరన్ లెగ్ కాండిడేట్ అంటారు. ఒక మనిషిని దురదృష్టం ఎంతగా వెంటాడుతుందా అని అనిపిస్తుంది. పార్టీలు మారినా… దురదృష్టం మాత్రం సునీల్ వదిలిపెట్టలేదు. PRP, YCP, TDP మూడు పార్టీల్లోనూ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారంటే పరిస్థితులు చలమల శెట్టికి ఎన్ని రకాలుగా అడ్డం తిరుగుతున్నాయో అర్థమవుతుంది. జీవితంలో ఒక్కసారైనా ఎంపీ కావాలని లక్ష్యంతో సునీల్ చేసే ప్రయత్నం చాలామందిని ఆశ్చర్యపరుస్తుంది కూడా. ఇప్పుడు నాలుగోసారి కాకినాడ నుంచి బరిలో దిగుతున్నారు. మరి సెంటిమెంట్ రిపీట్ అవుతుందా లేదా బ్రేక్ అవుతుందా చూడాలి. సెంటిమెంట్ రిపీటైతే సునీల్ తో పాటు వైసీపీ కూడా ఓడిపోతుంది. సెంటిమెంట్ బ్రేక్ అయితే చలమల శెట్టి సునీల్ గెలుస్తాడు. 15 ఏళ్ల పాటు అపజయాలతో కొట్టుకుపోయిన చలమల శెట్టి ఈసారి ఏం చేస్తాడో చూడాలి. 2024 లోక్ సభ ఎన్నికల్లో అందరి దృష్టి కాకినాడ ఎంపీ సీటు పైనే ఉంది. సునీల్ ఓడిపోయిన గెలిచిన రికార్డే అవుతుంది.