మోడీని డిమాండ్ చేసి సాధిస్తున్న బాబు

2014 నుంచి 2019 వరకు మీడియాలో ఏపీ గురించి వార్తలు చూసిన అందరికి అప్పట్లో బిజెపి, టీడీపీ సంబంధాల విషయంలో ఒక క్లారిటీ ఉండే ఉంటుంది. అమరావతి శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ... పార్లమెంట్ లో మట్టి మొదలు... 2018 బడ్జెట్ వరకు కూడా... ఏపీకి ఇచ్చిన నిధులు చాలా చాలా తక్కువ.

  • Written By:
  • Publish Date - September 19, 2024 / 07:34 PM IST

2014 నుంచి 2019 వరకు మీడియాలో ఏపీ గురించి వార్తలు చూసిన అందరికి అప్పట్లో బిజెపి, టీడీపీ సంబంధాల విషయంలో ఒక క్లారిటీ ఉండే ఉంటుంది. అమరావతి శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ… పార్లమెంట్ లో మట్టి మొదలు… 2018 బడ్జెట్ వరకు కూడా… ఏపీకి ఇచ్చిన నిధులు చాలా చాలా తక్కువ. విభజన హామీల విషయంలో కూడా రాష్ట్రానికి వచ్చింది జీరో. ప్రత్యేక హోదా అనేది అప్పటి ప్రతిపక్ష నేత జగన్ రాజకీయానికి తప్పించి ఏపీ ప్రజలకు ఉపయోగపడింది చాలా తక్కువ. ఇక ప్రధాన మంత్రిని కలవడం కూడా చంద్రబాబుకి కష్టంగా మారేది.

ఇప్పుడు సీన్ మారింది… ఏపీ అలా అడిగితే ఇలా నిధులు వచ్చేస్తున్నాయి. అది బడ్జెట్ అయినా బెజవాడ వరదలు అయినా తెలంగాణా నుంచి రావాల్సినవి అయినా సరే రోజుల వ్యవధిలో రాష్ట్రానికి వచ్చేస్తున్నాయి. ఎస్ ఈ వంద రోజుల్లో చంద్రబాబు అడిగిన వాటిల్లో ఏ ఒక్కటి కేంద్రం కాదు అనలేదు. బడ్జెట్ ప్రవేశ పెట్టె ముందు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళారు. బడ్జెట్ లో తనకు ఏం కావాలో ప్రధానికి, ఆర్ధిక మంత్రికి ఓ నివేదిక ఇచ్చారు. అంతే ప్రపంచ బ్యాంకు నుంచి తిరిగి కేంద్రమే చెల్లించే విధంగా… రాష్ట్రానికి 15 వేల కోట్లు కేటాయించింది.

ఆ డబ్బులు ఆరు నెలల్లో రాష్ట్రానికి అందుతాయి. ఇక పోలవరం ప్రాజెక్ట్ లో పూర్తి బాధ్యత తమదే అని ఆర్ధిక మంత్రి ప్రకటించారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలుగులోనే జనాలకు క్లారిటీ ఇచ్చారు. పునరావాసం నుంచి ప్రతీ ఒక్కటి తామే చూసుకుంటాం అన్నారు. అలాగే వెనుక బడిన రాష్ట్రాలకు నిధులను కూడా కేటాయించారు. ఇటీవల తెలుగు రాష్ట్రాలకు మూడు పారిశ్రామిక నగరాలను కేటాయిస్తే అందులో రెండు ఏపీకే కేటాయించింది కేంద్రం. ఇక తెలంగాణా చెల్లించాల్సిన బాకీలను కూడా స్వయంగా కేంద్రమే చెల్లించింది రాష్ట్రానికి.

ఇక విజయవాడ వరదల విషయానికి వస్తే… రాష్ట్రానికి కేంద్రం పెద్దన్న పాత్ర పోషించి అండగా నిలబడిన మాట వాస్తవం. ఆదివారం వరద వస్తే… చంద్రబాబు… కేంద్ర మంత్రి అమిత్ షా కు ఫోన్ చేసిన వెంటనే… సోమవారం ఉదయానికి బెజవాడలో కేంద్ర ప్రభుత్వ బృందాలు రంగంలోకి దిగాయి. హెలికాప్టర్లను విశాఖ, హైదరాబాద్ నుంచి రంగంలోకి దించారు. సాధారణంగా వరదలు వస్తే కేంద్ర బృందాలు ఎప్పుడో రెండు నెలలకు వస్తాయి. కాని కేంద్ర మంత్రి బృందం సరిగా నాలుగు రోజులకు… ఆదివారం వరద వస్తే గురువారం కేంద్ర మంత్రి వరద బాధిత ప్రాంతాల్లో తిరిగారు.

ఆ పర్యటన కూడా ఏమీ నామమాత్రంగా సాగలేదు. ముంపు ప్రాంతాలతో పాటుగా ఏరియల్ సర్వే చేసి పంటలను కూడా పరిశీలించారు. బుడమేరు గండి పడిన ప్రాంతాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా పరిశీలించారు. అదే రోజు సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసేసారు. కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుంది, గండి పూడ్చడానికి ఆర్మీ వస్తుంది అన్నారు. ఆర్మీ తర్వాతి రోజు ఉదయమే ఇంజనీరింగ్ బృందంతో కలిసి బెజవాడలో దిగి గండ్లు పూడ్చివేతను యుద్ద ప్రాతిపదికతో పూర్తి చేసింది.

ఇక వరద పూర్తిగా తగ్గక ముందే మాకు 6800 కోట్లు నష్టం వాటిల్లింది అని ఆర్ధిక శాఖ అధికారులతో నివేదిక తయారు చేయించి కేంద్రానికి పంపించారు చంద్రబాబు. దానిపై త్వరలోనే నిధులు విడుదల అవుతాయి. ఇలా కేంద్రం నుంచి ఏదైనా సాధించడంలో డిమాండ్ చేసి సాధిస్తున్నారు. 1999 కి ముందు చంద్రబాబుకి బిజెపికి ఈ విధంగానే సంబంధాలు ఉండేవి. రాష్ట్రానికి ఏం కావాలన్నా సరే చంద్రబాబు అడిగి సాధించుకునే వారు. ఇప్పుడు కేంద్రంలో మెజారిటీ తక్కువగా ఉండటమో లేక మరేదైనా కారణమో తెలియదు గాని చంద్రబాబు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు కేంద్ర పెద్దలు. చంద్రబాబు ఢిల్లీ వెళ్ళిన ప్రతీసారి మోడీని కలుస్తున్నారు.

ఇదే దూకుడు కొనసాగిస్తే రాబోయే 4 ఏళ్ళలో కూడా రాష్ట్రానికి నిధులు భారీగానే వచ్చే అవకాశం స్పష్టంగా ఉందనే విషయం అర్ధమవుతుంది. రాజధానితో పాటుగా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తే చంద్రబాబు పూర్తిగా సక్సెస్ అయినట్టే. ఇక రాజకీయ పరంగా కూడా బిజెపి నుంచి ఆయనకు ఇబ్బందులు ఏవీ రావడం లేదు. కేంద్ర బడ్జెట్ తర్వాత అనుమానాలు ఉన్న వాళ్లకు… కేంద్రమే స్వయంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి సమాధానం చెప్పింది. రాష్ట్రలో కూడా బిజెపి పూర్తిగా సహకరిస్తుంది. ఇలా బిజేపిని తన దారిలోకి తెచ్చుకోవడంలో చంద్రబాబు వంద రోజుల్లో వంద శాతం సక్సెస్ అయ్యారు.