ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ సిఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీ అప్పుల వివరాలను అసెంబ్లీలో తెలిపిన సీఎం చంద్రబాబు… ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు : రూ.9,74,556 కోట్లు అంటూ లెక్కలు బయటపెట్టారు. కాదని ఎవడైనా అంటే, అసెంబ్లీకి రండి అంటూ సవాల్ చేసారు. ఒక్క ఛాన్స్ అంటూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసారన్న చంద్రబాబు… రాష్ట్రంలో వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతోనే కూటమిగా ఏర్పడి పోటీ చేశామన్నారు.
93 శాతం స్ట్రైక్ రేట్తో గెలవడం ఒక చరిత్ర అన్నారు. మోదీ, పవన్, ప్రజలు నాపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారని దానిని నిలబెట్టుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తా అంటూ చంద్రబాబు స్పష్టం చేసారు. రాష్ట్ర విభజన సమయంలో అనేక సమస్యలు ఎదుర్కొన్నామన్నారు. 2014లో మనకు లోటు కరెంట్ ఉండేది. అనేక విధానాలు తీసుకొచ్చి మిగులు కరెంట్ పరిస్థితికి తెచ్చామన్నారు. కాని గత అయిదేళ్లుగా సర్వనాశనం చేసారని చంద్రబాబు మండిపడ్డారు.
ఈ సందర్భంగా సోషల్ మీడియాపై కూడా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. కన్నతల్లి శీలాన్ని శంకించేలా పోస్టులు పెట్టించారన్న ఆయన… ఆడబిడ్డలను కించపరిచేలా పోస్టులు పెడితే ఉపేక్షించమని హెచ్చరించారు. అవినీతి, అక్రమాలు చేసేందుకు కొందరు రాజకీయాల్లోకి వచ్చారని… వారిని ప్రజలు తరిమి కోడతారన్నారు. మహిళలను కించపరిచేలా కూటమి నేతలెవరూ పోస్టులు పెట్టరని తెలిపారు. ఒక వేళ అదే జరిగితే సొంతవాళ్లని కూడా చూడకుండా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.