Chandrababu: భవిష్యత్‌కు గ్యారంటీ పేరుతో టీడీపీ మేనిఫెస్టో చంద్రబాబు ప్రకటించిన 6 పథకాలు ఇవే..

మహానాడులో ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలు నిర్వహించిన టీడీపీ.. ముందే ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. టీడీపీ నిర్వహస్తున్న మహానాడులో.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు కీలక ప్రకటనలు చేశారు.

  • Written By:
  • Publish Date - May 28, 2023 / 09:10 PM IST

2024లో రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే లక్ష్యంతో మేనిఫెస్టోని ప్రకటించారు. అందులో ముఖ్యంగా ఆరు కీలక పథకాలను వెల్లడించారు. అందులో మొదటిది పేదలను ధనవంతులు చేయడం. ఐదేళ్లలో పేదల ఆదాయాన్ని రెట్టింపు చేసి.. పేదలను సంపన్నులుగా మార్చడమే లక్ష్యం అని వివరించారు.

రెండో పథకం.. బీసీలకు రక్షణ చట్టం. ఈ చట్టం తీసుకువచ్చి వెనుకబడిన వర్గాలకు అన్ని విధాలా అండగా నిలుస్తుందని చంద్రబాబు ప్రకటించారు. మూడో పథకం ఇంటింటికి మంచినీరు. టీడీపీ అధికారంలోకి వస్తే.. ఇంటింటికీ మంచి నీరు స్కీమ్ పేరుతో ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇస్తామని వివరించారు. నాలుగో పథకం అన్నదాత. ఈ స్కీమ్ కింద ప్రతీ రైతుకు ఏడాదికి 20వేల రూపాయల ఆర్థిక సాయం అందించడంతో పాటు.. రైతు ఆత్మహత్యలు నివారించేలా అన్నదాతలను అన్ని విధాలా ఆదుకునేలా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు వివరించారు.

టీడీపీ ప్రకటించిన మరో కీలక పథకం మహాశక్తి. మహిళా ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందించినట్లు కనిపిస్తోంది. ప్రతీ కుటుంబంలో 18 ఏళ్లు నిండిన మహిళలు ఎంతమంది ఉన్నా.. ప్రతీ ఒక్కరి ఖాతాలో నెలకు 15వందల రూపాయలు జమ చేస్తుందని టీడీపీ అధినేత తెలిపారు. దీంతో పాటు తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికీ ఏడాదికి 15వేల రూపాయల అందించాలని నిర్ణయించినట్లు వివరించారు. దీపం స్కీమ్ కింద.. ప్రతీ కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు.

వీటితో పాటు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే.. జిల్లాల్లో స్థానిక బస్సుల్లో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం అందిస్తామని చెప్పారు చంద్రబాబు. ఆరో స్కీమ్ యువగళం… వచ్చే ఐదేళ్లలో 20లక్షల మంది నిరుద్యోగులకు.. ఉపాధి కల్పన చేస్తామని, ఉద్యోగాలు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఉద్యోగం వచ్చేంత వరకు ప్రతీ నిరుద్యోగికి.. 3వేల రూపాయల నిరుద్యోగ భృతి అందిస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు.