నిజానికి ఆ ఎన్నికల్లో టీడీపీ పొత్తు పెట్టుకోవడానికి రకరకాల కారణాలు కనిపించాయ్. ఏపీకి చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో.. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం మీద యుద్ధం ప్రకటించి కాంగ్రెస్‌తో చెట్టాపట్టాల్ వేసుకొని తిరిగారు. అప్పట్లో రేవంత్ వ్యవహారంలో ఎలాగూ కేసీఆర్ మీద చంద్రబాబు కోపం మీద ఉన్నారు. దీంతో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసి ఝలక్ ఇవ్వాలని భావించారు. హస్తంతో దోస్త్ మేరా దోస్త్ అంటూ.. ఆ దోస్తీలో భాగంగా తెలంగాణలో మహాకూటమిగా ఏర్పడి పోటీ చేశారు. చంద్రబాబు ఆ నిర్ణయం టీడీపీని నిండా ముంచేయడమే కాదు.. అప్పటివరకు కాంగ్రెస్‌కు ఉన్న ఆశలను చెరిపేసింది.
2018 ఎన్నికల్లో కారుకు స్పేస్ ఇచ్చినట్లు అయింది. ఆ ఎన్నికల్లో ఏం జరిగింది.. ఎలాంటి ప్రభావం చూపిందన్న సంగతి ఎలా ఉన్నా.. ఆ పొత్తు నిర్ణయం మాత్రం టీడీపీని ఇప్పటికీ వెంటాడుతోంది. నిజానికి చంద్రబాబు చేసిన చరిత్రాత్మక తప్పిదం అదే అన్నది ఇప్పటికీ మెజారిటీ వర్గాల అభిప్రాయం. చంద్రబాబు పక్కా అవకాశవాది అని.. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకం అని.. ప్రత్యర్థికి ఆయనే స్వయంగా ఓ మాటను ఆయుధంగా అందించినట్లు అయింది. నిజానికి తెలుగుదేశం పార్టీ పుట్టుకే.. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా జరిగింది.
ఢిల్లీలో తెలుగుజాతికి అవమానం జరుగుతోంది. మనమీద ఢిల్లీ పెద్దల పెత్తనం ఏంటి.. కాంగ్రెస్ హఠావో అంటూ.. తెలుగు జాతి ఆత్మగౌరవమే నినాదంగా.. హస్తం పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ ఏర్పాటు అయింది. అలాంటిది అదే కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు. పైగా రాష్ట్ర విభజన చేసిందని.. ఏపీ జనాలంతా కాంగ్రెస్ మీద కోపంగా ఉన్నారు. రాష్ట్రాన్ని చీల్చిన పార్టీతో కలవడం.. చంద్రబాబు కేరక్టర్‌ను, పార్టీ కేరక్టర్‌ను తక్కువ చేసింది చాలావరకు ! తెలంగాణలో పొత్తుతో పోటీ చేసి.. మళ్లీ ఏపీలో హస్తాన్ని పట్టించుకోలేదు. ఇదంతా వదిలేస్తే.. ఇంత పొత్తు పెట్టుకొని కాంగ్రెస్‌తో కలిసి ఉన్నారా అంటే అదీ లేదు. ఇప్పుడు మళ్లీ బీజేపీకి ప్రేమలేఖలు రాస్తున్నారు.
కమలం దోస్తులను.. తన దోస్తులు చేసుకొని.. వారి ద్వారా దోస్తీ సందేశాన్ని పంపుతున్నారు. ఇప్పుడీ విషయాన్ని కూడా కాంగ్రెస్‌తో పొత్తుతో ముడిపెట్టి.. టీడీపీ కేరక్టర్‌ను డిసైడ్ చేస్తున్న పరిస్థితి. ఇలా ఐదేళ్ల కింద తీసుకున్న ఓ నిర్ణయం.. టీడీపీని ఇంకా నీడలా వెంటాడుతూనే ఉంది. నిజానికి తెలంగాణలో టీడీపీ పూర్తిగా జీరో కాలేదు. అలా కనిపిస్తోంది అంతే ! ఐతే స్పీడ్ అందుకోవాలి అనుకున్న ప్రతీసారి.. గతంలో తీసుకున్న నిర్ణయం స్పీడ్‌బ్రేకర్‌లా కాదు.. టోల్‌గేట్‌లా అడ్డుపడుతోంది. నిజానికి ఆ నిర్ణయం.. టీడీపీ పాలిట శాపంగా మారింది. అదే పార్టీని, చంద్రబాబును వెంటాడుతోందిప్పుడు !