Chandrababu Naidu: చంద్రబాబు అరెస్టు.. జగన్‌కు ప్లస్సా..? మైనసా..?

ఇంతకుముందు జైలుపాలైన జగన్, సానుభూతి పవనాలతో అధికారంలో రావడం ఎంత ఈజీగా జరిగిపోయిందో.. ఇప్పుడు జైలుపాలైన చంద్రబాబు, అధికారంలోకి రావడం కూడా అంతే ఈజీగా జరిగే అవకాశం ఉంటుందని విశ్లేషిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - September 11, 2023 / 05:53 PM IST

Chandrababu Naidu: చంద్రబాబు అరెస్టు.. రాజకీయ ప్రతీకార చర్యలు.. ఇప్పుడు ఇవే ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో పాటు 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తిని జైలులో పెట్టడాన్ని రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. దీన్ని ప్లస్ పాయింట్‌గా మలుచుకునే దార్శనికత, రాజకీయ చతురత చంద్రబాబుకు ఉందని అంటున్నారు. ఆకర్షణీయమైన ప్రజా సంక్షేమ పథకాలతో జనంలోకి బాగా వెళ్లిన జగన్.. ఈ రాజకీయ ప్రతీకార చర్యతో తన విలువను తగ్గించుకున్నారని పొలిటికల్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.

ఇంతకుముందు జైలుపాలైన జగన్, సానుభూతి పవనాలతో అధికారంలో రావడం ఎంత ఈజీగా జరిగిపోయిందో.. ఇప్పుడు జైలుపాలైన చంద్రబాబు, అధికారంలోకి రావడం కూడా అంతే ఈజీగా జరిగే అవకాశం ఉంటుందని విశ్లేషిస్తున్నారు. అరెస్టు ద్వారా చంద్రబాబును ఆత్మరక్షణలో పడేయాలని భావించిన ఏపీ సర్కారు.. ఆయనపై రాష్ట్రంలో సానుభూతి వేవ్ క్రియేట్ అయ్యేందుకు పరోక్షంగా హెల్ప్ చేసిందని అంటున్నారు. చంద్రబాబు ఫ్యామిలీ అంతా ప్రజల్లోకి రావాల్సిన అనివార్య పరిస్థితిని జగన్ సృష్టించారని, రానున్న రోజుల్లో వారు కలిసికట్టుగా రాష్ట్రమంతా పర్యటిస్తే పొలిటికల్ సీన్ ఛేంజ్ అవుతుందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. టీడీపీ అనుకూల సామాజిక వర్గాలు కొన్ని.. గత ఎన్నికల్లో జగన్ పార్టీకి ఓటేశాయి. అందుకే అంతగా అసెంబ్లీ సీట్లను వైఎస్సార్‌సీపీ గెల్చుకుంది. ఇప్పుడు ఆ సామాజిక వర్గాలు అంతర్మథనంలో పడి.. మళ్లీ బాబు వైపు వచ్చినా ఆశ్చర్యం లేదని భావిస్తున్నారు.
లోకేష్ పాదయాత్ర ఆపేస్తే..
చంద్రబాబు అక్రమ అరెస్టుపై ప్రజల్లోకి నారా భువనేశ్వరి, బ్రాహ్మణి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రం కోసం, ప్రజల కోసం కష్టపడుతున్న చంద్రబాబును తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టారని.. దీనికి న్యాయం మీరే చెప్పాలని వారు ప్రజా కోర్టుకు వెళ్లే యోచన చేస్తున్నారు. నారా లోకేష్‌పైనా సీఐడీ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయనను కూడా అరెస్ట్ చేస్తామని పరోక్షంగా చెప్పారు. ఒక వేళ అదే జరిగితే లోకేష్ పాదయాత్ర ఆపేయాల్సి ఉంటుంది. అందుకే నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలు పార్టీ తరపున రంగంలోకి దిగి.. లోకేష్ ఆపేసిన దగ్గర్నుంచి పాదయాత్రను చేపట్టాలని భావిస్తున్నారట.
నాడు షర్మిల.. నేడు భువనేశ్వరి, బ్రాహ్మణి
ఆనాడు జగన్ జైలులో ఉన్నప్పుడు.. షర్మిల పాదయాత్ర చేసి వైఎస్సార్‌సీపీని నిలబెట్టారు. ఇప్పుడు టీడీపీని నిలబెట్టేందుకు.. నారా భువనేశ్వరి, బ్రాహ్మణి సమాయత్తం అవుతున్నారు. ఈ అన్ని పాయింట్లను కలిపి చూసుకుంటే.. చంద్రబాబును అక్రమ అరెస్టు చేయడం వైఎస్సార్‌సీపీకి పెద్ద మైనస్ పాయింట్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రజా సంక్షేమ పథకాలు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలు, పార్టీ బలోపేతంపై జగన్ ఫోకస్ చేస్తే ప్రయోజనాలు ఉంటాయి కానీ.. ఈ విధంగా ప్రతిపక్ష నేతల అరెస్టుతో లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందని చెబుతున్నారు. గతంలో సానుభూతితోనే అధికారంలోకి వచ్చిన విషయాన్నీ జగన్ మరచిపోతున్నారని వార్నింగ్ ఇస్తున్నారు. ఏది ఏమైనప్పటికి చంద్రబాబు అరెస్ట్ విషయంలో జగన్ అండ్ టీం అత్యుత్సాహం, తొందరపాటుతో వ్యవహరించారనే అభిప్రాయమే ప్రజల్లో వ్యక్తమవుతోంది.