Chandrababu Naidu: చంద్రబాబు ఢిల్లీ టూర్.. బీజేపీతో పొత్తుపై చర్చిస్తారా..?

ఏపీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ లోపు రాష్ట్రంలో పొత్తులపై తేల్చుకోవాలి. ఎలాగూ జనసేన, టీడీపీ పొత్తు ఉంటుందనేది స్పష‌్టం. మరోవైపు జనసేన-బీజేపీ ఇప్పటికైతే కలిసే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జనసేన-టీడీపీ-బీజేపీ కలిసి పోటీ చేస్తే మంచిదని జనసేన ఆశిస్తోంది.

  • Written By:
  • Publish Date - August 25, 2023 / 04:03 PM IST

Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు త్వరలో ఢిల్లీలో పర్యటించబోతున్నారు. దివంగత సీఎం ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఎన్టీఆర్ చిత్రం కలిగిన రూ.వంద నాణేన్ని ఆర్బీఐ విడుదల చేయబోతుంది. ఈ నెల 28న రాష్ట్రపతి భవన్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి చంద్రబాబు సహా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను ఆహ్వానించారు. దీంతో ఈ కార్యక్రమానికి చంద్రబాబు హాజరవుతారు. అనంతరం అక్కడ పలువురు బీజేపీ నేతలను కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఏపీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ లోపు రాష్ట్రంలో పొత్తులపై తేల్చుకోవాలి. ఎలాగూ జనసేన, టీడీపీ పొత్తు ఉంటుందనేది స్పష‌్టం. మరోవైపు జనసేన-బీజేపీ ఇప్పటికైతే కలిసే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జనసేన-టీడీపీ-బీజేపీ కలిసి పోటీ చేస్తే మంచిదని జనసేన ఆశిస్తోంది. దీనికి టీడీపీ నుంచి కూడా సానుకూలత కనిపిస్తోంది. కానీ, బీజేపీవైపు నుంచే ఎలాంటి స్పందనా రావడం లేదు. జనసేనతో కలిసేందుకు బీజేపీ సిద్ధంగానే ఉన్నా.. టీడీపీతో పొత్తు విష‍యంలోనే ఇంకా మీనమేషాలు లెక్కిస్తోంది. దీంతో కూటమి పొత్తు విషయంలో సందిగ్ధత నెలకొంది. అందుకే ఈ విష‍యంపై బీజేపీతో చర్చించాలని చంద్రబాబు భావిస్తున్నారు. రెండు రోజులపాటు అక్కడే ఉండబోతున్న చంద్రబాబు వీలైతే మోదీ, అమిత్ షా, జేపీ నద్దా వంటి బీజేపీ పెద్దలను కలిసి, పొత్తులపై చర్చించే అవకాశం ఉంది.

ఇటీవలి కాలంలో వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ కూడా విమర్శలు చేస్తోంది. అయితే, ఆ పార్టీకి వ్యతిరేకంగా పెద్దగా కార్యక్రమాలు చేయడం లేదు. అలాగే కేంద్రంలో బీజేపీ, వైసీపీ చెట్టాపట్టాలు వేసుకుని ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ మద్దతు కూడగట్టడం టీడీపీకి కష్టంగా మారింది. మరోవైపు తెలంగాణలో మాత్రం టీడీపీ పొత్తు కోసం బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో మొన్నటిదాకా బలపడినట్లు కనిపించిన బీజేపీ ఇప్పుడు బలహీనంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో సత్తా చాటాలంటే టీడీపీ మద్దతు చాలా అవసరం. ఎందుకంటే టీడీపీకి హైదరాబాద్‌తోపాటు, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్ సహా కొన్ని జిల్లాల్లో మంచి పట్టుంది. ముఖ్యంగా ఏపీకి చెందిన సెటిలర్లు, ఒక సామాజికవర్గం ఓట్ల మద్దతు ఉంది. అందుకే టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఆ మేరకు ఓట్లు కలిసొస్తాయని బీజేపీ ఆలోచిస్తోంది. దీనికోసం రెండు పార్టీల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది.

తెలంగాణలో పొత్తులపై ఒక స్పష్టత వస్తే ఏపీలో పొత్తులపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఈ అంశంలో బీజేపీ వైఖరే కీలకం. ఏపీలో వైసీపీకి దూరం జరిగితేనే జనసేన, టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. అదే కేంద్రంలో వైసీపీ మద్దతే తమకు ముఖ్యం అని అనుకుంటే మాత్రం టీడీపీతో పొత్తుకు బీజేపీ ఒప్పుకోకపోవచ్చు. దీనిపై మరికొద్ది రోజల్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.