రోడ్ల మీద చెత్త ఉండేందుకు వీలు లేదు.. ఎన్ని ఫ్లాంట్లు అయినా పెడతాం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేసారు. ఈ రోజు మచిలీపట్నంలో గాంధీ జయంతి సందర్భంగా…స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో చెత్త పన్ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. చెత్త నుంచి కరెంటు తయారీ ప్లాంట్లను పునరుద్దరిస్తాం అన్నారు. ప్రతిఒక్కరూ స్వచ్చ సేవకులు కావాలి.. స్వచ్చ ఆంధ్రప్రదేశ్ సాధించాలి అని కోరారు. గాంధీ జయంతి న 2029 కి ఎపీ స్వచ్చ ఆంధ్రప్రదేశ్ గా తయారు కావాలని మనం సంకల్పం చేయాలి అని పిలుపునిచ్చారు.
మొన్న విజయవాడలో వచ్చిన వరదలలో పారిశుద్ద్య కార్మికులు చేసిన సేవలు చాలా గొప్పవన్నారు. బుడమేరు గండ్లు పూడ్చకుండా గత పాలకులు నిర్లక్ష్యం చేశారు అని మండిపడ్డారు. ప్రకాశం బ్యారేజీ నుంచి భారీగా వరద నీరు వచ్చిందని… విజయవాడ మొత్తం అతలాకుతలం అయ్యే పరిస్థితికి వచ్చిందని తెలిపారు. ఆరేడు అడుగుల నీరు రోడ్లపైనా, ఇళ్లల్లో నిలిచిందని నీరు పోయే పరిస్థితి లేక.. పై నుంచి వస్తున్న నీటితో తల్లడిల్లాం అని గుర్తు చేసుకున్నారు.
వరద బాధితులను ఆదుకునేందుకు తీవ్రంగా శ్రమించామన్నారు. చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని ప్యాకేజీ బాధితులకు ఇఛ్చామని తెలిపారు. ప్రతి ఇంటికి 25వేలు రూపాయలు ఇవ్వడం దేశంలోనే ప్రధమం అన్నారు చంద్రబాబు. వరద బాధితుల కోసం 450కోట్లు సీఎం రిలీఫ్ కు అందించడం కూడా ఒక చరిత్ర అన్న చంద్రబాబు నా జీవితంలో ఇంత సాయం గతంలో ఎన్నడూ చూడలేదు అని కొనియాడారు.