Chandrababu Naidu: గల్లీ స్థాయిలో కాదు.. చంద్రబాబు ఆలోచనలు ఎప్పుడూ ఢిల్లీ లెవల్‌లో ఉంటాయ్. ఆలోచనలు, నిర్ణయాలు, అడుగులు.. గతంలో అన్నీ జాతీయ స్థాయిలో కనిపించేవి. రెండు కేంద్ర ప్రభుత్వాల ఏర్పాటులో.. ముగ్గురు ప్రధానులు, ఇద్దరు రాష్ట్రపతుల ఎంపికలో ఆయన పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు! ఐతే ఇదంతా ఒకప్పుడు! ఇప్పుడు సీన్ మారింది. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఢిల్లీ పేరు ఎత్తే సాహసం కూడా చంద్రబాబు చేయడం లేదు. 2014లో బీజేపీతో పొత్తుతో ఎన్నికలు వెళ్లిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చారు. ఐతే మూడేళ్లు తిరిగేసరికి సీన్ సితార అయింది. ప్రత్యేక హోదా విషయంలో.. బీజేపీ మీదే యుద్ధం ప్రకటించారు. కమలంతో కయ్యానికి కాలు దువ్వి.. ఆ తర్వాత కాంగ్రెస్‌తోనూ స్నేహం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేశారు కూడా ! అప్పుడు మొదలు బీజేపీ, టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది. పవన్ పొత్తులకు ప్రయత్నాలు చేస్తున్నా.. బీజేపీ అస్సలు ఒప్పుకోనిది కూడా అందుకే!
ఓటమి తర్వాత మారిన వైఖరి
2019లో ఘోర పరాభవం మూటగట్టుకున్న చంద్రబాబు.. ఆ తర్వాత తీరు మార్చుకున్నారు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో, ఇంకెవరితోనో.. బీజేపీకి ప్రేమలేఖలు రాయడం మొదలుపెట్టారు. అవేవీ పెద్దగా సక్సెస్ అయినట్లు కనిపించడం లేదు. బీజేపీ మీద, మోదీ మీద ఒక్క కామెంట్ చేయడానికి కూడా చంద్రబాబు ధైర్యం చేయడం లేదు. ఒకరకంగా మోదీ అంటే భయం పట్టుకుంది ఆయనకి! రాహుల్ గాంధీ విషయమే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. రాహుల్‌గాంధీపై అనర్హత వేటు తర్వాత.. విపక్షాలన్నీ ఏకం అయ్యాయ్. బెంగాల్‌లో దీదీ నుంచి తెలంగాణలో కేసీఆర్ వరకు.. విపక్షాలన్నీ కేంద్రం తీరుపై భగ్గుమన్నాయ్.. ఒక్క చంద్రబాబు తప్ప! ఆ విషయం ఎత్తడం కాదు కదా.. రాహుల్ అనే పేరు కూడా చంద్రబాబు నోటి నుంచి వినిపించడం లేదు.
ఢిల్లీలో ప్రతిపక్షాలన్నీ కలిసి ఆందోళన నిర్వహించాయి. దీనిపై ఏపీలో ఏ పార్టీ నుంచి రియాక్షన్ లేదు. వైసీపీ అంటే ఎలాగూ బీజేపీ ఫేవర్‌గా ఉంది.. జనసేన పొత్తులో ఉంది.. కనీసం టీడీపీ అయినా రియాక్ట్ అవ్వాలి కదా! కానీ, భయమే చంద్రబాబును ఆపేసిందనే చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌తో దోస్తీ చేసి, కలిసి పోటీ చేసిన చంద్రబాబు.. ఇప్పుడు కనీసం స్పందించకపోవడం మాత్రం హైలైట్. అవసరం, భయం కవలపిల్లల్లాంటివి. అవసరం ఉంటే భయం ఉంటుంది.. భయం వేసిన ప్రతీసారి ఏదో తోడు అవసరం అవుతుంది. ఈ రెండే చంద్రబాబును సైలెంట్ చేస్తున్నాయ్. 2024లో ఏపీలో టీడీపీ కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. ఓడిపోయినా.. కనీసం పోటీ ఇవ్వకపోయినా.. సైకిల్ పార్టీ అడ్రస్ కూడా గల్లంతు అవుతుంది. వైసీపీని ఓడించాలంటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో అవసరం ఉంటుంది. కమలం పార్టీకి వ్యతిరేకంగా ఒక్క మాట అన్నా.. మోదీ కోపాన్ని తట్టుకునే స్థాయిలో చంద్రబాబు లేరు. ఆ భయమే రాహుల్ గాంధీ విషయంలో ఆయనను సైలెంట్ చేసినట్లు కనిపిస్తోంది.