Chandrababu Naidu: వైనాట్ పులివెందుల.. జగన్ అడ్డాలో చంద్రబాబు సవాల్..!

చంద్రబాబు కూడా వైనాట్ పులివెందుల అంటున్నారు. పులివెందులలో తమకూ అవకాశం ఇవ్వాలని కోరారు. బుధవారం పులివెందుల, పూల అంగళ్ల సెంటర్‌లో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు.

  • Written By:
  • Updated On - August 3, 2023 / 12:59 PM IST

Chandrababu Naidu: ఏపీ సీఎం జగన్.. చంద్రబాబు టార్గెట్‌గా కుప్పంపై కన్నేస్తే.. ఇప్పుడు చంద్రబాబు కూడా వైనాట్ పులివెందుల అంటున్నారు. పులివెందులలో తమకూ అవకాశం ఇవ్వాలని కోరారు. బుధవారం పులివెందుల, పూల అంగళ్ల సెంటర్‌లో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీపై, జగన్‌పై నిప్పులు చెరిగారు. భారీగా హాజరైన జన సందోహం మధ్య జగన్‌పై విరుచుకుపడ్డారు. చంద్రబాబు బహిరంగ సభకు జనం పెద్దఎత్తున హాజరయ్యారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ‘‘2015 వరకు ఇక్కడ నీళ్లు లేవు. పంటలు ఎండిపోతాయని టీడీపీ నేతలు నా దగ్గరికి వస్తే రెండు టీఎంసీల నీళ్లిప్పించా. పైడిపాలెంకు నీళ్లు అందించా. అక్కడి నుంచి చిత్రావతికి, అట్నుంచి పులివెందకు నీళ్చిచ్చా. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నోసార్లు పులివెందులకు వచ్చా. కానీ, ఈ రోజు మీ ఉత్సాహం చూస్తుంటే మీలో తిరుగబాటు కనిపిస్తోంది. కొద్దిగా నీళ్లిస్తే బంగారం పండించే రైతులు ఇక్కడ ఉన్నారు. రైతులు అరటితోటలు, చీనీతోటలు, వాణిజ్య పంటలు పండిస్తున్నారు. ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తే ఎంత అభివృద్ధి చెందుతుందో ఒక్కసారి ఆలోచించాలి. జగన్ పోలవరాన్ని నాశనం చేశాడు. నేను అధికారంలోకి వస్తే మళ్లీ పోలవరాన్ని పూర్తిచేస్తా. ఆ నీళ్లు తెచ్చి బనకచెర్లలో కలిపి రాయలసీకు అందిస్తా. సీఎం జగన్ పులివెందులలో బస్టాండ్ కూడా కట్టలేదని విమర్శిస్తేనే ఇక్కడ బస్టాండ్ నిర్మించాడు. ఇక్కడి నుంచి ఇసుక హైదరాబాద్, తమిళనాడు, బెంగళూరు పోతోంది.

బాబాయ్‌ని గొడ్డలి వేటు వేసిన వ్యక్తికి మీరు, నేను ఒక లెక్కా? పులివెందుల పులి సునీత. ఆమె తన తండ్రి ఆత్మకు శాంతి కలగాలని, తండ్రిని చంపిన వ్యక్తి ఎవరూ అని నిరూపించాలని పోరాడుతోంది. ఎవరు చంపారో మీకు తెలియదా..? కుప్పం వెళ్లి జగన్ నా గురించి మాట్లాడారు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా.. వైనాట్‌ పులివెందుల.. బీటెక్‌ రవిని మీకు అప్పగిస్తున్నా. ఆయనను గెలిపించాలి’’ అని పిలుపునిచ్చారు. చంద్రబాబు తన ప్రసంగంలో టీడీపీ రాయలసీమకు ఏం చేసిందో చెప్పారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పారు. తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. చంద్రబాబును కుప్పంలో ఓడించాలని వైసీపీ ప్రయత్నిస్తుంటే.. పులివెందులలో జగన్‌ను దెబ్బకొట్టాలని టీడీపీ భావిస్తోంది. అందుకే వీలైనంతగా అక్కడ ఫోకస్ చేస్తోంది టీడీపీ.