నిజానికి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. చంద్రబాబు పఠించే మంత్రం ఒక్కటే.. అదే అభివృద్ధి. హైదరాబాద్ మాట ఎత్తకుండా ప్రచారం సాగదు ఎప్పుడూ ఆయనది. 2019 ఎన్నికల్లోనూ అదే ప్రచారం చేశారు. ఐతే అదే సమయంలో జగన్ మాత్రం నవరత్నాలు అంటూ ఉచిత హామీలను ప్రచారం చేశారు. వైసీపీకి ఆకర్షితులయిన జనాలు.. చంద్రబాబును పట్టించుకోలేదు. దీంతో టీడీపీ ఘోర పరాభవం మూటగట్టుకుంది. దీంతో వైసీపీ బాటలోనే చంద్రబాబు నడిచినట్లు కనిపిస్తున్నారు. అందుకే ఆరు పథకాలు.. అన్నీ ఉచితాలే అన్నట్లుగా హామీలు గుప్పించారు. ఇదే ఇప్పుడు టీడీపీకి బూమరాంగ్ అయ్యేలా కనిపిస్తోంది.
చంద్రబాబుకు అసలే అవకాశవాది అనే పేరు ఉంది. ఇప్పుడీ మేనిఫెస్టోతో ఆయనను మరింత టార్గెట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉచిత పథకాలతో రాష్ట్రాన్ని శ్రీలంకలా తయారు చేస్తున్నారని.. మొన్నటివరకు టీడీపీ నేతలు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఆ పార్టీ అనుకూల మీడియాలోనూ ఇదే చర్చ జరిగింది కూడా ! ఐతే ఇప్పుడు చంద్రబాబు అంతకుమించి ఉచితాలు ప్రకటించారు. మరి దీనికి టీడీపీ ఎలాంటి ఆన్సర్ ఇస్తుందన్నది ఆసక్తకికరంగా మారింది. సంపద ఎలా క్రియేట్ చేస్తారు.. రెవెన్యూ ఎలా జనరేట్ చేస్తారనే విషయాలు చెప్పకుండా.. ఇలా ఉచితాలు గుప్పించడం.. టీడీపీని దెబ్బతీయడం ఖాయంగా కనిపిస్తోంది.
తెలంగాణకు హైదరాబాద్‌లాగా.. ఏపీకి భారీగా ఆదాయం ఇచ్చే నగరం ఒక్కటి కూడా లేదు! టీడీపీ అధికారంలోకి వచ్చాక.. ఈ హామీలన్నింటిని నెరవేర్చాలంటే.. పన్నులు ఎక్కువ వసూలు చేయాలి. అంటే జనాల మీద భారం ఎక్కువ మోపాలి. బాదుడే బాదుడు అని ఇప్పుడు రాగం అందుకున్న టీడీపీ.. దీనికి ఏం సమాధానం చెప్తుందన్నది మిలియన్ డాలర్ ప్రశ్న. చంద్రబాబు హామీల ప్రకటన వెనక.. జగన్‌ను ఎలాగైనా అధికారం నుంచి దింపాలన్న కసి కనిపించింది తప్ప.. దూరదృష్టి కనిపించలేదు అని మెజారిటీ వర్గాల నుంచి వినిపిస్తున్న అభిప్రాయం.
ఒక్కటి మాత్రం క్లియర్.. మహానాడు ప్రకటనల వెనక చంద్రబాబు మార్క్ అసలు కనిపించలేదు. రాజకీయంగా ఎవరు ఎన్ని విమర్శలు చేసినా.. చంద్రబాబుకు మంచి విజన్ ఉంది అన్నది నిజం. భవిష్యత్‌ను ముందే ఊహించి.. ఇవాళ ప్రకటన చేస్తారనే పేరు ఉంది. మేనిఫెస్టో ప్రకటన విషయంలో మాత్రం చంద్రబాబు మార్క్ కనిపించలేదు. ఎవరో రెడీ చేసిన పీపీటీని.. ఈయన ప్రజెంట్ చేసినట్లు ఉందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయ్. ఏ విషయంలో వైసీపీని విమర్శిస్తూ టీడీపీ దూసుకుపోతుందో.. అదే విషయాన్ని ఎత్తుకొని టీడీపీ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లు క్లియర్‌గా అర్థం అవుతుందనే చర్చ జరుగుతోంది