Chandrababu Naidu: స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో తనపై సీఐడీ నమోదు చేసిన FIRను కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు తరఫు లాయర్లు ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో సీఐడీని, స్కిల్ డెవలప్‌మెంట్ చైర్మన్‌ను ప్రతి వాదులుగా చేరుస్తూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై బుధవారం విచారణ జరగనుంది. మరోవైపు మెమో ఆఫ్ అప్పియరెన్స్ కింద చంద్రబాబు తరపున, థర్డ్ పార్టీ కింద ఏసీబీ కోర్టులో లాయర్ మహేష్ రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
చంద్రబాబుకి బెయిల్ ఇవ్వాలని కోరారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్టైన చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఆయనను జైలులో రిమాండ్‌లో ఉంచకుండా.. హౌజ్ అరెస్టు చేయాల్సిందిగా కోరుతూ లాయర్ సిద్ధార్థ్ లూథ్రా కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సోమవారం ఇరుపక్షాల మధ్య వాదన కొనసాగింది. మంగళవారం కూడా విచారణ జరిగింది. దీనిపై విజయవాడ సీబీఐ కోర్టు మంగళవారం సాయంత్రం తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. అయితే, సీఆర్పీసీలో జుడీషియల్ కస్టడీ, పోలీస్ కస్టడీ అనేవి మాత్రమే ఉన్నాయని, హౌజ్ అరెస్ట్ అనే మాటే లేదని, అందువల్ల చంద్రబాబు హౌజ్ అరెస్ట్ పిటిషన్‌ను తిరస్కరించాలని సీఐడీ తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. కాగా, కేసుకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్స్ కావాలని చంద్రబాబు లాయర్ సిద్ధార్థ్ లూథ్రా అన్నారు. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరోవైపు ఈ కేసు విచారణ కోసం చంద్రబాబును సీఐడీ ఐదు రోజులపాటు కస్టడీ కోరింది.
ఈ కేసులో చంద్రబాబును లోతుగా విచారించాల్సి ఉందని, అందువల్ల ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని సీఐడీ అడిగింది. దీనిపై విచారణ జరగాల్సి ఉంది. ఈ కేసుతోపాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబును సీఐడీ ఏ1 ముద్దాయిగా చూపించింది. దీంతో ఈ కేసులో కూడా చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి చంద్రబాబుకు ఇప్పటికే సీఐడీ పీటీ వారెంట్ జారీ చేసింది. ఒకవేళ ఆయనకు స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో బెయిల్ వస్తే.. వెంటనే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో అరెస్టు చేసేందుకు సీఐడీ సిద్ధంగా ఉంది. వరుస కేసులతో సీఐడీ.. చంద్రబాబును టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది.