Chandrababu Naidu: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబుకు రిమాండ్ విధించిన కేసులో ఆయన తరఫు లాయర్లు మరో రెండు పిటిషన్లు దాఖలు చేశారు.చంద్రబాబును గృహ నిర్బంధంలో ఉంచాలని, లేదా ఇంటి భోజనం, మందులు ఇచ్చేలా జైలులో ఏర్పాట్లు చేయాలని కోరుతూ చంద్రబాబు లాయర్లు రెండు పిటిషన్లు దాఖలు చేశారు.
మరోవైపు సీఐడీ కూడా ఇంకో పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబును వారం రోజులపాటు తమ కస్టడీకి అప్పగించాలని సీఐడీ కోర్టు కోరింది. విజయవాడలోని ఏసీబీ కోర్టులో ప్రస్తుతం ఈ అంశాలపై వాదనలు కొనసాగుతున్నాయి. వీటిలో కస్టడీ పిటిషన్ విచారణ సోమవారం కొనసాగనుంది. తాజా పిటిషన్ల నేపథ్యంలో చంద్రబాబు ఇంకా కోర్టులోనే ఉన్నారు. మరోవైపు చంద్రబాబును ఆయన సతీమణి భువనేశ్వరి, తనయుడు లోకేశ్, ఇతర కుటుంబ సభ్యులు కలిశారు. మరికొందరు టీడీపీ నేతలు కూడా ఆయనను కలిసేందుకు వెళ్తున్నారు.
చంద్రబాబును ఎలా తీసుకెళ్తారు..?
ప్రస్తుతం కోర్టులో వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. ఒకవేళ చంద్రబాబును గృహ నిర్బంధంలో ఉంచేందుకు అనుమతి వస్తే అధికారులు దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తారు. లేదంటే రాజమండ్రి జైలుకు తరలిస్తారు. అయితే, ఏ మార్గంలో తరలిస్తారు అనే అంశంలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రోడ్డు మార్గంలో తీసుకెళ్తే పూర్తి భద్రత ఏర్పాటు చేయాలి. దీని బదులు హెలికాప్టర్ లేదా ప్రత్యేక విమానంలో ఎయిర్ లిఫ్ట్ చేస్తారేమో అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలవుతోంది. రోడ్లపై ఎవరూ గుంపులుగా ఉండకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.
సెంట్రల్ జైలు వద్ద భారీ భద్రత
రాజమండ్రి సెంట్రల్ జైలుకు తొలిసారిగా మాజీ సీఎం స్థాయి వీఐపీ వస్తుండటంతో అక్కడి అధికారులు ఆ మేరకు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. జైలులో, పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. రాజమండ్రి జైలులోపలి పరిస్థితిని అక్కడి ఎస్పీ పరిశీలించారు. చంద్రబాబు ఉండేందుకు అనువైన ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాజమండ్రితోపాటు, గోదావరి జిల్లాల్లో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.