ముగ్గురు ఐపిఎస్ లను అష్టదిగ్బంధనం చేసిన బాబు… జీవోల్లో ఏముంది…?

ముంబై హీరోయిన్ కాదంబరి జత్వాని కేసులో డీజీ హోదాలో ఉన్న పీ ఎస్ ఆర్ ఆంజనేయులుతో పాటుగా విజయవాడ మాజీ సీపీ కాంతి రానా టాటా, మాజీ డీసీపీ విశాల్ గున్నీలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ కు గల కారణాలను ప్రభుత్వం వివరిస్తూ జీవో నెంబర్లు 1590, 1591, 1592 లతో మూడు జీవోలను విడుదల చేసింది.

  • Written By:
  • Publish Date - September 16, 2024 / 01:29 PM IST

ముంబై హీరోయిన్ కాదంబరి జత్వాని కేసులో డీజీ హోదాలో ఉన్న పీ ఎస్ ఆర్ ఆంజనేయులుతో పాటుగా విజయవాడ మాజీ సీపీ కాంతి రానా టాటా, మాజీ డీసీపీ విశాల్ గున్నీలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ కు గల కారణాలను ప్రభుత్వం వివరిస్తూ జీవో నెంబర్లు 1590, 1591, 1592 లతో మూడు జీవోలను విడుదల చేసింది. ఆ జీవోల్లో ఏముందో ఒకసారి పరిశీలిస్తే…

జీవో నెంబర్ 1590 పీఎస్ఆర్ ఆంజనేయులు

ఫిబ్రవరి 2 వ తేదీ కేసు రిజిస్టర్ అయితే జనవరి 31 నే పీ ఎస్ ఆర్ కాంతి రానా టాటా ను, విశాల్ గున్ని లను పిలిచి జత్వానీ కుటుంబాన్ని అరెస్టు చేయాలని ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారని విచారణలో వెల్లడి అయింది. తన అధికారాన్ని, హోదాను దుర్వినియోగం చేస్తూ కేసు పూర్వాపరాలు చూడకుండా తప్పుడు డైరెక్షన్ ఇచ్చారట ఆంజనేయులు. పీ ఎస్ ఆర్ చేపట్టిన చర్య ఘోరమైన దుష్ప్రవర్తన, అధికారిక పదవిని దుర్వినియోగం చేయడం అని ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం సాక్షులను ప్రభావితం చేసే అన్ని సామర్ధ్యాలు పీ ఎస్ ఆర్ కు ఉన్నాయని, ముంబైకి వెళ్లే అవకాశం ఉందని, రికార్డులను ధ్వంసం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారనే సస్పెన్షన్ చేస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. సస్పెన్షన్ పీరియడ్ లో అనుమతి లేకుండా విజయవాడ వదలి వెళ్లొద్దని పీ ఎస్ ఆర్ ను ప్రభుత్వం ఆదేశించింది.

జీవో నెంబర్ 1592, డీ ఐ జీ విశాల్ గున్నీ

విజయవాడ కమిషనరేట్ లో డిసిపి గా ఉన్న సమయంలో విశాల్ గున్ని… జత్వానీ అరెస్టు కు ముందు సరైన విచారణ జరపలేదని స్పష్టంగా పేర్కొంది. 31.01.2024న అప్పటి ఇంటెలిజెన్స్ డైరెక్ జనరల్ ఆఫ్ పోలీస్ పీ ఎస్ ఆర్ ఆంజనేయులును కలిసి, ఆయన మౌఖిక సూచనల మేరకు 02.02.2024న ముంబయికి వెళ్లి అరెస్టులు చేశారని తెలిపింది ప్రభుత్వం. ఎఫ్‌ఐఆర్ 02.02.2024 ఉదయం 6:30 గంటలకు నమోదు కాగా అంతకుముందే ముంబై వెళ్లిన విశాల్ గున్ని 02.02.2024 న ఎలాంటి ముందస్తు పాస్‌పోర్ట్ లేకుండానే ముంబైకి వెళ్లారని జీవోలో వెల్లడించారు. కేసు నమోదుకంటే ముందే అరెస్టు గురించి ప్రణాళిక వేయడం వెనుక ఉద్దేశాలు వేరేలా కనిపిస్తున్నాయని… అరెస్టయిన వారికి సరైన వివరణ ఇవ్వడానికి అవకాశం ఇవ్వడంలో గున్నీ విఫలమయ్యాడని ప్రభుత్వం పేర్కొంది. విశాల్ తో పాటుగా పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రానా టాటాను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

జీవో నంబర్ 1591, కాంతి రానా టాటా

దర్యాప్తును సరిగ్గా పర్యవేక్షించడంలో విజయవాడ సీపీ గా రానా విఫలమయ్యారని పభుత్వం పేర్కొంది. అరెస్టులు చేయాలని ఆదేశాలు ఇచ్చే ముందు ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి ప్రాథమిక విచారణ జరిపినట్లు నిర్ధారణ కాలేదని తెలిపింది. 31.01.2024న అప్పటి ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పీ ఎస్ ఆర్ ఆంజనేయులుని కలిశారని, ఆయన సూచనల మేరకు హడావుడిగా వ్యవహరించారని విచారణ లో తేలినట్టు ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది. నేరుగా తన సీ సీ కి చెప్పి డీసీపీ విశాల్ గున్నీ తో పాటు పలువురు అధికారులకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయించి హడావుడి చేయడం వెనుక కారణాలను వివరించింది ప్రభుత్వం.

రాణా ప్రస్తుతం సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని… ఆల్ ఇండియా సర్వీసెస్ క్రమశిక్షణ & అప్పీల్ రూల్స్ 1969లోని సెక్షన్ 3 (1) కింద అందించబడిన అధికారాలను ఉపయోగించి, ప్రభుత్వం అప్పటి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా ను సస్పెండ్ చేస్తోందని జీవోలో ప్రస్తావించారు. సస్పెన్షన్ సమయంలో కాంతి రాణా టాటా ప్రభుత్వ అనుమతి లేకుండా అతను ప్రధాన కార్యాలయాన్ని విడిచిపెట్టకూడదని స్పష్టం చేసింది.