Chandrababu Naidu: ఒక పక్క చంద్రబాబును, ఆయన తనయుడు లోకేశ్‌ను వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకు వైసీపీ ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తుండగా.. ఇప్పుడు చంద్రబాబు జగన్‌ను టార్గెట్ చేసి ముందుకెళ్తున్నారు. జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులపై చంద్రబాబు ఫోకస్ చేశారు. వచ్చే నెల 2, బుధవారం పులివెందులలో చంద్రబాబు భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. వైసీపీకి కంచుకోటగా భావిస్తున్న ఉమ్మడి కడప, నెల్లూరుపై టీడీపీ స్పెషల్ ఫోకస్ చేసిందని తెలుస్తోంది.
దీనిలో భాగంగా కడప జిల్లా జమ్మలమడుగు, పులివెందులలో చంద్రబాబు పర్యటించబోతున్నారు. బుధవారం ఈ రెండు నియోజకవర్గాల్లో బాబు పర్యటిస్తారు. ముందుగా జమ్మలమడుగు నియోజకవర్గం, కొండాపూర్ మండలం గండికోట ప్రాజెక్టు, ఎత్తిపోతల పథకాలను బాబు పరిశీలిస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పులివెందుల చేరుకుంటారు. స్థానిక పూలంగళ్ల సర్కిల్ వరకు రోడ్ షో ద్వారా చేరుకుని, అక్కడ బహిరంగ సభ నిర్వహిస్తారు. వైసీపీ వైనాట్ 175 అనే టార్గెట్ పెట్టుకున్న సంగతి తెలిసిందే. అంటే ఏపీలోని 175 నియోజకవర్గాల్లో గెలవాలని లక్ష‌్యంగా నిర్ణయించుకుంది. ఇప్పుడా పరిస్థితులు లేకున్నప్పటికీ.. టీడీపీకీ కంచుకోటగా ఉన్న కుప్పంపై వైసీపీ ఫోకస్ చేసింది. అక్కడ చంద్రబాబును ఓడించి, వైసీపీని గెలిపించుకోవాలి టార్గెట్‌గా పెట్టుకుంది. దీనిలో భాగంగా కుప్పంలో వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అక్కడ అభ్యర్థి, ఎమ్మెల్సీ భరత్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. దీంతో వైసీపీ అనుసరిస్తున్న వైనాట్ 175కు కౌంటర్‌గా టీడీపీ కూడా వైనాట్ పులివెందుల అనే టార్గెట్ పెట్టుకుని రంగంలోకి దిగింది.
పులివెందుల జగన్‌కు, ఆయన కుటుంబానికి కంచుకోట అనే సంగతి తెలిసిందే. అలాంటి చోట జగన్‌ను ఓడించడమే లక్ష‌్యంగా పని చేస్తోంది. ఇప్పటికే కడప జిల్లాలో నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర సక్సెస్ అయిందని టీడీపీ భావిస్తోంది. మరింత టార్గెట్ చేస్తే పులివెందులతోపాటు కడప జిల్లాలో మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశిస్తోంది. మరోవైపు అక్కడ జనసేన కూడా ప్రభావం చూపగలదు. అందుకే కడప జిల్లాకు చెందిన జనసేన నేతలతో కూడా టీడీపీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. జనసేన నేతల మద్దతుతో కడప జిల్లాలో వైసీపీని ఓడించాలని టీడీపీ భావిస్తోంది. వైసీపీకి కంచుకోటగా నిలిచిన నెల్లూరు, కడపల్లో ఆ పార్టీ ఓటమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు చంద్రబాబు. పులివెందులలో చంద్రబాబు నిర్వహించబోతున్న సభపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. ఈ సభకు హాజరయ్యే జనసందోహాన్ని బట్టి ఆ పార్టీ పరిస్తితిని అంచనా వేయొచ్చు.