Chandrababu Naidu: విజన్ డాక్యుమెంట్‌తో ముందుకురానున్న చంద్రబాబు.. అందులో ఏముంది..?

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న, విశాఖపట్నంలో విజన్ డాక్యుమెంట్ 2047 ఆవిష్కరించబోతున్నారు. సాయంత్రం 4గంటలకు విశాఖ బీచ్ రోడ్డులో విజన్ 2047 డాక్యుమెంట్ ప్రదర్శిస్తారు.

  • Written By:
  • Updated On - August 15, 2023 / 03:02 PM IST

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడును విజనరీ సీఎం అనే వాళ్లు అప్పట్లో. 2020లోపు ఉమ్మడి ఏపీ ఎలా ఉండాలి అనే అంశపై విజన్ 2020ని ప్రకటించారు. కాలక్రమేణా రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. ఆయన విజన్‌కు అర్థం లేకుండా పోయింది. అయితే, ఇప్పుడు మళ్లీ మరో విజన్‌తో ముందుకురాబోతున్నారు.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న, విశాఖపట్నంలో విజన్ డాక్యుమెంట్ 2047 ఆవిష్కరించబోతున్నారు. సాయంత్రం 4గంటలకు విశాఖ బీచ్ రోడ్డులో విజన్ 2047 డాక్యుమెంట్ ప్రదర్శిస్తారు. చంద్రబాబు చైర్మ‌గా వ్యవహరిస్తున్న గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్స్‌ఫర్మేషన్ (జీఎఫ్‌ఎస్‌టీ) సంస్థ గత కొన్నినెలలుగా విజన్ 2047 డాక్యుమెంట్ తయారీపై కృషి చేస్తోంది. దేశం ప్రపంచ స్థాయి లీడర్‌గా ఎదగడానికి దృష్టి సారించాల్సిన ఐదు అంశాలను ఈ డాక్యుమెంట్‌లో పొందుపరుస్తారు. 2047ను విజన్‌‌‌గా ఎంచుకోవడానికి కారణం ఉంది. అప్పటికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తవుతాయి. దేశం వందేళ్ల తర్వాత ఎలా ఉండాలి అనే అంశాలు ఇందులో ఉంటాయి. ఈ డాక్యుమెంట్ రూపకల్పనలో ప్రజలు, మేధావుల సలహాలు, అభిప్రాయాలు కూడా తీసుకుంటారు.
మరో రాజకీయ స్టంటా..?
చంద్రబాబు విజన్ 2020లో భాగంగా అప్పట్లో ఐటీకి ప్రాధాన్యం ఇచ్చారు. దాని ఫలాలు నిజంగానే అందుతున్నాయి. ఈ విషయంలో కచ్చితంగా చంద్రబాబును అభినందించాల్సిందే. అదే సమయంలో వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేశారు. రాబోయేది సాంకేతికరంగమే అంటూ.. వ్యవసాయంపై వివక్ష చూపారు. ఇలాంటి అనేక అంశాల్లో చంద్రబాబు విజన్ 2020పై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజల్ని మభ్యపెట్టేందుకు దీన్ని ప్రకటించారని విమర్శలొచ్చాయి. తాజాగా విజన్ 2047 డాక్యుమెంట్‌పై కూడా ఏపీలో అధికార వైసీపీ నుంచి విమర్శలు ప్రారంభమయ్యాయి. ఈ డాక్యుమెంట్ పేరుతో చంద్రబాబు మరో కొత్త మోసానికి తెరతీశారని వైసీపీ విమర్శిస్తోంది. చంద్రబాబును స్వయం ప్రకటిత దార్శనికుడు అంటూ వైసీపీ మంత్రులు అంటున్నారు. ఇంతకీ ఈ విజన్ 2047 డాక్యుమెంట్ ద్వారా చంద్రబాబు ఏం చెప్పాలనుకుంటున్నారు..? ఏం సాధిస్తారు..? అనేది తెలియాల్సి ఉంది. లేక నిజంగానే ప్రచారం కోసం చేస్తున్న స్టంట్‌గా భావించాలా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
తయారు చేస్తోందెవరు..?
జీఎఫ్‌ఎస్‌టీ సంస్థ స్వచ్ఛందంగా పని చేస్తోంది. దీనిలో ఆర్థికవేత్తలు, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, పర్యావరణ వేత్తలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో పని చేసిన సీనియర్ అధికారులు, కార్పొరేట్ ప్రముఖులు, విద్య, వైద్య, మీడియా, న్యాయ రంగ నిపుణులు, కార్పొరేట్ ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు. వీళ్లందరి ఆధ్వర్యంలో విధానాల రూపకల్పన, పరిశోధన, నాలెడ్జ్ షేరింగ్ వంటి అంశాలకు ఈ సంస్థ వేదికగా నిలుస్తోంది. మౌలిక వసతుల కల్పన, రవాణా, తయారీ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, నిర్మాణ రంగం, సాంకేతికరంగం, స్టార్టప్స్, ఆరోగ్యం, వాతావరణం వంటి అంశాల్లో ఈ సంస్థ సేవలందిస్తోంది.