CHANDRABABU NAIDU: చంద్రబాబు చుట్టూ మరో ఉచ్చు బిగుస్తోందా..? అసలేంటీ ఫైబర్‌ నెట్‌ కేసు..

ఫైబర్‌ నెట్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌‌ను విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. నవంబర్ 9కు విచారణ వాయిదా వేస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. ముందస్తు బెయిల్‌పై జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం శుక్రవారం బెయిల్ పిటిషన్‌ను పరిశీలించింది.

  • Written By:
  • Publish Date - October 20, 2023 / 05:23 PM IST

CHANDRABABU NAIDU: టీడీపీ అధినేత చంద్రబాబు చుట్టూ మరో ఉచ్చు బిగుస్తోందా..? స్కిల్‌ స్కాం కేసులో ఊరట దొరికిన వెంటనే మరో కేసుతో అష్టదిగ్భందనం చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందా. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. ఫైబర్‌ నెట్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌‌ను విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. నవంబర్ 9కు విచారణ వాయిదా వేస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. ముందస్తు బెయిల్‌పై జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం శుక్రవారం బెయిల్ పిటిషన్‌ను పరిశీలించింది. మొదట నవంబర్ 8కి వాయిదా వేయగా, చంద్రబాబు తరఫు న్యాయవాదుల విజ్ఞప్తితో ఆ డేట్‌ను 9కి మార్చింది.

అప్పటివరకూ పీటీ వారెంట్‌పై యథాతథ స్థితి కొనసాగించాలని, చంద్రబాబును అరెస్ట్ చెయ్యొద్దని ఆదేశించింది. మరోవైపు, స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై నవంబర్ 8న తీర్పు ఇస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ కేసులో ఇప్పటికే ఇరు వర్గాల వాదనలు ముగియగా తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది. స్కిల్ స్కాం కేసు తర్వాతే ఫైబర్ నెట్ సంగతి చూస్తామని స్పష్టం చేసింది సుప్రీం కోర్టు. రోజులు గడుస్తున్నకొద్దీ ఫైబర్‌ నెట్‌ కేసు తీవ్రంగా మారుతోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఫైబర్ నెట్‌పై విచారణకు స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీంను అపాయింట్‌ చేసింది. ఆ సిట్ తన దర్యాప్తులో రూ.121 కోట్ల రూపాయల స్కాం జరిగిందని తేల్చింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే.. అంటే 2019లోనే ఫైబర్ నెట్ స్కాం మీద సిట్‌ని నియమిస్తే.. అదే ఏడాది 19 మంది మీద సీఐడీ కేసుని నమోదు చేసింది. ఈ కేసులో ఏ1గా వేమూరి హరిప్రసాద్, ఏ2గా మాజీ ఎండీ సాంబశివరావు పేర్లను సిట్ పేర్కొంది.

ఇక వేమూరి హరిప్రసాద్.. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు అని బయట టాక్‌. దీంతో ఆ దిశగా సిట్ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. చివరికి ఈ స్కాంలో కూడా చంద్రబాబు పాత్ర ఉందంటూ పీటీ వారెంట్‌ దాఖలు చేసింది. ప్రస్తుతానికి ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్‌ చేయొద్దు అంటూ కోర్టు ఇచ్చిన వాయిదా నవండర్‌ 9 వరకూ ఉంది. ఆ తరువాత బెయిల్ విషయంలో కోర్టు నుంచి ఎలాంటి తీర్పు వస్తుంది అనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది.