CHANDRABABU NAIDU: మూడుసార్లు ముఖ్యమంత్రి.. 40 ఇయర్స్ ఇండస్ట్రీ.. కానీ, జస్ట్ రూ.300 కోట్ల స్కామ్‌లో ఇరుక్కుపోయారు. వేలు, లక్షల కోట్ల కుంభకోణం కాదు. మూడంటే మూడొందల కోట్లే. ఓ విజన్‌తో ముందుకెళ్తానని ఎప్పుడూ చెప్పుకునే చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అడ్డంగా బుక్కయ్యారు. తొలుత అరెస్టుతో ఆగుతుంది అనుకున్నారు. ఇలా వెళ్లి అలా వెళ్లి వచ్చేస్తాననుకున్నారు. మైలేజ్‌కు మైలేజ్.. రాజకీయంగా క్యాష్ చేసుకోవచ్చని తెలుగు తమ్ముళ్లు భావించారు. కానీ సీన్ రివర్స్ అయింది. రెండు వారాలు గడిచాయి. చూస్తుంటేనే నెల దాటింది. బాబుకు బెయిల్ వస్తుందో లేదో చెప్పలేని పరిస్థితి. ఈ కేసులో బెయిల్ వచ్చినా మరో కేసు వెంటాడుతూనే ఉంది.
ఇలా ఒకటి కాదు రెండు కాదు.. నాలుగైదు కేసులు చంద్రబాబు చుట్టూనే తిరుగుతున్నాయి. స్కిల్ డెవలప్‌మెంట్ కేసుని చంద్రబాబు అండ్ కో లైట్ తీసుకుంది. ఈ కేసు అసలు నిలువదు అనుకుంది. మూడొందల కోట్ల స్కామే బాబుని ముప్ప తిప్పలు పెడుతోంది. కేసుల మీద కేసులు బాబుపై పడుతున్నాయి. స్కిల్ కేసే కాదు ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్, అంగళ్లు కేసులు గుక్కతిప్పుకోకుండా చేస్తున్నాయి. ఇటు పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తున్నారు. అటు వాయిదాల మీద వాయిదాలు నడుస్తున్నాయి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ1గా చంద్రబాబుని సీఐడీ చేర్చింది. అటు ఫైబర్ నెట్ కేసుని సీఐడీ తెరమీదకు తెచ్చింది. చంద్రబాబుని విచారించడం కోసం ఏసీబీ కోర్టులో మరో పీటీ వారెంట్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ని ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించింది. ఇక అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుని మార్పులు చేసి అక్రమాలకు పాల్పడ్డారని సీఐడీ ఆరోపణలు చేసింది. ఈ విషయంలో చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై సీఐడీ అభియోగాలు మోపింది.
తమ భూముల విలువ పెరిగేలా ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్చారని చంద్రబాబుపై ఆరోపణలున్నాయి. ఇక అంగళ్లు కేసులో చంద్రబాబు ఏ1 గా ఉన్నారు. ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతోనే ఆరోజు ఘర్షణ జరిగిందని పోలీసులు ఆరోపించారు. ఈ కేసులో మాత్రం చంద్రబాబుకు ముందస్తు బెయిల్ వచ్చింది. మిగిలిన కేసుల్లో చంద్రబాబు ఇప్పుడిప్పుడే బయటకు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. మరోవైపు ఎన్నికలు వస్తున్నాయ్. పార్టీ కాడె మోసే వారే కరవయ్యారు. నడిపించే నాయకుడు భూతద్దం వేసి వెతికినా కనిపించడం లేదు. చివరకు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఆమెతోపాటు కోడలు బ్రాహ్మణి కూడా రోడ్డెక్కారు. చంద్రబాబు అరెస్టు, రిమాండ్‌పై గళం వినిపిస్తున్నారు. నిజానికి చంద్రబాబు జైలుకెళ్లాక టీడీపీ యాక్టివిటీస్ ఒక్కసారిగా తగ్గిపోయాయి. చంద్రబాబు అరెస్టు, రిమాండ్‌పై నిరసనలు తప్ప మరో కార్యక్రమం లేదు. ఏపీలో ఎన్నికలకు కొన్ని నెలలే మిగిలి ఉన్నాయి.
ఈ టైమ్‌లో పార్టీకి చంద్రబాబు దిశానిర్దేశం ఎంతో అవసరం. కానీ జైలు నుంచి ఇప్పుడప్పుడే బయటకొచ్చే సూచనలు కనిపించడం లేదు. మొత్తానికి ఎన్నికలకు ముందు రూ.3 వందల కోట్ల స్కామ్ చంద్రబాబుకు ఊపిరి సలపకుండా చేస్తోంది. మొత్తానికి చెరసాల సావాసం మరికొన్నాళ్లు తప్పేలా లేదు.