Chandrababu Naidu: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) అలైన్‌మెంటు మార్పు స్కాంతోపాటు అమరావతిలోని అసైన్డ్ భూముల జీవోపై చంద్రబాబుపై దాఖలైన కేసుల విచారణ వాయిదా పడింది. ఐఆర్ఆర్ కేసు విచారణను ఏపీ హైకోర్టు ఈ నెల 18కి వాయిదా వేసింది. ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబును అరెస్టు చేయకుండా.. ఆయన తరఫు లాయర్లు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ జరిగింది. అంతకుముందు గత బుధవారం కూడా ఈ కేసు విచారణ సాగింది. ఈ కేసులో సోమవారం (నేటి) వరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దంటూ ఏసీబీని ఆదేశించింది. కోర్టు విధించిన గడువు పూర్తి కావడంతో సోమవారం మరోసారి విచారణ జరిగింది.
అనంతరం విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. అప్పటివరకు చంద్రబాబు ముందస్తు బెయిల్ పొడిగించింది. ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్‌పై కూడా అప్పటి వరకూ విచారించవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై సీఐడీ కౌంటర్ దాఖలు చేసింది. తదుపరి వాదనల కోసం కేసు విచారణను హైకోర్టు వాయిదా వేసింది. బుధవారం ఈ కేసుపై తిరిగి విచారణ జరుగుతుంది. చంద్రబాబు హయాంలో ఐఆర్ఆర్ స్కాం జరిగిందని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబు పేరును కూడా సీఐడీ చేర్చింది. మరోవైపు అమరావతి అసైన్డ్ భూముల జీవోపై చంద్రబాబుపై సీఐడీ కేసు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే విచారణ పూర్తైంది. దీంతో హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. తీర్పు వెల్లడయ్యే సమయంలో సీఐడీ తరఫు న్యాయవాదులు కేసు రీ ఓపెనింగ్ పిటీషన్ దాఖలు చేశారు.
ఈ కేసుకు సంబంధించి తమ దగ్గర ఆడియో, వీడియో ఆధారాలు ఉన్నాయని, వాటిని కోర్టుకు సమర్పించాలనుకుంటున్నట్లు పిటిషన్‌లో చెప్పారు. దీనిపై చంద్రబాబు, నారాయణ తరపు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. దీంతో ఈ కేసు విచారణను హైకోర్టు నవంబర్ 1కి వాయిదా వేసింది. ఈ కేసులతోపాటు సుప్రీం కోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరగనుంది. ప్రధానంగా 17ఏ సెక్షన్‌పైనే ఈ కేసు విచారణ సాగుతోంది. అయితే, ఈ వారం చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తుందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి.