TDP-BJP: బీజేపీతో కష్టమే…! అయినా కలిసే పోటీ చేసే యోచనలో టీడీపీ..!!

చంద్రబాబుకు ఇప్పుడు మరో మార్గం కనిపించడం లేదు. వైసీపీని ఓడించాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు. పైగా దేశవ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్ తగ్గినా ఇప్పటికిప్పుడు బీజేపీని కాదని మరోపార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. అందుకే బీజేపీ, జనసేనతో కలిసి వెళ్లేందుకే బాబు సిద్ధమవుతున్నారు.

  • Written By:
  • Publish Date - July 26, 2023 / 04:43 PM IST

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నకొద్దీ రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. ముఖ్యంగా వైసీపీని ఎదుర్కొనేందుకు ఏఏ పార్టీలు కలుస్తాయనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. టీడీపీ – జనసేన కలిసి పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. అయితే ఈ కూటమిలో బీజేపీ చేరుతుందా.. లేదా అనేదానిపైనే ఇప్పుడు సస్పెన్స్ కొనసాగుతోంది. టీడీపీతో కలిసేందుకు బీజేపీ సిద్ధంగా లేదు. కానీ బీజేపీ కలిస్తేనే బాగుంటుందని టీడీపీ, జనసేన కోరుకుంటున్నాయి. తెలుగుదేశంతో కలిసేందుకు బీజేపీ రెడీగా లేకపోయినా… ఒంటరిగా పోటీ చేస్తే ఒక్క సీటు కూడా రాదనే భయం ఆ పార్టీని వెంటాడుతోంది. అందుకే కష్టమో నష్టమో టీడీపీతో కలిసి వెళ్లడమే మేలనుకుంటోంది.

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ప్రభావం ఏంటో కొత్తగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఒంటరిగా పోటీ చేస్తే ఆ పార్టీకి నోటా కంటే తక్కువ ఓట్లు వస్తాయి. ఒక్క సీటు కూడా దక్కదు. ఇప్పటివరకూ బీజేపీ అడపాదడపా సీట్లు సాధించిందంటే అది పొత్తుల వల్లే. ఈ విషయం ఆ పార్టీకి కూడా తెలుసు. దేశవ్యాప్తంగా ఆ పార్టీ తోపు అయినా ఏపీలో మాత్రం ఆ పార్టీ పప్పే. ఇప్పుడు కూడా పొత్తులు లేకుండా ఒక్క చోటా గెలవలేదు. ఈ విషయం తెలిసిన కొంతమంది బీజేపీ నేతలు టీడీపీతో కలిసి వెళ్లడమే మంచిదని సూచిస్తున్నారు. విభేదాలను పక్కనపెట్టి పొత్తు పెట్టుకుంటే బెటర్ అని సూచిస్తున్నారు..

మరోవైపు నిన్నమొన్నటివరకూ బీజేపీతో కలిసి వెళ్లేందుకు ఎక్కడలేని ఉత్సాహం చూపించింది. అయితే కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీలో ఆలోచన మొదలైంది. దేశవ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్ దారుణంగా పడిపోతున్నట్టు అర్థమైంది. అందుకే బీజేపీతో కలిసి వెళ్లేందుకు చంద్రబాబు ఇప్పుడు ఆలోచిస్తున్నారు. గతంలో బీజేపీ నుంచి పిలుపు వస్తే చాలనుకున్నారు. కానీ ఇప్పుడు పిలుపు వచ్చినా ఎగిరి గంతేసే పరిస్థితి లేదు. పైగా బీజేపీపై ఏపీ ప్రజల్లో ఎక్కడలేని కోపం ఉంది. బీజేపీతో కలిసి వెళ్తే దాని ప్రభావం కచ్చితంగా టీడీపీపై పడుతుంది. అందుకే చంద్రబాబు భయపడుతున్నారు.

అయితే చంద్రబాబుకు ఇప్పుడు మరో మార్గం కనిపించడం లేదు. వైసీపీని ఓడించాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు. పైగా దేశవ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్ తగ్గినా ఇప్పటికిప్పుడు బీజేపీని కాదని మరోపార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. అందుకే బీజేపీ, జనసేనతో కలిసి వెళ్లేందుకే బాబు సిద్ధమవుతున్నారు. అలా వెళ్లడం వల్ల భవిష్యత్ అవసరాలు తీర్చుకోవచ్చనేది బాబు ఆలోచన.