టీడీపీ ఆవిర్భావం తర్వాత ఎన్నడూ ఎదుర్కొని సంక్షోభం ఇప్పుడు ఎదుర్కొంటోంది. పార్టీ స్థాపించిన తర్వాత ఎన్టీఆర్ హయాంలో రెండు సంక్షోభాలను టీడీపీ ఎదుర్కొంది. అయితే ఆ సంక్షోభాలు పార్టీలో అంతర్గత కలహాలుగా ఉన్నాయో తప్ప.. బయట శక్తులు.. లేదా వ్యక్తుల నుంచి ఎదురైన సంక్షోభాలు దాదాపు అస్సలు లేవనే చెప్పాలి. ఇప్పటి వరకు టీడీపీ ఎదుర్కొన్న సంక్షోభాలు ఒక ఎత్తు అయితే.. చంద్రబాబు అరెస్ట్ తర్వాత పార్టీ ఎదుర్కొంటున్న సంక్షోభం మరో ఎత్తు. ఇది జైల్లో ఉన్న చంద్రబాబుకు కావచ్చు.. బయట ఉన్న లోకేష్ సహా పార్టీ సీనియర్లకు కావచ్చు.. లేక నారా-నందమూరి కుటుంబాలకు కావచ్చు.. అతి పెద్ద సవాలేనని చెప్పాలి. చంద్రబాబు జైలుకెళ్లిన తర్వాత ఇప్పుడు అందరిలోనూ ఒకటే చర్చ. వాట్ నెక్స్ట్..? హు ఈజ్ నెక్స్ట్..?
తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడు ఎదుర్కొనలేని సమస్య..
చంద్రబాబుది 40 ఏళ్లకు పైగా రాజకీయ జీవితం. సీఎంగా చేశారు.. ప్రతిపక్ష నేతగా చేశారు. ఈ 40 ఏళ్లకు పైగా ఉన్న రాజకీయ అనుభవంలో చంద్రబాబు ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు.. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఇప్పటి వరకు ఎదుర్కొన్న ఇబ్బందులు.. సంక్షోభాలు ఒక ఎత్తు.. ఇప్పుడు ఎదురైన ఇబ్బంది మరో ఎత్తు. రకరకాల ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం ద్వారా చంద్రబాబు కోర్టులకు వెళ్లి ఉంటారు కానీ.. ఈ తరహాలో ఓ అవినీతి కేసులో కోర్టులో పెద్ద ఎత్తున విచారణ ఎదుర్కొని జైలుకెళ్లడం చంద్రబాబుకు ఇదే తొలిసారి అనుభవం. ఈ కేసులను ఎలా అధిగమించాలి..? ఈ కేసుల నుంచి ఎలా బయటపడాలనే అంశంపై జరుగుతున్న పరిణామాలు ఓ ఎత్తు అయితే.. రాజకీయంగా పార్టీని ఏ విధంగా నిలబెడతారనేది మరో చర్చ. చంద్రబాబు తర్వాత ఆయన తనయుడు లోకేష్ ఉన్నా.. ఆయన్ను కూడా అరెస్ట్ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోన్న సందర్భంలో టీడీపీని ముందు ఉండి నడిపించే వారెవరు..? నాయకుడిగా నిలబడేదెవరు..? అనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్‌గా మారింది.
భవిష్యత్ నాయకుడెవరు..?
టీడీపీ ఆవిర్భావం తర్వాత.. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చాక.. ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని ఇప్పటి వరకు ఎదుర్కొలేదు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి సెంట్రల్ జైలుకు తరలించిన దగ్గర నుంచి జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే టీడీపీకి భవిష్యత్ నాయకుడెవరు..? అనే చర్చ జోరుగా సాగుతోంది. 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ వరుస ఓటములు ఎదురు చూసిన సందర్భంలో ప్రత్యేకించి 2009 ఎన్నికల్లో కూడా రెండోసారి ఓటమి చెందాక పార్టీకి భవిష్యత్ నాయకుడెవరు..? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. అప్పటికి లోకేష్ కూడా రాజకీయాల్లోకి పూర్తిగా రాని పరిస్థితి. దీంతో చంద్రబాబు పార్టీని లాగలేకపోతున్నారని.. పార్టీ పూర్తిగా గాడి తప్పిందని విపరీతంగా చర్చ జరిగింది. ఆ క్రమంలో చంద్రబాబు చేపట్టిన పాదయాత్ర పార్టీకి తిరిగి జవసత్వాలను కూడగట్టింది. గెలుపు బాట పట్టించింది. 2014 ఎన్నికల్లో టీడీపీ ఏపీలో విజయం సాధించింది. తెలంగాణలో కూడ టీడీపీకి 15 స్థానాలు వచ్చినా.. తెలంగాణలో ఆ పార్టీ మనుగడ కష్టంగా మారింది. కానీ ఏపీలో టీడీపీ గెలిచింది కాబట్టి.. పార్టీ ఏపీలో పట్టాలెక్కింది.
టీడీపీ పగ్గాలు నందమూరికే అందునా..?
ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఘోర వైఫల్యాన్ని చవి చూసింది. కేవలం 23 స్థానాలకే పరిమితం అయింది. ఈ సందర్భంలో కూడా పార్టీలో నాయకత్వం గురించి పెద్దగా చర్చ జరగలేదు. ప్రత్యర్థి వైసీపీ చాలా సందర్భాల్లో టీడీపీని నందమూరి కుటుంబం హస్తగతం చేసుకునే రోజు దగ్గర్లో ఉందనే విమర్శలు చేసినా.. పార్టీలో మాత్రం ఆ తాలుకా చర్చే లేదని చెప్పొచ్చు. పైగా గతంతో పోల్చుకుంటే భావి నాయకుడిగా లోకేష్ చేతికి అందించవచ్చు అనే చర్చ జరుగుతోంది. అలాగే లీడర్లు.. కేడర్‌లో కూడా లోకేష్ పట్ల గతంతో పోల్చుకుంటే చాలా వరకు యాక్సెప్టెన్స్ వచ్చింది. దీంతో ఇవాళ కాకున్నా.. రేపైనా చంద్రబాబు తర్వాత లోకేష్ నాయకుడనే నమ్మకం పార్టీ వర్గాల్లో కలిగింది. కానీ ఇప్పుడు సీన్ తారుమారైనట్టు కన్పిస్తోంది. పైకి ఎవ్వరూ బహిరంగంగా మాట్లాడకున్నా.. టీడీపీ భవిష్యత్ నాయకుడు ఎవ్వరనే చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం చంద్రబాబు జైల్లో ఉన్నారు. లోకేష్ వద్దకు పార్టీ నేతలు వెళ్తున్నారు.. సంఘీభావం తెలుపుతున్నారు.. కానీ త్వరలోనే లోకేష్ కూడా జైలుకెళ్లడం ఖాయమనే చర్చ జోరుగా ఉంది. దీనికి తగ్గట్టే వైసీపీ నేతల విమర్శలు కూడా ఉన్నాయి. దీంతో ఈ తరహా చర్చ బాగా జరుగుతోంది.
టీడీపీని లీడ్ చేసేది.. బాలయ్య..? భువనేశ్వరి..? బ్రాహ్మణి..? ఎవరు..?
పైగా చంద్రబాబు అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాలు కూడా టీడీపీని కొంత కలవరపాటుకు గురి చేస్తున్న పరిస్థితి. చంద్రబాబు లాంటి నేత అరెస్ట్ అయితే టీడీపీ శ్రేణులు కానీ.. నేతలు కానీ ఆశించిన స్థాయిలో స్పందించ లేదనే భావన చాలా మందిలో వ్యక్తమవుతోంది. నంద్యాల నుంచి విజయవాడకు.. ఆ తర్వాత విజయవాడ నుంచి రాజమండ్రికి తరలించే సందర్భంలో టీడీపీ కేడర్ పెద్దగా రోడ్ల మీదకు రాలేదనే చర్చ జరుగుతోంది. అలాగే అరెస్ట్ సందర్భంగా జరిపిన బంద్ కూడా అంతగా సక్సెస్ కాలేదనే విమర్శలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు తర్వాత లోకేష్ కూడా జైలుకెళ్లిపోతే.. పార్టీని ఎవరు లీడ్ చేస్తారనేది మిలియన్ డాలర్ల క్వశ్చన్‌గా మిగిలిపోతోంది. ఈ క్రమంలో పరిస్థితులు చక్కబడేంత వరకు బాలయ్య లీడ్ చేస్తారా..? లేక భువనేశ్వరి, బ్రహ్మాణిల్లో ఎవరైనా లీడ్ పొజిషన్‌లోకి వస్తారా..? అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా ఉంది.